Saturday, November 23, 2024
Homeట్రేడింగ్Hyd Real estate: హైదరాబాద్‌పై ఎన్నారైల " రియల్ "ఇంట్రస్ట్

Hyd Real estate: హైదరాబాద్‌పై ఎన్నారైల ” రియల్ “ఇంట్రస్ట్

“హైదరాబాద్ మహానగర స్థాయి నుండి అంతర్జాతీయనగరంగా శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. గ్రేటర్ హైదరాబాద్‌, మహానగర శివార్లలో పెట్టుబడులు పెట్టేందుకు తెలుగు రాష్ట్రాల రియల్ వ్యాపారులతో పాటు జాతీయస్థాయిలో పలు కార్పోరేట్ సంస్థలు కూడా పోటీ పడుతుంటాయి. మహానగరంలో ఒక చిన్న స్థలం, అపార్ట్‌మెంట్‌, ఇండిపెండెట్ హౌస్‌ ఇలా ఏదో ఒకటి సొంతం చేసుకోవాలని లక్షలాది మంది కలలు కంటారు. అయితే, హైదరాబాద్‌లో స్థలం, ఇల్లు కోసం ఇండియాలో నివశిస్తున్న వారితో పాటు ప్రవాసభారతీయులు కూడా బారులు తీరుతున్నారు. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్‌ వంటి పలు దేశాల్లో స్థిరపడిన ప్రవాస భారతీయులు హైరదాబాద్‌పై మక్కువ చూపుతున్నారు. హైదరాబాద్‌ ప్రాపర్టీ కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు”.

- Advertisement -

అమెరికా, కెనడా, గల్ఫ్, యూరప్ మొదలైన దేశాల్లో నివసిస్తున్న ప్రవాస భారతీయులను హైదరాబాద్‌ రియల్ ఎస్టేట్ మార్కెట్ విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ విషయం కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో వెలుగుచూసింది. రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబుడులు పెట్టాలని భావిస్తున్న ఎన్ఆర్ఐలు వారి మొదటి చాయిస్‌గా హైదరాబాద్‌ను ఎంచుకున్నట్లు స్పష్టంగా తేలింది. ఇండియాలో ఇళ్లు కట్టుకోవల్సి వస్తే ఎన్నారైల మొదటి చాయిస్‌ హైదరాబాద్, రెండో చాయిస్‌గా బెంగళూరు ఉన్నట్లు ఆ సర్వేలో తేలింది. ఈ రెండు నగరాల్లో ఎన్నారైలు ఇళ్లు నిర్మించుకోవడానికి ఇష్టపడుతున్నారని డెవలపర్ అనరాక్ వెల్లడించారు. ఇళ్లనిర్మాణానికి, నివాసానికి అనువైన నగరంగా 22 శాతం మంది ఎన్నారైలు హైదరాబాద్‌ను ఎంచుకున్నారు. 20 శాతం మంది ఢిల్లీ-ఎన్‌సిఆర్ ను ఎంచుకోగా , 18 శాతం మంది బెంగళూరును ఇష్టపడుతున్నారు. అయితే, ఈ సర్వేలో మరో ఆశ్చర్యకరమైన విషయం వెలుగుచూసింది.ఇంటి కొనుగోలు విషయంలో, ఎన్నారైల మొదటి మూడు ఎంపికలలోనూ ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ లేదు. రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో పెట్టుబడితో పోలిస్తే స్టాక్, మ్యూచువల్ ఫండ్‌లు మంచి రాబడిని ఇస్తున్నా, ఎన్‌ఆర్‌ఐలు హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ-ఎన్‌సిఆర్ వంటి అగ్ర నగరాల్లో ఇంటిని కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారని ఆసర్వే వెల్లడించింది. రూపాయి విలువ క్షీణించడం, ఉద్యోగాలు కోల్పోయిన ఎన్నారైలు తిరిగి స్వదేశానికి తిరిగి రావడం కూడా వారు రియల్ ఎస్టేట్ మార్కెట్‌ను ఇష్టపడటానికి మరో కారణమని రియల్ రంగ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. 71 శాతం మంది ఎన్నారైలు రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టడం బెస్ట్ చాయిస్‌ అని విశ్వసిస్తున్నారు. ఎన్నారైల్లో 54 శాతం మంది త్రిబుల్ బెడ్‌రూమ్‌లను ఇష్టపడ్డారు. 23 శాతం 4బిహెచ్‌కె, 22 శాతం మంది 2బిహెచ్‌కెలను ఇష్టపడుతున్నారు.

తెలంగాణ కల్పతరువు – హైదరాబాద్‌ రియల్ ఎస్టేట్

  • లక్షల కోట్లు లావాదేవీలు
  • గణనీయంగా పెరిగి రిజిస్ట్రేషన్ల ఆదాయం
    తెలంగాణ రాష్ట్రానికి కల్పతరువుగా మారింది హైదరాబాద్‌ రియల్‌ఎస్టేట్‌ రంగం. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రియల్‌రంగంలో హైదరాబాద్‌ దేశంలోని పలు నగరాలతో పోటీ పడింది. ఆ పోటీలో అనూహ్యంగా మిగిలిన నగరాలను వెనక్కి నెట్టి మొదటిస్థానంలో నిలించింది. దీంతో, తెలంగాణ ఏర్పడిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగం పరిస్థితి ఎలా ఉంటుందోనన్న సందేహాలు పటాపంచలయ్యాయి. ప్రస్తుతం ఆ రంగంలో జరుగుతున్న లావాదేవీలు, అభివృద్ధి మునుపెన్నడూ ఊహించనిస్థాయిలో ఉంటున్నాయి. ఎనిమిదేళ్ల కిందట రిజిస్ట్రేషన్ల ఆదాయంతో పోలిస్తే.. ఇప్పుడు ఊహించనంతగా పెరిగింది. ఎనిమిదేళ్ల క్రితం సంవత్సరం మొత్తం మీద లభించిన ఆదాయం, ఇప్పుడు ఒక్క నెలలోనే వస్తోంది. హైదరాబాద్ చుట్టుపక్కల మాత్రమే కాదు తెలంగాణ వ్యాప్తంగా లావాదేవీలు పెరిగాయి. దీంతో రాష్ట్ర రిజిస్ట్రేషన్ల శాఖకు రాబడి విపరీతంగా పెరిగింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కొంత ముందు ప్రభుత్వానికి స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా రాబడి సుమారు రూ.2,7000 కోట్లు. కాగా,ఈ ఆదాయం ఇప్పుడు రూ.12,624 కోట్లు. ధరణి పోర్టల్‌ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లతో ప్రభుత్వానికి రూ.5 వేల కోట్లకుపైగా ఆదాయం సమకూరింది. అంటే మొత్తంగా ఈ రంగంలో రూ.17,600 కోట్లకు పైగా ఆదాయం సమకూరినట్లు అధికారులు వెల్లడించారు.
    భారీగా పెరుగుతున్న రిజిస్ట్రేషన్ల ఆదాయం
    2015-16లో రూ.3,370 కోట్లు ఖజానా రిజిస్ట్రేషన్ల ఆదాయం రాగా , 2016-17లో రూ.3,560 కోట్లు, 2017-18లో రూ.4,571 కోట్లు, 2018-19లో రూ.6,612 కోట్లు, 2019-20లో రూ.7,061 కోట్లు, 2020-21లో రూ.5,260 కోట్లు, 2021-22లో రూ.12,365 కోట్ల ఆదాయం వచ్చింది. వ్యవసాయ రిజిస్ట్రేషన్లతో మరో రూ.5 వేల కోట్ల ఆదాయం ఖజానాకు చేరింది. ఈ ఏడాది వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ల రూపంలో 17.16లక్షల డాక్యుమెంట్లు రిజిస్టర్‌ అయ్యాయి. ధరణి పోర్టల్‌కు 10.54 కోట్ల హిట్లతో ఇప్పటివరకు 30కోట్ల భూముల రిజిస్ట్రేషన్లు జరిగాయి. 2014-15లో భూ లావాదేవీలు 8.26లక్షల డాక్యుమెంట్లతో నమోదు కాగా, తాజాగా గతేడాది 19.88లక్షలకు చేరుకున్నాయి. ఆదాయం నాలుగు రెట్లుకు, డాక్యుమెంట్లు మూడింతలకు పెరిగాయి. అత్యధికంగా హైదరాబాద్‌ చుట్టే రియల్‌ వ్యాపారం జోరందుకుంటోంది. ఎక్కువ క్రయవిక్రయాల జాబితాలో మొదటి స్థానంలో రంగారెడ్డి, ఆ తర్వాత మేడ్చల్‌ మల్కాజ్‌గిరీ, హైదరాబాద్‌ ఉన్నాయి.
    మధ్యతరగతి వర్గాలకు
    ప్రజలంతా తమ పెట్టుబడికి భూమికి మించిన మార్గం లేదనే అంచనాకు వచ్చినట్లుగా కనిపిస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత స్థిరాస్తి రంగంలో స్తబ్దత ఏర్పడింది. 2019 తర్వాత ఒక్క సారిగా పరిస్థితి మారిపోయింది. స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు సాగాయి. రిజిస్ట్రేషన్ ఆదాయమే వేల కోట్లు వస్తూంటే..ఇక లావాదేవీలు ఏ స్థాయిలో జరిగి ఉంటాయో చెప్పాల్సిన పని లేదని నిపుణులు చెబుతున్నారు. లక్షల కోట్లలో హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ లావాదేవీలు జరుగుతున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారుప్రతి ఏటా రిజిస్ట్రేషన్ల శాఖ రూ.4 వేల కోట్లకుపైగా రాబడినిస్తోందని నిపుణులు అంటున్నారు. అంటే , ప్రజల్లో దాదాపు ఏడాదికి రూ.లక్ష కోట్ల టర్నోవర్‌ చేతులు మారుతోందని వారు అంటున్నారు.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News