కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ పార్లమెంట్ వింటర్ సెషన్స్ కు డుమ్మా కొట్టనున్నారు. ఓవైపు భారత్ జోడో యాత్రలో తలమునకలై ఉన్న రాహుల్, పార్లమెంట్ సమావేశాలను మిస్ చేసి యాత్రను కొనసాగించనున్నారు. కాంగ్రెస్ రాజ్యసభ చీఫ్ విప్ జైరామ్ రమేష్, సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కూడా రాహుల్ తో పాటు సమావేశాలకు హాజరుకాకుండా భారత్ జోడో యాత్రలో కొనసాగనున్నారు. కానీ పార్లమెంట్ లో ముఖ్యంగా రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన వ్యూహకర్తగా ఉన్న జైరాం సమావేశాలకు దూరంగా ఉండటమంటే పార్టీకి చాలా నష్టం. ఈనేపథ్యంలో ఖర్గే నేతృత్వంలో పార్టీ ప్రత్యేక కసరత్తు చేస్తోంది. వివిధ పార్టీలతో సమన్వయం చేసుకుని ఉభయ సభల్లో అధికార బీజేపీని ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ కీలక భేటీని ఈసాయంత్రం నిర్వహించనుంది. రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఖర్గేను కొనసాగించటంపై కూడా ఈ సాయంత్రంలోగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోనుంది. కీలకమైన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు వాడివేడిగా జరగటం ఖాయంగా మారింది. గుజరాత్, హిమాచల్ అసెంబ్లీ ఫలితాలతో పాటు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో చాలా పేలవమైన ప్రదర్శన చేసే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో కాంగ్రెస్ సీనియర్లు చాలామంది పార్లమెంట్ సమావేశాలకు గైర్హాజరు కానున్నారు.