Friday, September 20, 2024
HomeతెలంగాణSingareni: సింగరేణి సోలార్ కు మరో జాతీయ అవార్డు

Singareni: సింగరేణి సోలార్ కు మరో జాతీయ అవార్డు

సింగరేణి సోలార్ కు మరో జాతీయ అవార్డు దక్కింది. రెన్యువబుల్ ఎనర్జీ సొసైటీ ఆఫ్ ఇండియా నుంచి “ఉత్తమ ఎనర్జీ ట్రాన్సిషన్ అవార్డు” సింగరేణి సొంతం చేసుకుంది. మాజీ రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి, సోలార్ ఎనర్జీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ అజయ్ మిశ్రా నుంచి అవార్డు స్వీకరించారు. నీటి పొదుపులో కూడా సింగరేణి థర్మల్ విద్యుత్తు ప్లాంటుకు అత్యుత్తమ నీటి వినియోగ అవార్డు దక్కింది. సింగరేణి సోలార్, థర్మల్ కేంద్రాలకు అవార్డులు రావడంపై సంస్థ ఛైర్మన్ అండ్ ఎండీ ఎన్.శ్రీధర్ హర్షం వ్యక్తం చేశారు. సింగరేణి సంస్థ పర్యావరణహిత చర్యగా 224 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ ప్లాంట్లను అతితక్కువ సమయంలో నిర్మించి, పూర్తిస్థాయిలో ఉత్పత్తిని కూడా ప్రారంభించినందుకు ప్రశంసగా జాతీయస్థాయిలో మరో అవార్డును సాధించింది. సోలార్ విద్యుత్తును ప్రోత్సహిస్తున్న రెన్యువబుల్ ఎనర్జీ సొసైటీ ఆఫ్ ఇండియా వారు ప్రతి ఏడాది ప్రకటించే” రెనివ్ ఎక్స్ “అవార్డులలో భాగంగా ఈసారి సింగరేణి సంస్థకు “ఉత్తమ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇయర్ అవార్డు-2023″ను ప్రకటించారు. శనివారం సాయంత్రం హైదరాబాద్లో హైటెక్స్లో నిర్వహించిన జాతీయస్థాయి సదస్సులో సొసైటీ డైరెక్టర్ జనరల్ మరియు మాజీ రాష్ట్ర ఇంధనశాఖ స్పెషల్ సెక్రెటరీ శ్రీ అజయ్ మిశ్రా ఈ అవార్డును సింగరేణి సంస్థ డైరెక్టర్ (ఇ అండ్ ఎం) డి.సత్యనారాయణ రావుకు అందజేశారు. సింగరేణి వ్యాప్తంగా సోలార్ థర్మల్ ప్లాంట్లను ఏర్పాటు చేయుటమే కాకుండా ఈ ప్లాంట్లను విజయవంతంగా నిర్వహిస్తూ, విద్యుత్తును సమర్థంగా అనుసంధానం చేస్తున్నందుకు సింగరేణి సంస్థను నిర్వాహకులు ప్రత్యేకించి ప్రశంసించారు. సింగరేణి వ్యాప్తంగా ఇప్పటికే ఏర్పాటు చేసిన తొమ్మిది ప్లాంట్ల నుండి 615 మిలియన్ యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసి తద్వారా తెలంగాణ రాష్ట్ర ట్రాన్స్కో నుండి కొనుగోలు చేస్తున్నథర్మల్ విద్యుత్తు వినియోగాన్ని ఆమేరకు తగ్గించగలిగింది. అంతేకాదు మొదటి దశలో ఇంకా మిగిలి ఉన్న 76 మెగావాట్ల ప్లాంటును త్వరగా పూర్తి చేసి 300 మెగావాట్ల సోలార్ సామర్థ్యానికి కంపెనీ చేరుకోనుంది. అంతే కాకుండా సంస్థ ఛైర్మన్ మరియు ఎండీ ఎన్.శ్రీధర్ ఆదేశంపై సోలార్ సామర్థ్యాన్ని మరింతగా పెంచుతూ మరో 220 మెగావాట్ల సామర్థ్యం గల ప్లాంట్లను కూడా 2024 చివరి నాటికి సింగరేణి వ్యాప్తంగా ఏర్పాటు చేయడానికి నిర్ణయించింది. తద్వారా మొత్తం 520 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ విద్యుత్ను ఉత్పత్తి చేస్తూ సింగరేణి సంస్థను పూర్తిగా సోలార్ విద్యుత్తుపై నడుస్తున్న సంస్థగా రూపుదిద్ది ‘నెట్ జీరో ఎనర్జీ’ స్థాయికి తీసుకెళ్లాలని ముందుకు వెళ్తోంది. ఈ నేపథ్యంలో 2023వ సంవత్సరానికి అత్యుత్తమ ఎనర్జీ ట్రాన్సిషన్ అవార్డు లభించడం సంస్థ థర్మల్, సోలార్ దిశగా చేస్తున్న కృషికి గుర్తింపుగా కంపెనీ భావిస్తోంది. ఇది ఇలా ఉంటే న్యూ ఢిల్లీలో ఇటీవల జరిగిన ప్రముఖ ఎనర్జీ మిషన్ వారి సదస్సులో సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి మరో జాతీయస్థాయి అవార్డు లభించింది. అత్యంత పొదుపుగా నీటిని వినియోగిస్తున్న దేశవ్యాప్త థర్మల్ విద్యుత్ కేంద్రాల విభాగంలో అత్యుత్తమ కేంద్రంగా గుర్తిస్తూ ఇటీవల న్యూ ఢిల్లీలో జరిగిన ఎనర్జీ మిషన్ వారి జాతీయ సదస్సులో “బెస్ట్ వాటర్ ఎఫీషియెంట్ ప్లాంట్” అవార్డును నిర్వాహకులు బహుకరించారు. ఈ అవార్డు రావడం ఇది మూడవసారి. సంస్థ ఛైర్మన్ ఎండీ ఎన్.శ్రీధర్ హర్షం వ్యక్తం చేశారు. సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి, సోలార్ విద్యుత్కు ప్రోత్సాహంగా రెండు జాతీయస్థాయి అవార్డులు లభించడం పట్ల సంస్థ ఛైర్మన్ మరియు ఎండీ ఎన్.శ్రీధర్ తన హర్షం ప్రకటిస్తూ ఉద్యోగులకు అధికారులకు తన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇదే ఒరవడితో సమర్ధంగా పనిచేస్తూ మరిన్ని విజయాలు సాధించాలని ఆయన పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News