గుళ్లలోకి మొబైల్ ఫోన్లు తీసుకువెళ్లటాన్ని మద్రాస్ హైకోర్టు నిషేధించింది. తమిళనాడు వ్యాప్తంగా ఏ గుళ్లలోనూ సెల్ ఫోన్లు అనుమతించరాదని కోర్టు వెల్లడించడం విశేషం. ఆలయ పవిత్రత, ప్రశాంతతకు భంగం కలగకూడదని ఈ తీర్పు ఇస్తున్నట్టు కోర్టు వెల్లడించింది. గుళ్ల బయట సెల్ ఫోన్ డిపాజిట్ కేంద్రాలను తక్షణం అందుబాటులోకి తెచ్చి, భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలని పేర్కొంది. సుబ్రమణ్య స్వామి ఆలయంలోకి వచ్చిన భక్తులు ఆలయ ప్రాంగణంలో మొబైల్ ఫోన్లు వాడకుండా బ్యాన్ చేయాలంటూ వచ్చిన పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు ఈమేరకు ఆదేశాలు జారీచేసింది. మొబైల్ ఫోన్లతో భక్తులు ఫోటోలు, సెల్ఫీలు, వీడియోలు తీసుకుంటూ ఆలయాన్ని అపవిత్రం చేస్తున్నారంటూ పిటిషనర్ పేర్కొన్నాడు. ఇదంతా ఆగమ శాస్త్ర విరుద్ధమంటూ కోర్టుకెక్కాడు ఓ భక్తుడు. కొన్ని గుళ్లలో విచక్షణారహితంగా తీసుకునే ఫోటోలు, వీడియోలతో గుడి భద్రతకు కూడా ముప్పు వాటిల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని పిటిషనర్ కోర్టులో వాపోయాడు. గుడికి వచ్చే మహిళల అనుమతి లేకుండా వారి ఫోటోలు తీసుకోవటం వంటి దృశ్యాలు అన్ని గుళ్లలో కామన్ అయిపోయాయని, గుళ్లలో డీసెంట్ డ్రెస్ కోడ్ కూడా అమలు చేయాలని పిటిషనర్ కోరారు.