పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన తుది రాత పరీక్ష ప్రశాంతంగా జరిగిందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ జి.వినీత్ (ఖమ్మం ఇంచార్జ్ సీపీ) తెలిపారు. ఖమ్మం నగర పరిసర ప్రాంతాల్లోని 21 పరీక్షా కేంద్రాల్లో ఆదివారం జరిగిన పరీక్షలకు మొత్తం 12,143 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి వుండగా 11,985 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరైయ్యారని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, అవకతవకలు జరగకుండా ఉండేందుకు జిల్లా పోలీసులు అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ను అమల్లోకి తీసుకొచ్చినట్లు తెలిపారు.
బయోమెట్రిక్ హాజరు కోసం అభ్యర్థులను పరీక్ష నిర్వహణకు గంట ముందుగా అనుమతించారు. పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగింది. పరీక్షా కేంద్రాలు, నగర పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ లా&ఆర్డర్ సుభాష్ చంద్ర బోస్ , ఏఆర్ అడిషనల్ డీసీపీ కుమారస్వామి,ట్రైనీ ఐపిఎస్ అవినాష్ కుమార్, ఏసీపీలు గణేష్ ,రామోజీ రమేష్ , భస్వారెడ్డి, రహెమాన్, ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు.