తిరుమల శ్రీవారి హుండీ రికార్డులు సృష్టిస్తోంది. ఈ వార్షిక సంవత్సరంలో.. అనగా మార్చి 1 నుండి వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 వరకు హుండీ ఆదాయం రూ.1000 కోట్లు వస్తుందని తిరుమల తిరుపతి దేవస్థానం అంచనా వేసింది. ఇప్పుడు ఆ అంచనాలను మించిన ఆదాయం వస్తుండటం విశేషం. నవంబరు నెల వరకూ వరుసగా 9 నెలలు.. ప్రతినెలా శ్రీవారికి రూ.100 కోట్లకు పైగా హుండీ ద్వారా ఆదాయం వచ్చింది. గడిచిన 8 నెలలకు గాను స్వామివారికి హుండీ ఆదాయం రూ.1164 కోట్లు రాగా.. నవంబరు నెలలో ఏకంగా రూ.127.30 కోట్ల ఆదాయం వచ్చింది.
ఈ ఆదాయం.. టీటీడీ వార్షిక ఆదాయ అంచనాలను దాటేసింది. దీంతో టీటీడీ తన అంచనాలను సవరించింది. ఈ వార్షిక సంవత్సరంలో రూ. 1600 కోట్లకు పైగా హుండీ ఆదాయం వస్తుందని భావిస్తోంది. 1950 వరకు శ్రీవారి హుండీ ఆదాయం రోజుకు లక్ష రూపాయల లోపు ఆదాయం వచ్చేది. 1958లో తొలిసారి లక్ష రూపాయలకు పైగా ఆదాయం వచ్చింది. 1990ల నాటికి హుండీ ఆదాయం కోటికి పెరగ్గా.. 2020-21వార్షిక సంవత్సరంలో రూ.731 కోట్ల వార్షిక ఆదాయం వచ్చింది. 2021-22 ఏడాదిలో ఈ ఆదాయం రూ. 933 కోట్లకు పెరిగింది. ఈ వార్షిక ఏడాదిలో అప్పుడే రూ.1000 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది.