Hyderabad Central University: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. థాయిలాండ్ కు చెందిన విద్యార్థినిపై ప్రొఫెసర్ అత్యాచారయత్నంకు పాల్పడినట్లు ఆరోణల నేపథ్యంలో గచ్చిబౌలి పోలీసులు శనివారం ప్రొఫెసర్‌ను అదుపులోకి తీసుకున్నారు. రవి రంజన్ యూనివర్సిటీలో హిందీ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాడు. అయితే, శనివారం థాయిలాండ్‌కు చెందిన ఓ విద్యార్థిని.. ప్రొఫెసర్ తనపై లైంగిక దాడికి ప్రయత్నించాడని గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు మాదాపూర్ డీసీపీ కె. శిల్పవల్లి ఐపీసీ సెక్షన్ 354 కింద కేసు నమోదు చేశారు. అనంతరం ప్రొఫెసర్‌ను అరెస్టు చేశారు.
మరోవైపు, గచ్చిబౌలి పోలీసులు యూనివర్సిటీకి వెళ్లి థాయిలాండ్ యువతి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. ప్రొఫెసర్ హిందీ నేర్పిస్తానని చెప్పి పుస్తకం కోసమంటూ పిలిచి తనపై అత్యాచార యత్నానికి ప్రయత్నించాడని ఆ యువతి పోలీసుల ఎదుట వాపోయింది. ఈ ఘటనపై యూనివర్సిటీ గేటు వద్ద విద్యార్థులతో పాటు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. ప్రొఫెసర్ ను కఠినంగా శిక్షించాలని, విద్యార్థినికి న్యాయం చేయాలని విద్యార్థులు నిరసనకు దిగారు.
శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు విద్యార్థి సంఘాలు పేర్కొటున్నాయి. అయినా, ఇప్పటి వరకు యూనివర్సిటీ యాజమాన్యం స్పందించలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థిని స్టేట్‌మెంట్ ను నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రొఫెసర్‌పై మరిన్ని సెక్షన్లు నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.