Saturday, October 5, 2024
HomeNewsBudhism: బౌద్ధ మతానికి భారత్‌ అగ్రాసనం

Budhism: బౌద్ధ మతానికి భారత్‌ అగ్రాసనం

చైనా దేశానికి ముందరి కాళ్లకు బంధం వేసేందుకు భారత్‌ సరికొత్త వ్యూహాన్ని రూపొందించింది. ఆ దేశానికి సంబంధించినంత వరకూప్రస్తుతం భారత విదేశాంగ విధానంలో బౌద్ధ మతం అనేది ఒక ముఖ్యమైన భాగం అయిపోయింది. బౌద్ధ మత గురువులతో, బౌద్ధ భిక్షువులతో, బౌద్ధ మత పరిశోధకులతో విదేశాంగ శాఖ తరచూ చర్చలు, సంప్రదింపులు జరపడంతో పాటు, ఈ మతానికి భారతదేశంలో ఇతోధిక ప్రోత్సాహం ఇస్తూ వస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు చెందిన అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్య (ఐ.బి.సి) ఆధ్వర్యంలో మొట్ట మొదటిసారిగా రెండు రోజుల పాటు విశ్వ బౌద్ధ మత సమ్మేళనాన్ని నిర్వహించింది. గత ఏప్రిల్‌ 20, 21 తేదీలలో జరిగిన ఈ సమ్మేళనం చైనాకు కంటగింపయింది.వాస్తవానికి, 2020లోనే ఈ సమ్మేళనాన్ని నిర్వహించాలని తలపెట్టారు కానీ, కోవిడ్‌ మహమ్మారి కారణంగా వాయిదా పడడం జరిగింది.
ఇటీవలి కాలంలో దేశంలోని బౌద్ధారామాలను, బౌద్ధ స్థూపాలను, బౌద్ధ కేంద్రాలను పునరుద్ధరించడం, వాటి సందర్శనానికి ప్రయాణ సౌకర్యాలు కల్పించడం వగైరాలకు భారత ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. బౌద్ధ మతానికి సంబంధించిన అతి చిన్న ప్రాంతాలకు సైతం అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి, వాటిని అభివృద్ధి చేయడం జరుగుతోంది. భారత-నేపాల్‌ సరిహద్దుల్లో ఉన్న బౌద్ధ చరిత అనే అతి చిన్న ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం వెనుక ఉన్న అభిమతం అదే. అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్యే ఈ కార్యక్రమాలన్నిటినీ చేపడుతోంది. గౌతమ బుద్ధుడు తన జీవిత కాలంలో సందర్శించిన ప్రదేశాలనే కాకుండా, ఆయన ప్రయాణ మార్గంలో ఉన్న ప్రాంతాలను కూడా పెద్ద ఎత్తున ప్రత్యేకంగా అభివృద్ధి చేయడం ప్రారంభం అయింది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం అయిన ఈ సమ్మేళనం బౌద్ధ మత వారసత్వ సంపదను పరిరక్షించుకోవడం మీద, బౌద్ధ ధర్మాన్ని పునరుద్ధరించడం మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. హిందూ మతానికి, భారతదేశానికి, బౌద్ధ మతానికి ఉన్న సన్నిహిత సంబంధాన్ని ఈ సమ్మేళనంలో వక్తలు ప్రస్తావించడమే కాకుండా, దేశంలో బౌద్ధ ఆరామాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దడానికి సంబంధించి అనేక సలహాలు, సూచనలు చేశారు.
బౌద్ధ గురువులతోసాన్నిహిత్యం
ఈ రెండు రోజుల సమ్మేళనం సందర్భంగా ప్రాంతాలవారీగా కొన్ని గోష్టీ కార్యక్రమాలు, చర్చలు కూడా జరిగాయి. ఈ కార్యక్రమాలలో బౌద్ధ విద్యా వ్యాప్తి, మత బోధనలకు ప్రాధాన్యం, టూరిజం, తీర్థయాత్రలు, శాంతి స్థాపన, సమకాలీన ప్రపంచంలో బౌద్ధ మతానికి ఎదురవుతున్న సమస్యలు,సాంఘిక సంక్షేమం వంటి అంశాలపై లోతుగా చర్చలు జరిగాయి. ఈ సమ్మేళనంలో వివిధ దేశాలకు చెందిన బౌద్ధ మత గురువులు, ప్రభోదకులు, పరిశోధకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఫలితంగా సమ్మేళనం ఆసక్తిదాయంగా మారింది. అయితే, చైనా నుంచి ఒక్క వ్యక్తి కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనకపోవడం గమనించాల్సిన విషయం. ప్రపంచవ్యాప్తంగా వందలాది మంది మత గురువులు, పరిశోధకులతో భారత్‌ సంపర్కం పెట్టుకోవడం, సంబంధాలు నెరపడం, సమన్వయం సాధించడం దేశ విదేశాంగ విధానలో భాగంగానే జరిగిందనడంలో సందేహం లేదు. చైనా దూకుడుకు పగ్గాలు వేయడమే ధ్యేయంగా ఈ సమ్మేళనం జరిగింది. విచిత్రమేమిటంటే, గత మార్చిలో ఈ సమాఖ్య ఆధ్వర్యంలోనే షాంఘై సహకార సంఘం బౌద్ధ మత వారసత్వ సంపద మీద సమావేశాలను నిర్వహించినప్పుడు చైనా, పాకిస్థాన్‌ దేశాలు ఇందులో పాల్గొన్నాయి.
ఆసియాలో ఆధిపత్యం కోసం పోటీ పెరుగుతున్న ప్రస్తుత సమయంలో చైనా కూడా బౌద్ధ మతాన్ని తన విదేశాంగ విధానంలో భాగం చేసుకుంది. బౌద్ధ మతం పుట్టి పెరగడంతో పాటు, ఆ మతానికి భారత్‌ ఒక ప్రధాన కేంద్రంగా మారిందనే అభిప్రాయాన్ని తొలగించడానికి చైనా తన విదేశాంగ విధానంలో బౌద్ధ మతాన్ని చేర్చి, భారత్‌కు ప్రత్యామ్నాయంగా నేపాల్‌ను బౌద్ధ కేంద్రంగా అభివృద్ధి చేయాలని సంకల్పించింది. ఇక ఆసియాలోని భారత్‌ చుట్టుపక్కల దేశాలలో కూడా బౌద్ధ మతం ఉన్నందువల్ల, ఆ దేశాలలో బౌద్ధ మతానికి ప్రాధాన్యం ఇచ్చి, ఆ దేశాలు భారత్‌ వైపువెళ్లకుండా చేయాలనేది కూడా చైనా పన్నాగంగా కనిపిస్తోంది. ఇదే సంకల్పంతో చైనా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మత గురువులు, భిక్షువులు, పరిశోధకులతో తరచూ సంప్రదింపులు జరుపుతూ వారి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తోంది. బౌద్ధ మత గురువు దలైలామాను వారికి దూరం చేయడానికి, దలైలామాను ఒంటరి చేయడానికి అది విశ్వప్రయత్నం చేస్తోంది. అంతేకాక, ప్రస్తుతం బౌద్ధ మతానికి ప్రధాన కేంద్రంగా ఉన్న టిబెట్‌ మీద పట్టు బిగించడానికి కూడా అది రకరకాల ప్రయత్నాలు చేస్తోంది.
శ్రీలంకపై దృష్టి
ఇక శ్రీలంకను కూడా అది ఈ విషయంలో లక్ష్యంగా చేసుకుంది. ఇక్కడ ఉన్న బౌద్ధ మత గురువులను అది అనేక ప్రలోభాలతో తన వైపునకు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. అక్కడి బౌద్ధ విహారాలను, ఆరామాలను పెద్ద ఎత్తున అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దడానికి పథకాలు రూపొందిస్తోంది. స్థానికంగా రాజకీయ పట్టును సాధించడంతో పాటు, దలైలామాకు వ్యతిరేకంగా మత గురువులు ప్రచారం చేయడానికి, తమకు అనుకూలంగా తరచూ ప్రకటనలు చేయడానికి కూడా ఇది ప్రయత్నిస్తోంది. ఇక్కడి మత గురువులకు రాజకీయాల మీద పట్టుంది. సింహళ జాతీయవాదం మీద కూడా వారి ప్రభావం ఉంది. ఇటీవల దలైలామా శ్రీలంకలో పర్యటించడానికి చైనా ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఆయనవచ్చి వెళ్లినప్పటి నుంచి చైనా తన దలైలామా వ్యతిరేక కార్యకలాపాలను ఉధృతం చేసింది. చైనా రాయబారి హూ వీ ప్రత్యేకంగా ఇక్కడి మాలవతా ప్రాంతానికి వచ్చి, బౌద్ధ గురువులను కలుసుకుని, దలైలామాకు వ్యతిరేకంగా నూరిపోసి వెళ్లడం జరిగింది. ఇక 2015లో చైనా రాయబారి ఆధ్వర్యంలో శ్రీలంక-చైనా ఫ్రెండ్‌ఫిప్‌ అసోసియేషన్‌ ఏర్పడింది. చైనాకు అనుకూలంగా మద్దతు కూడగట్టడం ఈ అసోసియేషన్‌ ప్రధాన బాధ్యత.
ఇంతకూ భారత్‌ ఈ రెండు రోజుల సమ్మేళనాన్ని నిర్వహించడానికి ముఖ్య కారణం దలైలామాకు ప్రపంచవ్యాప్త బౌద్ధ మత గురువుల నుంచి మద్దతు కూడగట్టడమే. అంతేకాక, తాము టిబెట్‌తో సంబంధాలు కొనసాగిస్తూనే ఉంటామని చైనాకు తెలియజేయడమే భారత్‌ ప్రధాన ఉద్దేశం. భారతదేశం దలైలామాకే మద్దతునిస్తుందని, ఆయనకే అండగా ఉంటుందని టిబెట్‌కు తెలియజేయడం కూడా భారత్‌ ఉద్దేశం. సమ్మేళన ప్రాంగణంలో తైవాన్‌ పతాకాలను ఆవిష్కరించడం కూడా చైనాను హద్దులలో ఉంచడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే కనిపిస్తోంది. అయితే, చైనాను మరీ రెచ్చగొట్టకుండా ఉండడానికి కూడా భారత్‌ ప్రయత్నించింది. మోదీ ప్రసంగించిన రోజున కాకుండా ఆ మరునాడు దలైలామా ప్రసంగించడానికి అవకాశం ఇవ్వడం ద్వారా ఆయనకు మరీ అంత ప్రాధాన్యం ఇవ్వడం లేదనే అభిప్రాయాన్ని కలిగించింది. అంతేకాక, టిబెట్‌ గురించి ఎక్కువగా ప్రస్తావించడం కూడా జరగలేదు. మొత్తం మీద ఈ సమ్మేళనమే కాక, భవిష్యత్తులో నిర్వహించే ఈ తరహా సమ్మేళనాలు సైతం భారత్‌ను బౌద్ధ మత ప్రధాన కేంద్రంగా ప్రపంచానికి పరిచయం చేస్తుంటాయి. చైనా బౌద్ధ విధానానికి పగ్గాలు వేయడమే భారత్‌ ప్రధాన ధ్యేయంగా కనిపిస్తోంది.

- Advertisement -

డాక్టర్‌ వై.ఎస్‌. సుదర్శనాచారి

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News