చేదుగా ఉండే కాకర కాయ కూరను ఇష్టపడేవాళ్లు చాలా తక్కువ. కానీ ఆ చేదును పోగొడితే ఆ కూరను తినేవాళ్లు చాలామందే ఉన్నారు. మరి కాకరకాయ చేదు పోగొట్టడమెలా అంటారా? దానికి కొన్ని టిప్స్ ఉన్నాయి. కాకరకాయలను బాగా కడిగి దానిపైన ఉండే పొట్టును పూర్తిగా తీసేసి ముక్కల్లా తరగాలి. ఆ ముక్ల్లో ఉప్పు, పసుపు వేసి అరగంటపాటు పక్కన పెట్టాలి. ఆ తర్వాత ఆ ముక్కలను పిండేస్తే కాకర కాయలోని చేదు పోతుంది. అప్పుడు దానితో కూర చేసుకుని తింటే చేదు లేకుండా ఎంతో రుచిగా ఉంటుంది. కాకరలోని చేదు పోగొట్టే ఇంకో కిటుకు కూడా ఉంది. చెక్కు దీసిన కాకర కాయ ముక్కలను పెరుగులో వేసి కాసేపు నానబెడితే చాలు కాకర ముక్కల్లోని చేదు మాయం. మరో చిట్కా ఏమిటంటే కాకర కాయ కూర చేసి దాన్ని స్టవ్ మీద నుంచి దించే ముందర కొద్దిగా బెల్లం లేదా చక్కెర అందులో వేస్తే కాకర ముక్కలకు ఉండే చేదుదనం పోతుంది. అలాగే కాకర కాయను ఉల్లిపాయలు, ఆలూతో కలిపి చేస్తే కూడా కాకర కాయ కూరలో అంత చేదు ఉండదు.
ఇవే కాదు ఇతర కూరగాయ ముక్కలను కాకర కాయ ముక్కలలో కలిపి వండితే కూడా ఆ కూర చేదు ఉండదు. మరి ఈ చిట్కాలను ఉపయోగించి చేదులేని పసందైన కాకరకూయ కూరను వండి ఆరగించండి… ఆలస్యం ఎందుకు?