Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Puttaparthi: ఇళ్ల నిర్మాణంలో ఎలాంటి సాకులు చెప్పటానికి వీల్లేదంతే

Puttaparthi: ఇళ్ల నిర్మాణంలో ఎలాంటి సాకులు చెప్పటానికి వీల్లేదంతే

ఇళ్లు లేని వారు ఒక్కరు ఉండకూడదన్నదే ప్రభుత్వ లక్ష్యమని హౌసింగ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ పేర్కొన్నారు. పుట్టపర్తి కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు కింద గృహ నిర్మాణ ప్రగతిపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబుతో కలిసి హౌసింగ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పెనుకొండ సబ్ కలెక్టర్ కార్తీక్, డిఆర్ఓ కొండయ్య, హౌసింగ్ పిడి చంద్రమౌళి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

ఈ సందర్భంగా హౌసింగ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 17,18,336 ఇల్లు మంజూరు కాగా, శ్రీ సత్యసాయి జిల్లాకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పిఎంఏవై వైఎస్సార్ అర్బన్) కింద 62,253 ఇల్లు మంజూరు కావడం జరిగిందన్నారు. ఇందులో ఇప్పటివరకు 55,750 ఇళ్లను మాత్రమే రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందని, 52,711 ఇళ్లు గ్రౌండ్ కాగా, 9,542 ఇల్లు ఇంకా మొదలు కాలేదన్నారు. బిలో బేస్మెంట్ స్థాయిలో 22,563 ఇల్లు నిర్మాణంలో ఉండగా, బేస్మెంట్ స్థాయిలో 15,759 ఉన్నాయని, ఇళ్ల నిర్మాణంలో పురోగతి తక్కువగా ఉందన్నారు. జిల్లాలో 1,400 కోట్ల రూపాయల మేర హౌసింగ్ లో పని జరుగుతోందని, నవరత్నాలు – పేదలందరికీ ఇల్లు అనేది అత్యంత ప్రతిష్టాత్మక కార్యక్రమమన్నారు. ఇళ్లనిర్మాణంలో హౌసింగ్ అధికారులతో పాటు ఇతర శాఖల అధికారులు కూడా శ్రద్ధ పెట్టి పని చేయాలన్నారు.

హౌసింగ్ కింద కావలసినంత డబ్బు ఉంది, మెటీరియల్ అంతా అందుబాటులో ఉంది, లేఔట్లలో మౌలిక వసతులు కల్పన జరుగుతోంది, అన్ని రకాలుగా అనుకూల పరిస్థితి ఉన్న, ఎక్కడ ఎలాంటి సమస్య లేకున్నా ఇళ్ల నిర్మాణంలో పురోగతి ఎందుకు తక్కువగా ఉందని అధికారులను ప్రశ్నించారు. ఇళ్ల నిర్మాణంలో ఎలాంటి సాకులు చెప్పడానికి వీలు లేదన్నారు. ఎక్కువ ఇళ్లు ఇంకా పునాదులు కూడా పడని పరిస్థితుల్లో ఉన్నాయని, క్షేత్రస్థాయిలో పని చేయని వారికి ఎలాంటి మినహాయింపులు ఉండవన్నారు. ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం 1.80 లక్షల రూపాయలు మంజూరు చేస్తోందని, దాంతోపాటు మరో 35 వేల రూపాయలను రుణంగా అందిస్తున్నారని, 2.15 లక్షల రూపాయలతో ఇల్లు కట్టుకునేందుకు అనుకూలంగా ఉంటుందని, అన్ని రకాలుగా సాయం చేస్తున్న ఇళ్ల నిర్మాణం వేగవంతం కాకపోవడానికి సమస్య ఎక్కడ ఉంది అనేది సరిచేసుకోవాలన్నారు. క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల ఇళ్లకు వాలంటీర్లు వెళ్లి ఇల్లు ఎందుకు కట్టలేదు అనేది అడగాలన్నారు. డబ్బు సమస్యతో పాటు సిమెంటు, స్టీలు, ఇసుక, లేబర్, ల్యాండ్ లెవెలింగ్, తదితర ఎలాంటి సమస్య లేకున్నా ఎందుకు వేగవంతం కావడం లేదనేది పరిశీలన చేయాలన్నారు.  ఇంటి స్థలం ఇచ్చామంటే ఇంటి నిర్మాణానికి స్థలం ఇచ్చామని ఇల్లు మంజూరైన కట్టలేదు అంటే వాళ్ళు ఇల్లు రద్దు అయిపోతుందని జీవితంలో మరోసారి వారికి ఇల్లు మంజూరు కాదని, అన్ని విధాల లబ్ధిదారులకు అవగాహన కల్పించాలన్నారు. పొసిషన్ సర్టిఫికెట్లు ఇచ్చిన వారి సొంత ఇంటి స్థలంలో ఏ నిర్మాణం చేపట్టకున్నా ఇళ్లు పూర్తి చేసినట్లు చెప్పి డబ్బులు తీసుకుంటే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. లేఔట్ లలో ఇళ్ల నిర్మాణం పూర్తి అయితే విద్యుత్ సౌకర్యం, నీటి సరఫరా, అంతర్గత రోడ్లు, డ్రైనేజీ ఏర్పాటు పూర్తి చేయాలని, వెల్కమ్ ఆర్చ్ లు కూడా ఏర్పాటు చేయాలన్నారు.

మండలానికి ఒక స్పెషల్ ఆఫీసర్ నియమించి వారంలో ఒకరోజు తనిఖీలు చేయాలి :

జిల్లాలో నాలుగు డివిజన్లు ఉండగా ఒక్కో డివిజన్ కి ఒక సీనియర్ అధికారిని నియమించి ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలన్నారు. హౌసింగ్ లో ఇళ్ల నిర్మాణం పర్యవేక్షణ కోసం మండలానికి ఒక స్పెషల్ ఆఫీసర్ నియమించాలన్నారు. స్పెషల్ ఆఫీసర్లు ఇళ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించి వారంలో ఒకరోజు లేఔట్ లను తనిఖీలు చేయాలన్నారు. ఇళ్ల నిర్మాణంలో పురోగతి ఏ విధంగా ఉంది అనేది పరిశీలించాలని, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, వార్డు అనిమిటిస్ సెక్రటరీలు, విలేజ్ సెక్రటరీలు, వాలంటీర్లతో మాట్లాడాలని, నెలకు ఒకసారి సమావేశం నిర్వహించి ఇళ్ల నిర్మాణం వేగవంతం అయ్యేలా చూడాలన్నారు. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, సబ్ కలెక్టర్, డిఆర్ఓ, జిల్లా అధికారులు ఇళ్ల నిర్మాణంపై నిత్యం మానిటర్ చేయాలన్నారు. జిల్లాలోని చిలమత్తూరు మండలానికి సంబంధించి 1,271 ఇల్లు మంజూరు కాక ఇప్పటివరకు 542 ఇల్లు పూర్తి చేసి 85 శాతం పురోగతి సాధించి బాగా పనిచేసిన ఎంపీడీవో, హౌసింగ్ ఏఈ లను స్పెషల్ చీఫ్ సెక్రటరీ అభినందించారు. ఓడి చెరువు మండలంలో 3,566 ఇల్లు మంజూరు కాగా, 10 శాతం మాత్రమే పురోగతి చూపించారని, పురోగతి చాలా తక్కువగా ఉందని, ఇది ఎంత మాత్రం తగదని, వెంటనే మెరుగుపరచుకోవాలన్నారు. కదిరి అర్బన్ లో కూడా తక్కువ పురోగతి ఉందని, ఇళ్ల నిర్మాణంలో పురోగతి చూపించాలన్నారు. లేఔట్ లలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బిలో బేస్మెంట్ స్థాయి నుంచి బేస్మెంట్ స్థాయికి, బేస్మెంట్ స్థాయి నుంచి ఆర్ఎల్ స్థాయికి నిర్మాణాలు తీసుకురావాలని, ఇందులో అధికారుల సహకారం అత్యంత ముఖ్యమన్నారు.
*జిల్లాలోని 144 లేఔట్లలో 122 లేఔట్లలో విద్యుత్ సరఫరా పనులు పూర్తి చేయడం జరిగిందని, మరో 22 లేఔట్లలో ఈనెలాఖరులోపు విద్యుత్ సరఫరా పనులు చేపట్టాలని ఆదేశించారు. సకాలంలో అన్ని లేఔట్లలో నీటి సౌకర్యం కల్పించాలని, జల జీవన్ మిషన్ కింద తాగునీటి సరఫరా పనులు చేపట్టాలని ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ కి సూచించారు. ఇళ్ల నిర్మాణం పూర్తవుతున్న లేఔట్లలో ప్రణాళిక ప్రకారం మూడు నెలలలోపు వెల్కమ్ ఆర్చ్ ల నిర్మాణం పూర్తి చేయాలని పంచాయతీ రాజ్ ఎస్ఈని ఆదేశించారు. హిందూపురం అర్బన్ పరిధిలో హౌసింగ్ నిర్మాణ పనులకు స్థానికుల సహకారం తీసుకొని పురోగతి సాధించాలని హిందూపురం మున్సిపాలిటీ కమిషనర్ను ఆదేశించారు. జిల్లాలో కదిరి, మడకశిర, హిందూపురం పట్టణంలో హౌసింగ్ కాలనీలో పనితీరు చాలా వెనకబడి ఉన్నాయని వాటిని పురోగతి సాధించాలని తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు మాట్లాడుతూ హౌసింగ్ లో పురోగతి తీసుకువచ్చేందుకు సమీక్ష నిర్వహించడం జరుగుతుందన్నారు. మండలాల వారీగా స్పెషల్ ఆఫీసర్లను నియమించి లేఔట్ వారిగా సమీక్ష నిర్వహించి ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కొత్త జిల్లా ఏర్పడిన అనంతరం హౌసింగ్ పై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టలేదని, ఇళ్ల నిర్మాణంలో శ్రద్ధ పెట్టాలన్నారు. లేఔట్ లలో వెల్కమ్ ఆర్చల నిర్మాణంలో మూడు నెలల్లోగా పురోగతి చూపించడం చేయాలన్నారు. ప్రతి 1,000 ఇల్లు ఉన్న లేఔట్ కు ప్రత్యేక అధికారిని నియమించడం జరుగుతుందన్నారు. ఇళ్ల నిర్మాణం వేగవంతం అయ్యేలా నెలకొకసారి డివిజన్లో పర్యటిస్తామన్నారు. పూర్తిస్థాయిలో ఇల్లు గ్రౌండ్ జరిగేలా వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ఇళ్ల నిర్మాణంలో రెండు నెలల్లోగా పురోగతి చూపించేందుకు అవసరమైన చర్యలు చేపడతామని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా హౌసింగ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీకి జిల్లా కలెక్టర్ నంది విగ్రహం బహుకరించి శాలువా కప్పి సన్మానం చేశారు. ఈ సమీక్ష సమావేశంలో ఆర్డీఓలు భాగ్యరేఖ, తిప్పే నాయక్, రాఘవేంద్ర, డిప్యూటీ కలెక్టర్లు మధులత, భవాని శంకర్, పీఆర్ ఎస్ఈ గోపాల్ రెడ్డి, డిఆర్డీఏ పిడి నరసయ్య, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ రషీద్ ఖాన్, డ్వామా పిడి రామాంజనేయులు, పబ్లిక్ హెల్త్ ఈఈ సతీష్ రెడ్డి, ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ, హౌసింగ్ డిఈలు, ఏఈలు, ఎంపిడిఓలు, మున్సిపల్ కమిషనర్ లు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News