Suspension: అవినీతి అధికారుల గుట్టు రట్టయింది. లంచాలకు అటవాటు పడిన అధికారులకు షాకిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏకంగా 18మంది అధికారులను సస్పెన్షన్ చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. వీరిలో జాయింట్ కమిషనర్ తో పాటు ముగ్గురు అసిస్టెంట్ కమిషనర్లు సహా మొత్తం 18మంది అధికారులు ఉన్నారు. వీరంతా వాణిజ్య పన్నుల శాఖలోని అధికారులే. పన్నుల వసూళ్ల విషయంలో నిబంధనలు అతిక్రమించారని, అవినీతికి పాల్పడుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో వీరిపై సస్పెన్షన్ వేటు వేశారు.
బెంగళూరులోని కొందరు పారిశ్రామిక వేత్తలు వాణిజ్య పన్నుల శాఖలోని కొందరు అధికారులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని ఏకంగా సీఎం బసవరాజ్ బొమ్మైకు లేఖరాసి అవినీతి అధికారుల బాగోతం బట్టబయలు చేశారు. పన్నుల వసూళ్ల విషయంలో ప్రభుత్వానికి న్యాయబద్దంగా చెల్లించాల్సిన పన్నులకు ఎగనామం పెట్టేందుకు వీలుగా ఈ అధికారులు కుమ్మక్కైనట్లు సమాచారం. ఫలితంగా ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం వాటిల్లుతోందని సీఎంవో కార్యాలయం తెలిపింది.
ఇదిలా ఉంటే.. వీరిపై శాఖాపరమైన దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దర్యాప్తు పూర్తయి నిర్దోషిత్వం తేలేంతవరకు వీరికి ఎలాంటి బాధ్యతలు అప్పగించరాదని ప్రభుత్వం నిర్ణయించింది. పన్నుల వంచన కారణంగా ఏ మేరకు మోసం జరిగిందనే అంశంపై ఉన్నతాధికారులు విచారణ ముమ్మరం చేశారు.