నందవరం మండల కేంద్రంలో వెలసిన శ్రీ శ్రీ భీరలింగేశ్వర స్వామి వారికి నిర్వహించే పెద్ద దేవర మహోత్సవానికి ఆలయ కమిటీ పెద్దలు ఇప్పటికే భారీ ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ పెద్దలు మాట్లాడుతూ శ్రీ భీర లింగేశ్వర స్వామి పెద్ద దేవర మహోత్సవం గతంలో దాదాపుగా 120 సంవత్సరాలు కిందట నిర్వహించినట్లు మా పూర్వీకులు చెప్పేవారని ఇప్పుడు మళ్లీ మేము గ్రామ శ్రేయస్సు కోసం సరైన సకాలంలో వర్షాలు కురిసి మంచి పంటలు పండాలని, పాడి, పశువులు, ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలనే ఉద్దేశంతో ఇప్పుడు మళ్లీ మే 5 2023 నుండి మే 7 2023 వరకు స్వామివారికి పెద్ద దేవర (పటాల దేవర) మహోత్సవం నిర్వహించుటకు శ్రీ కురువ భీర లింగేశ్వర స్వామి దేవాలయ ఆలయ కమిటీ, ఆలయానికి చెందిన 72 పల్లెల కురువ పెద్దలు నిశ్చయించినట్టు వారు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి శ్రీ భీరలింగేశ్వర స్వామి దేవాలయానికి చెందిన డెబైరెండు గ్రామాల పల్లె ప్రజలే కాకుండా రాష్ట్ర నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో భక్తజనం పాల్గొంటారు. కావున వచ్చిన భక్త జనానికి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా వచ్చే భక్తుల కోసం వసతి సౌకర్యాలతో పాటు ఐదు, ఆరు, ఏడు తేదీలలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అన్నదాన నీటి వసతి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని వారు తెలియజేశారు.
దేవర మహోత్సవంలో పూజా కార్యక్రమ వివరములు
ఐదవ తేదీ శుక్రవారం సాయంత్రం నందవరం భీరలింగేశ్వర స్వామి పల్లకి, హెచ్ మురవణి మాత శ్రీ చౌడేశ్వరి దేవి పల్లకి, సుగురు వీర నాగప్ప స్వామి పల్లకి, చిన్నాయ్యాట బీరప్ప స్వామి పల్లకి, కే తిమ్మాపురం భీరప్ప స్వామి పల్లకీలచే తుంగభద్ర నదికి వెళ్లి అక్కడ ఆనవాయితీ ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం స్వామివారికి చలువ బిందెలతో నది జలాలు తీసుకువస్తారు. తదుపరి ఆరవ తేదీ శనివారం ఉదయం నుంచి స్వామివార్లకు పంచామృతాభిషేకం, రుద్రాభిషేకం వంటి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం నందవరం శ్రీ మాతా చౌడేశ్వరి దేవాలయం నుండి నందవరం శ్రీ భీర లింగేశ్వర స్వామి దేవాలయం వరకు వచ్చిన ఐదు గ్రామాల పల్లకిలచే పల్లకి సేవలు నిర్వహించి ఊరేగింపుగా ఆలయానికి చేరుకుంటారు. అదే రోజు సాయంత్రం ఐదు గంటల నుండి స్వామివారి రథోత్సవం నిర్వహిస్తారు.
ఏడో తేదీ ఆదివారం స్వామివార్లకు దేవపటాలము వేసి మూడో రోజు పూజ కార్యక్రమాలు పూర్తి చేస్తారు. అదేరోజు గ్రామంలోని ప్రజలు ఆడపడుచులకు నూతన వస్త్రాలు కానుకగా ఇచ్చి ఒడి బియ్యం పోసే కార్యక్రమాలు నిర్వహించుకోవాలని దేవాలయ కమిటీ గ్రామ ప్రజలు నిర్ణయించినట్లు వారు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో శ్రీ భీర లింగేశ్వర దేవాలయ పెద్దలు పాల్గొన్నారు.