Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Nandyala: చెంచు గూడెంలలో ప్రాథమిక సౌకర్యాలపై బాధ్యత తీసుకోండి

Nandyala: చెంచు గూడెంలలో ప్రాథమిక సౌకర్యాలపై బాధ్యత తీసుకోండి

నంద్యాల జిల్లాలోని 42 చెంచు గూడెంలకు నియమించిన దత్తత అధికారులు తనిఖీలు నిర్వహించి గుర్తించిన ప్రాథమిక సౌకర్యాల కల్పనకు సంబందిత అధికారులు, చెంచు గూడెంల దత్తత అధికారులు బాధ్యత తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్ ఆదేశించారు. కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో చెంచు గూడెంలలో కనీస వసతి సదుపాయాల కల్పనపై సంబంధిత అధికారులు, దత్తత అధికారులతో కన్వర్జెన్సీ సమావేశం నిర్వహించారు. ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారి రవీంద్రనాథ్ రెడ్డి, ఎపిడి మురళి తదితర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్ మాట్లాడుతూ జిల్లాలోని 14 మండలాల్లోని 42 చెంచు గూడెంలలో దత్తత అధికారులు గుర్తించిన త్రాగునీరు, విద్యుత్తు, టాయిలెట్లు, సిసి రోడ్లు, డ్రైనేజీ కాలువలు తదితర ప్రాధమిక మౌలిక వసతులు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. చిన్న కొట్టాల చెరువు, బైర్లూటీ, నారపురెడ్డి కుంట, మాడుగుల, గాజులపల్లి మెట్ట తదితర 9 చెంచు గూడెంలలో త్రాగునీటికి సంబంధించి బోర్ల మరమ్మతులు, డిస్ట్రిబ్యూషన్ లైన్ పనులు, ఆర్వో ప్లాంట్, సోలార్ కనెక్షన్, విద్యుత్ స్తంభాలు, వీధి దీపాలు తదితర పనులకు యంపి ల్యాడ్స్ కింద రు.40 లక్షలు మంజూరుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సిపిఓ వేణుగోపాల్ ను కలెక్టర్ ఆదేశించారు. స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ కింద చెంచుగూడెంలలో మరుగుదొడ్ల నిర్మాణాలకు ప్రతిపాదనలు సమర్పించాలని ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ మనోహర్ ను ఆదేశించారు.

- Advertisement -

వెలుగోడు చెంచు కాలనీలో ఐటీడీఏ కార్పొరేషన్ నుండి కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ప్రాజెక్ట్ అధికారిని కలెక్టర్ ఆదేశించారు.చెంచు గూడెంలలో మంజూరైన 2170 గృహాలలో నిర్మాణాలకు అనువుగా ఉన్న 651 ఇళ్లను వారం రోజుల్లో గ్రౌండింగ్ చేయాలని కలెక్టర్ హౌసింగ్ అధికారులను ఆదేశించారు. 16 గిరిజన ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో 9.8 లక్షల రూపాయలతో ఆరు బెడ్ల షెడ్లను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. ఎదురుపాడు, 80బన్నూరు గ్రామాలలో 24 వ్యవసాయ బోర్లకు ప్రతిపాదనలు తయారు చేయాలని డ్వామా పిడిని ఆదేశించారు. జానాల గూడెం, మాడుగుల, ఎర్రమటం గూడెంలలో సోలార్ కనెక్షన్ల ఏర్పాటుకు తనిఖీ చేసి వారం రోజుల్లో నివేదిక సమర్పించాలని నెడ్ క్యాప్ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. చెంచు గూడెంలలో గుర్తించిన 88 రేషన్ కార్డులకు గాను కేవలం 4 కార్డులు మాత్రమే పూర్తి కావడంపై సివిల్ సప్లైస్ అధికారిపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేస్తూ వారం రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. రేషన్ కార్డుల జారీకి నిర్లక్ష్యం వహించిన అధికారికి షోకాజ్ నోటీసు జారీ చేయాలని ఐటీడీఏ పిఓను ఆదేశించారు. అలాగే పెండింగ్లో ఉన్న ఆధార్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డు, పెన్షన్ల జారీకి వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. గూడెంలలో రక్తహీనత గల స్త్రీలు, పోషక లోపాలున్న వ్యక్తులను గుర్తించేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి తగు చర్యలు తీసుకోవాలని డియంహెచ్ఓను కలెక్టర్ ఆదేశించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News