రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న వరిధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు ప్రక్రియ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్లు డి.మధుసూదన్ నాయక్, బి. రాహుల్, ట్రైనీ కలెక్టర్ పి.గౌతమి, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ఎ.ప్రేమ్కుమార్తో కలిసి రైస్ మిల్లర్లు, ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వరిధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతుల సౌకర్యార్థం పూర్తి స్థాయి చర్యలు చేపట్టాలని, వేసవి దృష్ట్యా త్రాగునీరు, నీడ ఏర్పాట్లు చేయాలని తెలిపారు. రైస్మిల్లర్లు కొనుగోలు కేంద్రాలు, ఇంటర్మీడియట్ గోదాముల నుండి ధాన్యాన్ని తీసుకోవాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాలలో వరిధాన్యం విక్రయించిన రైతులకు సంబంధిత రశీదును తప్పనిసరిగా అందించాలని, రైతు, ధాన్యం కొనుగోలు వివరాలను ట్యాబ్లలో నమోదు చేయాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు ట్యాగింగ్ చేసిన మిల్లులకు పంపించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ మద్దతు ధర గ్రేడ్-ఏ రకానికి 2 వేల 60 రూపాయలు, సాధారణ రకానికి 2 వేల 40 రూపాయలుగా నిర్ణయించడం జరిగిందని తెలిపారు. కల్లాలలోనే ధాన్యాన్ని శుభ్రం చేసి తాలు, మట్టిగడ్డలు లేకుండా నిబంధనలకు మేరకు ధాన్యాన్ని తరలించే విధంగా రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. వర్షాభావ పరిస్థితులు నెలకొన్న సందర్భంగా కొనుగోలు చేసిన ధాన్యాన్ని కేంద్రాల నుండి త్వరితగతిన మిల్లులకు తరలించేలా అధికారులు చొరవ చూపాలని, ధాన్యం తడవకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని త్వరితగతిన గన్నీ సంచులలో నింపాలని, టార్పాలిన్లను అందుబాటులో ఉంచాలని తెలిపారు. రైతుల సౌకర్యార్థం జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్ నం. 6303928682 ను ఏర్పాటు చేయడం జరిగిందని, సందేహాలు, సలహాల కొరకు సంప్రదించవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి బి. శేషాద్రి, రైసిమిలర్ల అసోసియేషన్ అధ్యక్షులు నల్మాసు కాంతయ్య, మిల్లర్లు, లారీ ట్రాన్స్పోర్స్ ఏజెన్సీల ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.