Impact player : ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2023 సీజన్‌కు ఇప్పటి నుంచే సన్నాహాకాలు మొదలు అయ్యాయి. డిసెంబర్ 23న కొచ్చిలో మినీ వేలం జరగనుంది. ఈ వేలం కోసం 991 మంది ఆటగాళ్లు తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నారు. ఇందులో 714 మంది భారత ఆటగాళ్లు కాగా 277 మంది విదేశీ ఆటగాళ్లు. ఈ సారి సీజన్‌ను మరింత రంజుగా మార్చేందుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) ఓ కొత్త రూల్‌ను తీసుకువస్తోంది. అదే “ఇంపాక్ట్ ప్లేయర్”. సబ్‌స్టిట్యూషన్ విధానం అన్నమాట.
ఈ విధానాన్ని ఫుట్‌బాల్ మ్యాచుల్లో ఎక్కువగా చూస్తుంటాం. దీన్ని ఐపీఎల్‌లో అమలు చేయనున్నట్లు బీసీసీఐ తెలిపింది. ఫుట్‌బాల్ మ్యాచుల్లో ఉన్న నిబంధనతో పోలీస్తే క్రికెట్‌లో ఈ నిబంధన కాస్త భిన్నంగా ఉంటుంది. ఇప్పటికే ఫ్రాంచైజీలకు బోర్డు ఈ విషయాన్ని తెలియజేసింది. ఈ నిబంధనతో మ్యాచ్ ఫలితాలు తారు మారు అవుతాయని అంటున్నారు.
ఇంపాక్ట్ ప్లేయర్ అంటే..?
ఇప్పటి వరకు టాస్ వేసే ముందు ప్రకటించిన తుది జట్టు ఆటగాళ్లు మాత్రమే బ్యాటింగ్, బౌలింగ్ చేసే వీలుంది. అయితే.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌తో రెండు జట్లు తుది జట్టులోని ఓ ఆటగాడిని మ్యాచ్ జరుగుతున్న సమయంలో మరో ఆటగాడితో భర్తీ చేసుకోవచ్చు. ఖచ్చితంగా చేసుకోవాల్సిన అవసరం అయితే ఏదీ లేదు. అయితే.. రెండు ఇన్నింగ్స్‌లోనూ 14వ ఓవర్ ముగిసేలోపు ఇంపాక్ట్ ప్లేయర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని కెప్టెన్, హెడ్ కోచ్, మేనేజర్ ఆన్ పీల్డ్ అంపైర్లు లేదా నాలుగో అంపైర్‌కు చెప్పాల్సిఉంటుంది.