Thursday, September 19, 2024
Homeఆంధ్రప్రదేశ్AP: వరుణ దేవుడు యజ్ఞ ప్రాంగణం శుద్ధిచేయడం శుభసూచకం

AP: వరుణ దేవుడు యజ్ఞ ప్రాంగణం శుద్ధిచేయడం శుభసూచకం

రాష్ట్ర సంక్షేమం కోసం, సర్వతోముఖాభివృద్ధి సాధించడం కోసం, ప్రకృతి అన్ని రకాలుగా సహకరించి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రస్థానాన నిలబెట్టడం కోసం, ముఖ్యమంత్రి శ్రీ.వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పరిపాలన మరింత బలోపేతం అవడం కోసం “అష్టోత్తర శతకుండాత్మక చండి, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీలక్ష్మీ మహాయజ్ఞం” నిర్వహించనున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి , దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో యాగం ఏర్పాట్లను స్వయంగా పరిశీలించిన మంత్రి అనంతరం మీడియాతో మాట్లాడుతూ వరుణదేవుడు వర్షం కురిపించి యజ్ఞశాలను శుద్ధిచేయడం శుభసూచకంగా భావిస్తున్నామన్నారు. రాష్ట్రం సుభిక్షంగా, సస్య శ్యామలంగా ఉండి, లోక కళ్యాణ హితార్థం రాష్ట్ర ప్రజలు సౌభాగ్యంతో వర్ధిల్లాలనే లక్ష్యంతో స్థానిక మున్సిపల్ స్టేడియంలో మే 12వ తేదీ నుండి 17వ తేదీ వరకు 6 రోజుల పాటు వేదపండితులు, రుత్వికులు, ఘనాపాటిల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా, ఆగమ నియమాలకు అనుగుణంగా రాజశ్యామల యాగం నిర్వహించనున్నామన్నారు. రేపు ఉదయం 7.14గం.లకు బ్రహ్మ ముహూర్తంలో యజ్ఞశాలను ఎద్దుల నాగలితో శాస్త్ర ప్రకారం దున్ని నవధాన్యాలు జల్లి 108 కుండాల నిర్మాణ ప్రారంభోత్సవ కార్యక్రమానికి అంకురార్పణ చేస్తామన్నారు.

- Advertisement -

రాష్ట్ర ప్రజలు సౌభాగ్యంతో వర్ధిల్లాలని చేపట్టే యజ్ఞం మే 12వ తేదీ తొలిరోజు ఉదయం 9 గంటలకు ముఖ్యమంత్రి శ్రీ.వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి సంకల్పం తీసుకోనున్నారన్నారు. అదే విధంగా యాగం జరిగే 6 రోజుల పాటు దేవాదాయ శాఖ మంత్రిగా యజ్ఞధారణను స్వీకరిస్తానన్నారు. మే 17వ తేదీ ముఖ్యమంత్రి చేతుల మీదుగా మహా పూర్ణాహుతితో కార్యక్రమం ముగియనుందన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటి సారిగా ఒక మంచి యజ్ఞం చేయడానికి సంకల్పించామని మంత్రి అన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండటం కోసం 108 కుండాలతో అద్భుతమైన, అపూర్వమైన అఖండ పుణ్య ప్రదాయకమైన యజ్ఞాన్ని నిర్వహించబోతున్నట్లు తెలిపారు. ఒక్కో కుండానికి ఇద్దరు రుత్వికులు, వారికి సహాయకులు ఉంటారని తెలిపారు. యజ్ఞ క్రతువు నిర్వహించే 2 ప్రధాన కుండాలకు 16 మంది రుత్వికులుంటారన్నారు. రుత్వికులు వారికి అప్పజెప్పిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తారన్నారు. మంత్ర జపం సంఖ్య ఆధారంగా కుండాల వద్ద రుత్వికుల సంఖ్యను క్రోడీకరించుకుంటారన్నారు.

ఈ మహా యజ్ఞ క్రతువు 12వ తేదీన ఉదయాన్నే 5 గంటలకు బ్రహ్మ ముహూర్త కాలంలో ప్రారంభం అవుతుందని మంత్రి వెల్లడించారు. ఈ యాగం ప్రతి రోజు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 లేదా 1 వరకు, తిరిగి సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు జరుగుతుందన్నారు. ప్రతి రోజు ఉదయం పూట 1008 కలశాలతో, సప్త నదులు, మూడు సముద్రాల జలాలతో మహాలక్ష్మీ స్వర్ణ ప్రతిమకు అభిషేకం జరుగుతుందన్నారు. ప్రతి రోజు సాయంత్రం వేళ ప్రవచనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడతాయన్నారు. యజ్ఞ క్రతువులో జరిగే ప్రతి కార్యక్రమం పురాణాల్లో చెప్పినట్లుగా, ఆగమ శాస్త్ర నియమానుసారం జరుపుతామన్నారు.

ఆరు రోజుల మహాయజ్ఞంలో వివిధ ప్రతిష్టాత్మక పీఠాధిపతులు పాల్గొన్ని ప్రజలకు వారు అనుగ్రహ ఆశీర్వచనాలు అందిస్తారని వెల్లడించారు. ప్రధానంగా శ్రీశైలం కంచికామకోటి, శారద, సిద్ధేశ్వర, పుష్పగిరి, శృంగేరి, దత్త పీఠం తదితర పీఠాల పీఠాధిపతులు పాల్గొని తమ ప్రవచనాల ద్వారా హిందూ ధార్మిక పరిరక్షణ గురించి అవగాహన కల్పిస్తారన్నారు. ధర్మ ప్రచారం కోసం, సనాతన ధర్మ రక్షణ కోసం, హిందూ ధర్మ పరిరక్షణ కోసం, భావితరాలకు హిందూ ధర్మ గొప్పతనం చాటి చెప్పాలన్న సదుద్దేశంతో ఇటువంటి యజ్ఞాలు చేయడం ద్వారా అవగాహన ఏర్పడి భగవంతుని మీద మరింత భక్తి, విశ్వాసం కలుగుతాయని భావిస్తున్నామన్నారు. ధార్మిక పరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఆగమ సలహా మండలి, అర్చక ట్రైనింగ్ అకాడమీకి సంబంధించి నిష్ణాతుల సలహాలు, సూచనలు పాటించి ఈ క్రతువు నిర్వహిస్తున్నామన్నారు. 8 ఆగమాల్లో భాగంగా శైవ, వైష్ణవ, వైఖానస, పాంచనాత్రం, వీరశైవం, తంత్రసారం, గ్రామదేవత వంటివి సంపుటీకరణ చేసి యాగ విధివిధానాలను క్రోడీకరించి రూపొందిస్తున్నామన్నారు.

యజ్ఞ క్రతువులో భాగంగా తొలి రోజు విజయవాడ శ్రీదుర్గా మల్లేశ్వర స్వామివార్ల దివ్యకళ్యాణం, రెండవ రోజు సింహాచలం శ్రీవరాహ లక్ష్మీ నరసింహస్వామి, మూడవ రోజు అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి, నాల్గవ రోజు ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి, ఐదవ రోజు శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి వార్ల దివ్య కళ్యాణాలు ఉంటాయని ఉప ముఖ్యమంత్రి వెల్లడించారు.
రెవెన్యూ, మున్సిపల్,ఫైర్, హోం తదితర శాఖలు తమ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించి యాగం విజయవంతం చేసేందుకు కృషి చేయాలన్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాట్లను ముందుగా వెస్ట్ జోన్ ఇంచార్జ్ డీసీపీ విశాల్ గున్నీ, సబ్ కలెక్టర్ అదితి సింగ్ పరిశీలించారు. కార్యక్రమంలో దేవాదాయశాఖ కమిషనర్ ఎస్. సత్యనారాయణ, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News