Saturday, November 23, 2024
Homeనేషనల్Maha BRS: మహారాష్ట్రలో ఏం జరుగుతుందో మీరే చూస్తారు : KCR

Maha BRS: మహారాష్ట్రలో ఏం జరుగుతుందో మీరే చూస్తారు : KCR

మహారాష్ట్రలో బీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించనున్నదని, పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్రావు అన్నారు. ‘మహారాష్ట్రలో బీఆర్ఎస్కు రోజురోజుకు పెరుగుతున్న ఆదరణకు రాజకీయ పార్టీలు బెంబేలెత్తిపోతున్నాయి. అది వ్యక్తి విజయం కాదు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాద బలం. ఈ బలంతోనే సిట్టింగ్ ఎమ్మెల్యేలు అనేక మంది నాతో సంప్రదింపులు జరుపుతున్నారు. మీరే చూస్తారు మహారాష్ట్రలో ఏం జరుగబోతున్నదో? ’ అని సీఎం కేసీఆర్ వెల్లడించారు. తెలంగాణ భవన్లో మహారాష్ట్ర ముఖ్యనేతలతో ఆయన సమాలోచనలు చేశారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ అనుసరించాల్సిన వ్యూహంపై సుదీర్ఘంగా చర్చించారు. మే 10 నుంచి జూన్ 10 దాకా మహారాష్ట్ర మూల మూలకు అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదం వెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. మహారాష్ట్ర ముఖ్యనేతలతో సీఎం కేసీఆర్ చర్చించిన అనంతరం ఆయన పలు అంశాలపై వారికి దిశానిర్దేశం చేశారు. మంత్రి జగదీశ్రెడ్డి, ఎంపీ బీబీ పాటిల్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, పీయూసీ చైర్మన్ జీవన్రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి, ఎమ్మెల్యే జోగురామన్న, మాజీ ఎంపీ గెడాం నగేశ్, మహారాష్ట్ర ముఖ్యనేతలు మాణిక్ కదం, మాజీ ఎమ్మెల్యే శంకరన్న డోంగే, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ వేణుగోపాలాచారి, మాజీ ఎంపీ హరిబావ్ రాథోడ్, సుధీర్ సుధాకర్రావు బిందు, సువర్ణ కాటే బగల్, మాజీ మేయర్ రవీంద్రసింగ్, దాసోజు శ్రవణ్ తదితరులు పాల్గొన్నఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ దిశానిర్దేశం ముఖ్యాంశాలు

  • మహారాష్ట్రలో బీఆర్ఎస్ ప్రభంజనం వలె ఎగిసిపడుతున్నది. మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, బ్లాక్ స్థాయి ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు ఇప్పటికే బీఆర్ఎస్లో చేరారు.
  • కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు రావటానికి సిద్ధంగా ఉన్నారు. అనేక మంది నాతో సంప్రదింపులు, చర్చలు జరుపుతున్నారు.
  • అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ ఇదే మన నినాదం. బీఆర్ఎస్ సిద్ధాంతాన్ని, లక్ష్యాన్ని ప్రజలకు చేర్చి వారి ప్రేమను పొందాలి. ప్రజల మనసులు గెలవడం బీఆర్ఎస్ లక్ష్యం. ఈ క్రమంలో మనం వ్యక్తిగత విమర్శలకు తావు ఇవ్వద్దు.
  • బీఆర్ఎస్ ఆత్మస్థెర్యం, మనోనిబ్బరం, సంకల్పసిద్ధి, చిత్తశుద్ధి కార్యాచరణ మహోన్నతమైంది. ఈ క్రమంలో మనం మన లక్ష్యం నుంచి ఎవరూ తప్పుకోవద్దు.
  • వ్యక్తులు ముఖ్యం కాదు. పార్టీ ముఖ్యం.
  • పదవులు (పార్టీ పదవులైనా.. ప్రజాప్రతినిధులైనా ) వచ్చేదాకా పాదాలు పట్టుకొని ప్రార్థించి.. పదవులు రాగానే కండ్లు నెత్తికి పోయే దుస్థితి బీఆర్ఎస్కు లేదు. ఈ విషయంలో పార్టీ చాలా సీరియస్గా ఉంటుంది.
  • తెలంగాణ తరువాత మహారాష్ట్రకే దేశాన్ని మలుపుతిప్పే అవకాశం వచ్చింది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి.
  • రెండు మూడు రోజుల్లో జిల్లా సమన్వయకర్తల నియామకం పూర్తి.
  • మే 10 నుంచి జూన్ 10 వరకు పార్టీ సంస్థాగత నిర్మాణం. పార్టీ సభ్యత్వ నమోదు పూర్తి కావాలి
  • ఒకే రోజు ఒకే సమయంలో 288 నియోజకవర్గ కేంద్రాల నుంచి పార్టీ సంస్థాగత నిర్మాణం ప్రారంభం కావాలి. మహారాష్ట్ర రాజకీయాల మార్పు… ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పునకు శ్రీకారం.
  • బీఆర్ఎస్ మహారాష్ట్రలో కాలుమోపగానే కిసాన్ సమ్మాన్నిధిని పెంచుతామని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు తలాటీ (వీఆర్ఎ) వ్యవస్థపై ప్రభుత్వం ఆలోచిస్తున్నదని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇవే బీఆర్ఎస్ తొలివిజయం. బీఆర్ఎస్ పూర్తిగా మహారాష్ట్రలో ల్యాండ్ కాకముందే రెండు అద్భుత విజయాలను సాధిస్తే.. బీఆర్ఎస్ అదికారంలోకి వస్తే ఇంకెన్నిచేయవచ్చు? ఎలా చేయవచ్చు అనే విషయాలను ప్రజలకు అర్థం అయ్యేలా చెప్పాలి.
  • ప్రజాచైతన్యమే బీఆర్ఎస్ ఆయువుపట్టు.
  • బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మహారాష్ట్రలో తెలంగాణ మాడల్ అమలు చేసి తీరతాం అనేందుకు రెండు విజయాలే సంకేతం.
  • శివాజీ, అంబేద్కర్ విగ్రహాల నుంచే మన పార్టీ కార్యక్రమం ప్రారంభం కావాలి.
  • మే 8,9 తేదీల్లో మహారాష్ట్రలోని నియోజకవర్గాలకు హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో శిక్షణా శిబిరాలు.
  • సాధారణ సభ్యత్వానికి రూ. 10, క్రీయాశీల సభ్యత్వానికి రూ. 50
  • క్రియాశీల సభ్యులకే పదవులు. సర్పంచ్ మొదలు ఎంపీ ఇలా అన్ని స్థాయిల పదవులకు ప్రథమ అర్హత క్రియాశీల సభ్యత్వమనే విషయాన్ని మరువద్దు.
  • జిల్లా సమన్వయకర్తలు, వారి పరిధిలో ఉండే నాయకులు పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వ నమోదుపై దృష్టి కేంద్రీకరించాలి.
  • సంస్థాగత నిర్మాణంలో గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ కమిటీలు, పట్టణ/నగర ప్రాంతాల్లో వార్డు కమిటీలు. బీఆర్ఎస్ పార్టీ అనుబంధ కమిటీల్లో రైతు, ఎస్సీ, ఎస్టీ, యువజన, మహిళా, విద్యార్థి సహ 9 కమిటీలు. ప్రతీస్థాయి కమిటీల్లో ఆయా ప్రాంతాల జనాభాకు అనుగుణంగా కమిటీ సభ్యుల సంఖ్య
  • మహారాష్ట్రలోని ఆరు డివిజన్లల్లో 288 అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జీల నియామకం దాదాపు పూర్తి
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News