సామాజిక మాధ్యమాలు వేదికగా బిజెపి చేస్తున్న తప్పుడు ప్రచారాలను తిప్పి కొట్టాలని, కాంగ్రెస్ కల్లబొల్లి కబుర్లకు చెక్ పెట్టాలని బిఆర్ ఎస్ పార్టీ సోషల్ మీడియా మరింత యాక్టివ్ గా పని చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు. మంగళవారం బిఆర్ఎస్ పాలకుర్తి నియోజకవర్గం సోషల్ మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా మంత్రి దయాకర్ రావు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పాలకుర్తి నియోజకవర్గం లో 750 మంది సోషల్ మీడియా వారియర్స్ ఉన్నారన్నారు. అందులో కొందరు యాక్టివ్ గా లేరని, వారు కూడా సమర్థంగా పని చేయాలని సూచించారు. నియోజకవర్గంలో తాను మచ్చలేని నేతగా పని చేస్తున్నానని చెప్పారు. బిఆర్ ఎస్ పార్టీ గానీ, తాను గానీ, ఎలాంటి తప్పు చేయబోమని తెలిపారు. ప్రజలు, పార్టీ శ్రేణులు, యువత సహకారంతో తాను నిష్కళంకంగా పని చేస్తున్నానని చెప్పారు. పాలకుర్తి నియోజకవర్గం లో గ్రామానికి ఒకరి చొప్పున సోషల్ మీడియా కార్యకర్తలను ఎంపిక చేసి, వారిని సైనికుల్లా తయారు చేయాలని సూచించారు. వారికి ప్రభుత్వ పరంగా పూర్తి సహకారం అందిస్తామన్నారు. వచ్చే ఐదేళ్ళల్లో తాను పూర్తిగా పార్టీ కార్యకర్తల కోసం పని చేస్తానని చెప్పారు. నియోజకవర్గం లో పార్టీ పటిష్టంగా ఉందని, ఎదురేలేదని, రాబోయే ఎన్నికలలో గెలిచేది తానేనని స్పష్టం చేశారు.
సోషల్ మీడియా కార్యకర్తలు మనస్ఫూర్తిగా పార్టీ కోసం పనిచేయాలని సూచించారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలకు స్థానం లేదని, బిఆర్ఎస్ కు తిరుగులేని మెజారిటీ వస్తుందని స్పష్టం చేశారు. అయితే, గెలవలేని ప్రతిపక్షాలు బిఆర్ ఎస్ పార్టీ మీద, ప్రభుత్వం మీద, సిఎం కెసిఆర్ మీద, తన మీద బురద చల్లి పబ్బం గడుపుకునే ప్రయత్నాలు చేస్తున్నాయని, ప్రజలను గందరగోళ పెట్టి, అయోమయానికి గురి చేస్తున్నాయని ఆరోపించారు. అలాంటి తప్పుడు ప్రచారాలను తిప్పి కొట్టడంలో బిఆర్ ఎస్ సోషల్ మీడియా వారియర్స్ జాగరూకతతో కృషి చేయాలని చెప్పారు. భవిష్యత్తులో సోషల్ మీడియా కార్యకర్తలకు భవిష్యత్తు ఉంటుందని అందుకు తగిన కార్యచరణ రూపొందించాలని సోషల్ మీడియా ఇన్ఛార్ లకు సూచించారు.
తెలంగాణలో కురుస్తున్న అకాల వర్షాలకు దాన్యం నష్టపోయి రైతులు ఇబ్బందులు పడుతుంటే బిజెపి కాంగ్రెస్ పార్టీలు ప్రభుత్వాన్ని బద్‌నాం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు. ప్రజల కోసం తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందని, రైతులను అక్కున చేర్చుకొని ఆర్థిక సాయం అందిస్తుందని అన్నారు. భారతదేశంలో పంట నష్టపోయిన రైతులకు ఎక్కడ సరిగా పరిహారం ఇవ్వడం లేదని కేవలం తెలంగాణలో మాత్రం ఎకరాకు పదివేల పరిహారం ఇస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా రాష్ట్ర ఇన్చార్జి వై సతీష్ రెడ్డి, సోషల్ మీడియా చూస్తున్న యువకులు, పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.