Saturday, November 23, 2024
Homeఓపన్ పేజ్Brahmin hatred: బ్రాహ్మణులను ద్వేషించడం న్యాయమా?

Brahmin hatred: బ్రాహ్మణులను ద్వేషించడం న్యాయమా?

ఈ మధ్యకాలంలో సామాజిక మాధ్యమాలలో, వివిధ వేదికలమీద ఎక్కడ చూసినా బ్రాహ్మణ సమాజాన్ని ఆడిపోసుకోవడం, సంఘవిద్రోహులు అన్నట్లు దుర్భాషలు ఆడటం కొందరికి నిత్యకృత్యం అయింది. ముఖ్యంగా మహాత్మా పూలే, బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ లాంటి మహనీయులు బ్రాహ్మణ కులాన్ని, బ్రాహ్మణ జాతిని వ్యతిరేకించారన్నట్లు ఆ మహనీయుల అభిమా నులం అని చెప్పుకునే కొందరు అత్యుత్సాహపరులు, స్వార్థ రాజకీయ నాయకులు గొంతుచించుకుంటున్నారు. మహాత్మా పూలే, అంబేద్కర్‌ లాంటి మహనీయులు నిజం గా వ్యతిరేకించింది ఒక జాతినా లేక ఆ జాతికి పర్యాయ పదంగా చెప్పబడుతున్న ఒక బలహీనతనా అనే నిజం తెలిసింది మాత్రం కొందరికే అంటే సత్యదూరం ఎంత మాత్రం కాదు. నిజంగా ఆ మహనీయులు బ్రాహ్మణ సమాజాన్ని వ్యతిరేకించారా? చరిత్రను పరికించి చూస్తే పూలే జీవితంలో, అంబేద్కర్‌ జీవితంలో బ్రాహ్మణ మిత్రు లు, గురువుల పాత్ర ఎంతో ప్రాముఖ్యమైనది అనే చెప్పాలి, మరెందుకీ దుష్ప్రచారం జరుగుతున్నది, వర్గ విభేదాలకు భీజం నాటుతున్నది ఎవరు, పరిశీలించాల్సిన సమయం ఆసన్నమైంది.
బీ.ఆర్‌ అంబేద్కర్‌కి వారి తల్లిదండ్రులు నిర్ణయిం చిన పేరు భీంరావ్‌ రాంజీ అంబవాడెకర్‌. అంబేద్కర్‌ అన్నది వారి తల్లిదండ్రులు పెట్టిన పేరుకాదు. తనను విద్యవైపు ప్రోత్సహించి, విద్య గొప్పదనాన్ని తెలియజేసి, వెన్నుతట్టి నడిపించిన తన ప్రియమైన బ్రాహ్మణ గురువు మహదేవ్‌ అంబేద్కర్‌ మీద అచంచల గౌరవంతో పేరుచివర అంబే ద్కర్‌ను తగిలించుకుని జీవితాంతం బీంరావ్‌ రాంజీ అంబే ద్కర్‌గా మిగిలిపోయాడా మహనీయుడు. ఆ మహనీయుని జీవితంలో ముఖ్యపాత్ర పోషించిన మరొక మనిషి మరాట బ్రాహ్మణ సమాజానికి చెందిన వారి అర్ధాంగి ‘శారద కబీర్‌ @ సవిత అంబేద్కర్‌’. అదేవిదంగా మహాత్మా పూలే జీవి తాన్ని పరిశీలిస్తే బాల్యంలో వారితో నడిచిన వారి ప్రియ మిత్రులు సదాశివ్‌ బల్లాల్‌ గోవాండే బ్రాహ్మణ సమాజానికి చెందినవారు. వారిలో విజ్ఞాన జిజ్ఞాసకు పదునుపెట్టింది, ప్రోత్సహించింది, అండగా నిలిచిన మోరో విట్టల్‌ వాల్వే కర్‌, సఖారాం యశ్వంత్‌ రావ్‌ పరంజపే లు బ్రాహ్మణ మిత్రులే అంటే అసత్యం ఎంతమాత్రం కాదు. చదువు పూర్తిచేసుకుని సమాజంలోకి అడుగుపెట్టిన తొలినాళ్ళలో ప్రతిఅడుగులో వారితో నడిచిన ప్రాణమిత్రుడు సదాశివ్‌ బల్లాల్‌ గోవాండే బ్రాహ్మణుడు. ఈ ముగ్గురు మిత్రులు 1852 లోనే నిమ్న జాతులలో విద్యా ప్రాచారం కోసం ఒక సంస్థను ఏర్పాటు చేశారు. బ్రాహ్మనుడైన గోవింద రనడేతో మహాత్మా పూలేకి ఉన్న అనుబందం ఎంతో విలువైనది. ఇంతగా బ్రాహ్మణ మిత్రులతో పెనవేసుకుపెరిగిన మహా త్మా పూలే, బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ మహనీయులు నిజం గా బ్రాహ్మణ సమాజాన్ని వ్యతిరేకించారా! ద్వేషించారా? బ్రాహ్మణ వితంతువులకు విద్యను అందించి, వసతి కల్పిం చి ఎన్నో రకాలుగా వారిని ఆదరించింది ఆ జాతిమీద ద్వేశంతోనా? ఎంతమాత్రం కానేకాదు. వారు వ్యతిరేకించింది బ్రాహ్మణజాతిని కాదు, సమాజంలో వివి ధ వర్గాల మద్య, వ్యక్తుల మద్య పేరుకుపోయిన సామాజిక దూరాన్ని, భయాన్ని, అంటరానితనాన్ని. ఆ సామాజిక వ్యధకు, వెలివేతకు వారుపెట్టిన పేరు ‘బ్రాహ్మనిజం’. ఈ బ్రాహ్మణత్వం వలన ప్రత్యక్షంగా నలిగిపోయింది దళితులే అయినా పరోక్షంగా బ్రాహ్మణులతో సహా సమాజంలోని అన్నివర్గాలు ఎంతో క్షోభను అనుభవించాయి, ఇంకా అనుభవిస్తూనే ఉన్నాయి. నరనరాల్లో జీర్ణించుకుపోయిన బ్రాహ్మణత్వం అన్నివర్గాలను వివిధ పేర్లతో విడదీసింది, తమకు తెలియకుండానే, తమ ప్రమేయం లేకుండానే సాటి మనుషుల్ని దూరంపెట్టే స్థితికి సమాజాన్ని దిగ జార్చింది. అగ్రవర్ణాలతో మొదలైన ఈ దుర్వ్యవస్థ చివరికి అన్నివర్గాల్లోకి పాకిపోయింది. నిరుపేద బహుజనులు సైతం అంటరానితనాన్ని అత్యంత భక్తితో ఆచరించడానికి అలవాటుపడిపోయారు. స్వయంగా నిమ్నజాతి ప్రజలు అంటరానితనం తమ పూర్వజన్మ కర్మఫలం అని నమ్మేం తగా పాతుకుపోయింది. వర్ణంతో సంబంధం లేకుండా బారతీయసమాజంలోని అన్ని వర్గాలలో పాతుకుపోయిన ఈ మానసిక రుగ్మతను కూకటివేళ్ళతో సహా పెరికి వేయాలన్నదే ఆ మహనీయుల కల.
అంబేద్కర్‌ జీవితాన్ని పరిశీలిస్తే వారిని చీత్కరించిన ఎడ్లబండి యజమాని ఒక నిరుపేద బహుజనుడు, అయి నా కూడా సాటి నిరుపేద అంబేద్కర్‌ను బండిదిగమ న్నాడు, చివరకు ఒప్పుకున్నా తాను బండిలో అంబేద్కర్‌ తో కలిసి కూర్చోడానికి దైర్యం చేయక విడిగా నడుస్తూ ప్రయాణించాడు. అంబేద్కర్‌ కు నీల్లివ్వడానికి తిరస్కరించి వేరుగా చూసిన హోటల్‌ యజమాని కూడా నిరుపేద బహుజనుడే, ఆర్ధిక అంతరాలు లేకపోయినా సాటి హిం దువు అన్న ఆలోచన కూడా లేకుండా అంబేద్కర్‌ ను చీత్క రించేలా బహుజన హిందువులను ప్రోత్సహించి, భయ పెట్టిన బలహీనతకు వారుపెట్టిన పేరు బ్రాహ్మణత్వం. నిరుపేద మంగలి, చాకలి లాంటి చిరువృత్తుల బహు జనులు కూడా నిమ్నజాతివారిని దూరంగా ఉంచారంటే సమాజాన్నిబ్రాహ్మనత్వం ఏస్థాయిలో ప్రభావితం చేసిందో చెప్పొచ్చు. శ్రూద్రులకు సంస్కృతం నేర్పించిన, విదేశీయు లకు వేదాలను పరిచయం చేసిన, బ్రాహ్మణ వితంతువు లకు పునర్వివాహం చేసిన బ్రాహ్మణ పండితులను సైతం వెలివేసేలా నాటి సమాజాన్ని శాసించింది కూడా ఈ బ్రహ్మనిజమే. చివరాకరికి మతం మారి క్రిష్టియన్‌ మతం లోకి వెళ్ళిపోయిన బ్రాహ్మణ మిత్రుడు సైతం అవసర కాలంలో అంబేద్కర్‌ను ఆదుకోలేకపోయాడంటే ఆ మూఢ త్వం భారతీయవ్యవస్థలో ఎంతగా జీర్ణించుకుపోయిందో అర్థంచేసుకోవచ్చు. మైలపడిపోతాం, సమాజం చీత్కరించు కుంటుంది, వెలివేస్తుంది, జన్మ కర్మలు చుట్టుకుంటాయి, నరకానికి వెళతాం లాంటి ఏదో తెలియని భయం నర నరాల్లో జీర్ణించుకుని పోగా ఆయావర్గాలు సుప్తచేతనా వస్తలో పాటించిన దుర్వ్యవస్థ ‘అస్పృశ్యత’. మనిషి మనిషి లో కొడిగట్టుకుని ఉన్న ఆ భయాన్ని, అనాలోచిత చర్యను బ్రాహ్మణత్వం అంటూ వ్యతిరేకించారు మహాత్మా పూలే, బాబాసాహెబ్‌ అంబేద్కర్‌లు. ఆచారం పేరుతో, మతం పేరుతో, నమ్మకం పేరుతొ లేక మరోపేరుతో తప్పుడు భావాలను, ఆలోచనలను సమాజంలోకి పంపి ఎవరో కొం దరు ఏదో కాలంలో చేసిన తప్పుకు ఈనాడు మనందరం శిక్షఅనుభవిస్తున్నాం, సాటి మనిషిని ఈసడించుకుంటు న్నాం, మన రక్తాన్ని మనమే అసహ్యించుకుంటున్నాం. మతం మారిపోయినా ఆ భయం, ఆచారం మనల్ని వీడి పోవడం లేదు. ఈ బలహీనత/రుగ్మత ఎంతగా జీర్ణిం చుకుపోయింది అంటే స్వయంగా నిమ్నజాతులప్రజలే అగ్రవర్ణాలనుండి దూరంగా జరిగిన సంఘటనలు, వారి నిష్ఠకు భంగం కలిగిస్తే తామేదో తప్పుచేసిన వారౌతాం అన్న భావంతో, భయంతో స్వచ్చందంగా అస్పృశ్యతను పాటించిన సంఘటనలను మహాత్మా పూలే, అంబేద్కర్‌ లు ప్రత్యక్షంగా చూశారు. గులాంగిరీ లాంటి పుస్తకాలను పరిశీలిస్తే ఈ విషయాలన్నీ సుస్పష్టం అవుతాయి. అందుకే ఆ మహనీయులు ఎలుగెత్తి చాటింది, మనుషుల్లో కూడ గట్టుకుని పోయిన అసమానతలు, పాపబీతి, కట్టుబాట్ల కంచలు తొలగిపోవాలని సాటిమనిషిమీద జాలితో కాకుం డా సమానులన్న స్పృహతో ప్రవర్తించాలని పిలుపు నిచ్చారు. మూడాచారాలు, అందవిశ్వాసాలకు సరైన విరుగుడు విద్యమాత్రమే అని ప్రత్యక్ష కార్యాచరణకు పూనుకున్నారు.
ఆ మహనీయుల స్పూర్తి మనకీనాడు తారకమంత్రం. ప్రతి ఊరులో, వాడ వాడలో విజ్ఞానకేంద్రాలు నెలకొల్పి, విద్యాకుసుమాలు విరజిల్లేలా, సామాజిక చైతన్యం నెల కొనేలా చేయాలి. జాతి విద్వేషం కాదు, విద్వేషానికి ఆస్కా రమే లేని సమాజాన్ని నిలకోల్పడానికి ప్రయత్నించాలి. మహనీయుల విగ్రహాలకు పూజలు చేయడం కాదు, ఆ మహనీయుల ఆలోచనలు ప్రతిధ్వనించే సరస్వతీ నిల యాలు నిర్మించాలి. అదే ఆ మహనీయులకు మనమ ర్పించే నిజమైన నివాళి. జై హింద్‌.

  • చందుపట్ల రమణ కుమార్‌ రెడ్డి
    న్యాయవాది
    9440449392
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News