పెళ్లిళ్లన్నీ సుఖాంతం అనుకోవడానికి వీల్లేదు. అదే విధంగా విడాకులన్నీ విషాదాంతమేనను కోవడానికి కూడా వీల్లేదు. అనుకూలంగావైవాహిక జీవితం లేనందువల్ల దాని నుంచి బయటపడాలనుకుంటున్న వారికి సుప్రీంకోర్టు రెండురోజుల క్రితం ఇచ్చిన తీర్పుఎంతో ఊరట కలిగించి ఉంటుంది. ఏ విషయంలోనైనా పూర్తి స్థాయి న్యాయం జరగాలని స్పష్టం చేస్తున్న రాజ్యాంగంలోని 142(1) ఆర్టికల్‌ను మార్గదర్శకంగా తీసుకుని, సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం విషాద వివాహ బంధంలో ఉన్న దంపతులు పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోవడానికి వెంటనే అనుమతించాలని స్పష్టం చేసింది.హిందూ వివాహ చట్టం (1955)లోని 13(బి) ప్రకారం, విడాకులు మంజూరు చేయడానికి స్థానిక కోర్టులకు ఆరు నుంచి 18 నెలల కాలం పడుతోంది. ఇంత కాలం పాటు దంపతులు వేదన, విషాదాలను అనుభవించాల్సిన పరిస్థితి నుంచి కూడా ఈతీర్పుతో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తప్పించింది. ఇక బాగు చేయలేనంతగా, పునరుద్ధరించలేనంతగా వివాహ బంధం దెబ్బతిన్నప్పుడు, వారి వివాహ బంధాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నం చేయడం అర్థం లేని వ్యవహారమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఆర్టికల్ 142 కింద అవసరమైతే, గృహ హింస, వరకట్నం వంటి నేర సంబంధమైన కేసులను కూడా రద్దు చేయవచ్చని అది పేర్కొంది.ఈ వివాహ బంధాన్ని ఏ విధంగానూ పునరుద్ధరించలేమని, భార్యాభర్తల మధ్య ఇక సయోధ్య సాధ్యం కాదని భావించినప్పుడు, విడాకులు తప్ప మార్గం లేదని అర్థమైనప్పుడు, సుప్రీం కోర్టు వెంటనే విడాకులు మంజూరు చేయవచ్చని ఇది పేర్కొంది. ఏదైనా పొరపాటు లేదా తప్పిదం జరిగినప్పుడు మాత్రమే విడాకులు ఇవ్వాలనే విధానం వల్ల వివాహ బంధాన్ని చక్కదిద్దడం సాధ్యం కాదని కూడా అది తెలిపింది. నిజానికి, హిందూ వివాహ చట్టం ప్రకారం, వివాహ బంధం కుప్పకూలినప్పుడు మాత్రమే విడాకులు ఇవ్వాలని చెబుతోంది.
విడాకులు అనేవి హక్కు కాదని, ఇది విచక్షణకు సంబంధించిన విషయం మాత్రమేనని, విడాకులు ఇచ్చే ముందు ఉభయ పక్షాలకు న్యాయం జరుగుతోందా లేదా అన్న విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయంతీసుకోవాలని ఈ తీర్పులో స్పష్టం చేశారు. వివాహ సంబంధమైన కేసులలో ఆర్టికల్ 142ను ప్రయోగించే ముందు అనేక అంశాలను, అనేక కోణాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందని అంటూ, వివాహ కాలం, వివాద కాలం, దంపతులు ఎంత కాలం నుంచి విడివిడిగా ఉంటున్నారు, పెండింగ్ కేసుల పరిస్థితి, రాజీ ప్రయత్నాలు వగైరాలన్నిటినీ పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అది తెలియజేసింది. విడాకుల విషయంలో దంపతులు ఒత్తిడి కారణంగానో, బలవంతం మీదనో పరస్పర అంగీకారానికి రాలేదనే విషయాన్ని కోర్టు నిర్ధారించుకోవాల్సిన అవసరం కూడా ఉందని అది తెలిపింది. గత రెండు దశాబ్దాలకాలంలో విడాకులు రెట్టింపు అయినప్పటికీ మొత్తం మీద విడాకులు తీసుకుంటున్న కేసులు 1.1 శాతానికి మించలేదు. ఇందులో కూడా నగరాలు, పట్టణాలలో నివాసం ఉంటున్న వారి నుంచే విడాకులు ఎక్కువగా ఉంటున్నాయి.
నిజానికి వివాహ బంధాన్ని పూర్తిగా విడాకుల కోణం నుంచే పరిశీలించడం సాధ్యం కాదు. భర్త లేదా భార్య వదిలేసిన కేసులు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా పేదల్లో ఇటువంటి కేసులు ఎక్కువ. విడాకులు తీసుకున్నవారి సంఖ్య కంటే ‘విడిపోయినవారి’ సంఖ్య మూడు రెట్లు ఎక్కువని జనాభా లెక్కలు చెబుతున్నాయి. భారతదేశం వంటి దేశంలో, నిరుపేదల జనాభా ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లో, విడిపోవడం అన్నది ఒక సహజ పరిణామంగా సాగిపోతోంది. ఇక్కడ లింగ వివక్ష కూడా బాగా ఎక్కువ. అధిక సంఖ్యాక మహిళలు ఆర్థికంగా స్వతంత్రులు కూడా కాకపోవడం వల్ల దాంపత్య జీవితం అనేక ఒడిదుడుకులతో నిండి ఉంటుంది. అందువల్ల, విడాకులను మంజూరు చేయడంలో జాగ్రత్తగా, అప్రమత్తంగా వ్యవహరించాలని, అనాలోచితంగా విడాకులు మంజూరు చేయకూడదని సుప్రీం కోర్టు పేర్కొనడం ఒక విధంగా స్వాగతించాల్సిన విషయమే. ఏది ఏమైనా వివాహ వ్యవస్థలో, వివాహ బంధంలో సమానత్వం అనేది నేతి బీరకాయ చందంగానే ఉంటోంది.