Friday, November 22, 2024
Homeఫీచర్స్Woman Loco pilot: వందే భారత్ .. నారీశక్తి - సురేఖాయాదవ్‌

Woman Loco pilot: వందే భారత్ .. నారీశక్తి – సురేఖాయాదవ్‌

అవకాశం అందుకోవాలనే తపన .. లక్ష్యం .. సాధించాలనే పట్టుదల ఉంటే .. ఆకాశం సైతం దిగివస్తుందని రుజువు చేశారు సురేఖాయాదవ్‌. సాహసం .. లక్ష్యం .. పట్టుదల ఉంటే స్త్రీపురుష బేధాలు అడ్డంకి కాదని రుజువుచేశారు. భారతీయ రైల్వేశాఖలో మొట్టమొదటి మహిళా ప్యాసింజర్ ట్రైన్ డ్రైవర్‌గా అడుగు పెట్టిన సురేఖా యాదవ్‌ ఆసియాఖండంలో మొదటి మహిళా లోకోపైలెట్‌గా చరిత్రకెక్కారు. అంతేకాదు .. ఇండియాలో అత్యంత వేగమైన రైళ్లు వందేభారత్‌ను నడిపి తన చరిత్రను తనే తిరగరాశారు సురేఖాయాదవ్‌. అత్యంత క్లిష్టమైన రైలుమార్గం షోలాపూర్‌–ఛత్రపతి శివాజీ మహరాజ్‌ టర్మినస్‌కు వందేభారత్‌రైలును నడిపి శభాష్‌ అనిపించుకున్నారు.

- Advertisement -

రైలు ప్రయాణంలో సిబ్బంది ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలి. రెప్ప పాటు కాలంలో ఏదైనా జరగొచ్చు. ఇలాంటి క్లిష్టమైన ఉద్యోగాన్ని ఆ మహిళ ధైర్యంగా చేపట్టింది. అందరి చేత ప్రశంసలు అందుకుంటోంది. కొత్తగా ప్రవేశపెట్టిన సెమీ-హై స్పీడ్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును నడిపిన తొలి మహిళగా సురేఖ యాదవ్ నిలుస్తున్నారు. ఆసియా తొలి మహిళా లోకో పైలట్‌గా ఆమె మరో మెట్టు పైకి ఎక్కారు అని సెంట్రల్ రైల్వే ఘనంగా ప్రకటించింది. ముంబైలోని షోలాపూర్ స్టేషన్ నుండి ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ మధ్య సెమీ-హై స్పీడ్ రైలును నడిపి సురేఖా యాదవ్‌ కొత్త చరిత్ర సృష్టించారు. 450-కిమీ కంటే ఎక్కువ దూరం ప్రయాణించిన తరువాత ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ వద్ద ప్లాట్‌ఫారమ్ నంబర్ 8 పైకి వచ్చిన సురేఖా యాదవ్‌ను సెంట్రల్ రైల్వే అధికారులు ఘనంగా సత్కరించారు.
పశ్చిమ మహారాష్ట్ర ప్రాంతంలోని సతారాకు చెందిన యాదవ్ 1988లో భారతదేశపు మొదటి మహిళా రైలు డ్రైవర్‌గా ఉద్యోగాన్ని ప్రారంభించారు. విధినిర్వహణలో ఆమెచూపిన ప్రతిభకు రాష్ట్ర, జాతీయ స్థాయిలో అనేక అవార్డులను గెలుచుకున్నారు.

దేశంలో వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు నడిపిన తొలి మహిళ లోకోపైలట్‌గానూ సురేఖ యాదవ్‌ హిస్టరీ క్రియేట్ చేశారు. షోలాపూర్‌–ఛత్రపతి శివాజీ మహరాజ్‌ టర్మినస్‌ మధ్య నడుస్తున్న వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో లోకోపైలట్‌ గా సురేఖ యాదవ్‌ విధులు నిర్వహించారు. షోలాపూర్‌ నుంచి సోమవారం మధ్యాహ్నం సీఎస్‌ఎంటీ దిశగా బయలుదేరిన వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు పగ్గాలను రైల్వే అధికారులు సురేఖకు అప్పగించారు. ఈ సందర్భంగా మార్చి 13న వందే భారత్ రైలుతో ముంబయి స్టేషన్‌కు చేరుకోవడంతో ఆమె పేరులో సరికొత్త ఘనత రికార్డ్ అయ్యింది. 34 ఏళ్ల కెరీర్‌లో సురేఖ ఇలాంటి ఎన్నో పనులు చేసి దేశంలోని మహిళలందరికీ రోల్ మోడల్‌గా నిలిచారు. రైల్వేశాఖలో ఆమె పురుషులతో సమానంగా పని చేస్తూ శభాష్‌ అనిపించుకుంటున్నారు. భారతీయ రైల్వే శాఖలో సురేఖాయాదవ్‌ 34 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. సురేఖ యాదవ్‌కు గూడ్స్‌ రైళ్లు, ప్యాసింజరు రైళ్లు నడిపిన అనుభవముంది. వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు నడపాలన్న కలను సైతం ఆమె నెరవేర్చుకున్నారు. ఈ గౌరవం ఇచ్చినందుకు భారతీయ రైల్వేకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.

రైల్లే రూట్స్‌లో ఖండాలా–కర్జత్‌ మధ్య ఘాట్‌ సెక్షన్‌లో రైలు నడపడమంటే లోకోపైలట్‌కు కత్తిమీద సాములాంటిదని నిపుణులు అంటారు. ఇతర ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల మాదిరిగా వందేభారత్‌కు ప్రత్యేకంగా ఇంజిన్‌ అంటూ ఉండదు. మధ్యలో అక్కడక్కడా మూడు చోట్ల పెంటాగ్రాఫ్‌తో కనెక్టివిటీ అయ్యే పవర్ మోటర్లు ఉంటాయి. అయినప్పటికీ సురేఖా యాదవ్‌ ఎంతో చాకచక్యంగా రైలును నడిపిన సురేఖ షెడ్యూల్ సమయం కంటే ఐదు నిమిషాల ముందే గమ్యస్థానానికి చేర్చారు. దీంతో రైల్వే సిబ్బంది, ప్రయాణీకులు హర్షం ప్రకటించారు. భారతదేశపు మొదటి మహిళా డ్రైవర్‌గా అవతరించినందుకు గాను ఆమె కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు సురేఖ యాదవ్.
అందరి సహకారం
భారతీయ రైల్వేశాఖలో గత 34 సంవత్సరాల నుంచి పని చేస్తున్నానని సురేఖా యాదవ్ ప్రకటించారు. విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండేందుకు, తనకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తల్లిదండ్రులు, అత్తామామలు సహకరించారని ఆమె వెల్లడించారు. తండ్రి తనకు మంచి విద్యను అందించడం వల్లనే ఈస్థాయిలో ఉన్నానని ఆమె తెలిపారు. .వందేభారత్ రైలును ముంబైకి తీసుకొచ్చినందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు.

కెరియర్‌
మహారాష్ట్రలోని సాతారా జిల్లాలో సురేఖాయాదవ్‌ జన్మించారు. సౌతారాలోని సెయింట్‌ పాల్‌ స్కూల్‌లో చదువుకున్న సురేఖ ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌లో డిప్లొమా పూర్తిచేశారు. 1989లో అసిస్టెంట్‌ లోకోపైలట్‌గా రైల్వే శాఖలో నియమితులయ్యారు. శిక్షణ పూర్తిచేసుకుని 1996లో గూడ్స్‌ రైలు డ్రైవర్‌గా విధినిర్వహణ బాధ్యతలు చేపట్టారు. 2000లో మోటార్‌ ఉమెన్‌గా గౌరవం పొందారు. 2010లో ఘాట్‌ సెక్షన్‌లో రైలు నడపడంలో శిక్షణ పొందారు. ఆ తరువాత పుణే–ముంబై నగరాల మధ్య నడుస్తున్న డెక్కన్‌ క్వీన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు లోకోపైలట్‌గా ఎలాంటి రిమార్కు లేకుండా విధులు నిర్వహించారు. ఇప్పుడు వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు నడపడంలో కూడా సక్సెస్‌ కావడంతో సురేఖాయాదవ్‌ను అందరూ ప్రశంసిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News