కళలకు పుట్టిల్లు కాకతీయ రాజ్యం.. కాకతీయుల కళాత్మకతకు .. అద్భుత శిల్పసంపదకు ప్రతీకగా ఎన్నో ఆలయాలు కట్టడాలు ఉన్నాయి. కాకతీయులు నిర్మించిన ఎన్నో కట్టడాలు నేటికీ చెక్కు చెదరకుండా అద్భుతమైన చారిత్రక వారసత్వ కట్టడాలుగా విరాజిల్లుతున్నాయి. కాకతీయ రాజు గణపతిదేవ మహాచక్రవర్తి సేనాని రేచర్ల రుద్రారెడ్డి నిర్మించిన అపూర్వమైన దేవాలయం రామప్ప ఆలయం. ఇసుకరాతితో .. నీటితో తేలియాడే ఇటుకలతో నిర్మించిన రామప్ప ఆలయం కళలకు కాణాచిగా భాసిల్లుతోంది. భారతీయుల నృత్యరీతులను సజీవమైన శిల్పాలతో పాఠాలుగా చెబుతోంది. అద్బుతమైన శిల్ప కళా సంపదతో నిండిన రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు కూడా లభించింది.
ఈ దేవాలయాన్ని క్రీస్తు శకం 1213లో గణపతి దేవుడి సామంతుడు సేనాని రేచర్ల రుద్రారెడ్డి నిర్మించారని శాసనాలు వెల్లడిస్తున్నాయి. ఈ ఆలయం నిర్మాణం పూర్తికావడానికి సుమారు 40 ఏళ్లు పట్టిందిని, ఈ ఆలయ గోపురం నిర్మాణానికి ఉపయోగించిన ఇటుకలు నీళ్లలో వేస్తే తేలుతాయని ప్రసిద్ధి. మధ్యయుగానికి చెందిన ఈ శివాలయానికి ఆ పేరు ఎలా వచ్చిందో చరిత్రకారులు కూడా అంచనాకు రాలేక పోయారు. అందుకే ఆ పేరుకు శివుని పేరు కూడా కలిపి రామలింగేశ్వర ఆలయం అని పిలుస్తారు. ఈ దేవాలయంలో ప్రధాన దైవం రామలింగేశ్వరుడు. విష్ణువు ఆవతారం రాముడు, శివుడు కలిసి ప్రధాన దైవంగా ఉన్న దేవాలయం ఈ ఆలయం కాకతీయుల ప్రత్యేక శైలి ఎత్తైన పీఠంపై నక్షత్ర ఆకారాన్ని పోలి ఉంటుంది.
ఈ ఆలయం తూర్పు దిశాభిముఖంగా ఎత్తైన వేదికపై గర్భాలయం, అంతర్భాగాన మూడు వైపుల ప్రవేశ ద్వారంతో కలిగిన మహామండపం ఉంది. గర్భాలయాన ఎత్తైన పీఠంపై నల్లని నునుపు రాతితో చెక్కిన పెద్ద శివలింగం ఉంది. మహామండపం మధ్య భాగాన కల కుడ్య స్తంభాలు, వాటిపై గల రాతి దూలాలు రామాయణ, పురాణ, ఇతిహాస గాథలతో ఔనిండైన అతి రమణీయమైన శిల్పాలు కలిగి ఉన్నాయి. ఈ మహా మండపం వెలుపలి అంచున పై కప్పు క్రింది భాగాన నల్లని నునుపు రాతి పలకంలపై వివిధ భంగిమలతో సర్వాంగ సుందరంగా చెక్కబడిన మదనిక, నాగిని శిల్పాలు కాకతీయుల శిల్పకళాభిరుచులకు చక్కటి తార్కాణాలు. ఈ దేవాలయ ప్రాంగణంలోని ఇతర కట్టడాలలో నంది మండపం, కామేశ్వర, కాటేశ్వర ఆలయాలు భక్తులు, పర్యాటకులను విశేషంగా అలరిస్తున్నాయి.ఈ దేవాలయంలోని శిల్ప సంపద కాకతీయ రాజుల నాటి శిల్ప శైలిని వివరిస్తోంది.ఈ ఆలయానికి ఎదురుగా ఉన్న నందికి ఒక ప్రత్యేకత ఉంది. ఒక కాలు కొంచెం పైకి ఎత్తి పట్టుకొని, చెవులు రిక్కించి యజమాని ఎప్పుడు ఆజ్ఞాపిస్తాడా? అన్న భంగిమల ఉంటుంది. అంతేకాదు ఆ నంది ముందు నుంచి ఎటువైపు చూసినా మన వైపే చూస్తున్నట్లు ఉండడం ఆ నంది ప్రత్యేకత. గర్భగుడికి ఎదురుగా ఉన్న మండపంలో ఉన్న స్థంబాల మీద అత్యంత రమణీయమైన శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. మండపం పైకప్పు మీద శిలకళాసౌందర్యం చాలా అద్భుతంగా ఉంటుంది. లోపల రెండు శివుని సన్నిధులు ఉన్నాయి. శివుడి వైపు చూస్తున్న నంది చాలా ఆందంగా ఏ్బొ ఇప్పటికి చెక్కుచెదరకుండా ఉంది. ఈ గుడి తరచు జరిగిన దండయాత్రల గురైనట్లు చరిత్రకారులు వెల్లడించారు. 17వ శతాబ్దంలో వచ్చిన భూకంపంలో ఆలయం కొద్దిగా శిథిలమైందని తెలుస్తోంది. ఆ భూకంపానికి ఆలయ ముఖ ద్వారం శిథిలమైపోయింది.
ఆసఫ్‌జాహీ రాజవంశీకులు
కాకతీయుల రాజ్య పతనానంతరం 600 ఏళ్లపాటు ఆదరణ లేక కళా విహీనమైన ఈ దేవాలయాన్ని తిరిగి వెలుగులోకి తెచ్చినది హైదరాబాదుకు చెందిన అసిఫ్ జాహి రాజవంశమువారు. వారీ ప్రాంతానికి వేటకై వచ్చినప్పుడు ఈ ఆలయం, రామప్ప చెరువు చూసి, ఆ కళా ఖండాలు అలా శిధిలమయిపోకూడదని వాటి పునరుధ్ధరణ కార్యక్రమాలు చేబట్టారు. ఆ ప్రాంతపు పెద్దలుకూడా తమ పంటపొలాలను ఆలయ పోషణకు దానముగా ఇచ్చి తోడ్పడ్డారని చరిత్రకారులు వెల్లడించారు.
శిల్పకళా సంపద
గర్భగుడి ముందుండే మండపంలో అద్భుత శిల్పకళ ఉంటుంది. పురాణ గాథలు, నాట్యగత్తెలు, సంగీత వాయిద్యకారులు, పౌరాణిక జంతువులు.. ఇలాంటివి ఆ శిల్పాలపై చెక్కారు.
హైహీల్స్ వేసుకున్న మహిళ శిల్పం ప్రత్యేక ఆకర్షణ. ప్రధాన ఆలయానికి ఎదురుగా ఉన్న మండపంలోని నంది శిల్పం కూడా మిగతా చోట్ల కంటే భిన్నంగా ఉంటుంది. నల్లరాతిలో చెక్కబడి, జీవకళ వుట్టి పడుతున్నట్లుండే ఈ నంది గంటలు, ఆభరణాలు చెక్కటానికి శిల్పి ఎంత శ్రమించాడో అనిపిస్తుంది. ప్రదక్షిణ ఎక్కడ మొదలు పెట్టాలో మనకు దారి చూపిస్తూ చిన్న ఏనుగుల వరస చెక్కబడివుంది. ఈ వరసలో మొదట ఒక వ్యక్తి కత్తి పట్టుకుని వుంటాడు. చివరి ఏనుగు దేవుని ముందు భక్తితో తలవంచుకుని వుంటుంది. ఈ ఏనుగుల వరసపైన రెండు విప్పారిన తామర పువ్వుల వరస చెక్కి ఉంటుంది. వీటి మధ్య, గుడి కప్పులోవున్న సుందరీమణుల విగ్రహాల సూక్ష్మ రూపాలు చెక్కబడివున్నాయి. అంతేకాదు.ఆ గోడలను పరిశీలించి చూస్తే శైవ, వైష్ణవ, బౌధ్ధ, జైన మతాల దేవతలు, మహనీయుల శిల్పాలున్నాయి. ఇవి ఆనాటి రాజుల సర్వమత సమైక్యతను తెలియజేస్తోంది. ఇంకా ముఖ్యమైనవి, ఆకాలంలో స్త్రీల విలువని తెలియచేసే విగ్రహాలు, జంధ్యం ధరించిన స్త్రీ.. ఆ కాలంలో స్త్రీలు వేదాధ్యయనం చేసేవారని తెలియజేస్తుంది. స్త్రీలు ధర్మ ప్రచారం చేశారనేందుకు గుర్తుగా రుద్రాక్ష మాలను జంధ్యముగా ధరించిన స్త్రీ మూర్తిని చూడవచ్చు. అలాగే, స్త్రీలు యుధ్ధ విద్యలలో ఆరితేరారనటానికి రెండు ఏనుగులతో పోరాడే యువతి, కత్తి ధరించిన యువతి ఉండడం విశేషం.ఆలయం స్తంభాలకు, పై కప్పుకు మధ్యగల ప్రదేశంలో ప్రస్తుతం 26 ఏనుగు పైన సింహము వున్న విగ్రహాలున్నాయి. కాకతీయ రాజుల బిరుదాలయిన రాయగజకేసరి, అరిగజకేసరిలకు గుర్తుగా వీటిని చెక్కినట్లు తెలుస్తోంది. ఇవికాక ఆలయానికే పేరు తెచ్చిపెట్టిన 12 సాలభంజికలు మూర్తులు అపురూపాలు. ఒక్కొక్కటి ఒక్కొక్క విలక్షణమైన హావభావాలతో చెక్కబడ్డాయి. ఈ సుందర మూర్తులే రామప్ప దేవాలయానికి ప్రధాన ఆకర్షణ. ఇవ్వన్నీ నల్లరాతి శిల్పాలు. ఈ విగ్రహాల వస్త్రములు, ఆభరణములు, హావ భావాలు, భంగిమలు, కేశములు ఆ నాటి శిల్పుల కళా నైపుణ్యాన్ని చాటి చెబుతున్నాయి.
ఆలయం లోపలకి ప్రవేశించగానే రంగమంటపం కనబడుతుంది. ఇక్కడ దైవారాధనలో నృత్యప్రదర్శనలు జరిగేవని తెలుస్తోంది. మంటపానికి స్తంభాలకు, దూలాలకి, కప్పుకు నల్లరాళ్ళను వాడారు. అయితే, ఆ నల్లరాళ్లు ఆ చుట్టుపక్కల ఎక్కడా అటువంటి రాయి దొరకదు. మరి ఇంతపెద్ద నల్లరాళ్ళు ఎక్కడనుంచి, ఏ వాహనాలలో తెచ్చారో, వాటిని పైకి ఎత్తి ఎలా అమర్చారో అని ఆలోచిస్తే ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. ఈ మంటపంలో కొన్ని రాళ్ళు విరిగి ఎత్తుపల్లాలుగా ఉన్నాయి. ఈ రాళ్లు భూకంపాల ధాటికి ఆవిధంగా మారి ఉండవచ్చని అంటున్నారు. ఈ మంటపం కప్పు మధ్యలో నటరాజు పదిచేతులతో నిలబడిన విగ్రహం ఉంటుంది. ఆయనకి ఎనిమిది దిక్కులలో దిక్పాలకులు వారి వాహనాలతో వున్నారు. ఎండలు తీవ్రంగా ఉన్న వేసవికాలంలో సైతం ఈ మండపంలో చల్లగా వుంటుంది. గర్భగుడి ద్వారమునకు ఆనుకుని వున్న రెండు శిలాఫలకాల మీద నాట్య, మృదంగ వాద్యకారుల బొమ్మలు రకరకాల భంగిమలలో శిల్పులు ఆద్భుతంగా మలిచారు. మలచబడ్డాయి. నల్లరాయి, ఎర్ర ఇసుక ఇటుకల మేళవింపుతో రేచర్ల రుద్రుడు ఈ గుడిని నిర్మించారు. ప్రతి గుడి నిర్మాణానికీ కొన్ని శాసనాలు ఉంటాయి. వాటిలో కొన్ని పాడవుతుంటాయి. అయితే ఈ గుడికి సంబంధించిన శాసనం పాడవకుండా, ప్రత్యేకంగా ఆ శాసనం కోసమే ఒక మండపం కట్టించారు. ఈ గుడిపై ఉండే శిల్ప భంగిమలను ఆధారం చేసుకుని అంతరించిపోయిన పేరిణి శివతాండవం అనే నృత్యాన్ని తిరిగి పునరుద్ధరించారు నటరాజ రామకృష్ణ. జాయప సేనాని రాసిన నృత్య రత్నావళిలోని కొన్ని భంగిమలు కూడా ఈ గుడిపై శిల్పాలుగా చెక్కారు.
రామప్ప ఎవరు ?
వరల్డ్ హెరిటేజ్ కమిటీ (యునెస్కో)ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించిన రామప్ప ఆలయం పేరుపై ఇప్పటికీ విస్మయం వ్యక్తమవుతుంటుంది. ఈ అపురూప శిల్పాలయాన్ని క్రీస్తు శకం 1213లో కాకతీయ ప్రభువు గణపతిదేవుని సైన్యాధ్యక్షుడు, సామంతుడు రేచర్ల రుద్రుడు కట్టించారు. ఆలయ సమీపంలో విశాలమైన చెరువు కూడా నిర్మించాడు. రామప్ప ఆలయ గర్భగుడిలో రామలింగేశ్వరుడు దర్శనమిస్తాడు. కానీ ఆ రామలింగేశ్వరుడి పేరుతో ఈ ఆలయానికా పేరు రాలేదు. ఆనాటి పాలకుడైన గణపతిదేవుడి పేరుతోనూ పిలువలేదు. ఇంత అందమైన ఆలయాన్ని కట్టించిన రేచర్ల రుద్రుడి పేరుతోనూ చెప్పుకోలేదు.తన శిల్పకళతో ఆ ఆలయం అణువణువునూ అపురూపంగా మలిచిన శిల్పాచార్యుడు, స్థపతి అయిన రామప్ప పేరుతో ఈ ఆలయం ఖ్యాతిగడించింది.
రామప్ప చెరువు
కంటికి కనిపించినంత దూరమంతా ఆకుపచ్చని చెట్లు, ఎత్తైన కొండలు మధ్యలో నీరు నిండి ఉంటుంది రామప్ప చెరువు. ఇది రామప్ప గుడికి కేవలం 1 కి.మీ దూరంలో ఉంటుంది ఈ చెరువు.
రామప్ప చెరువును గణపతి దేవుడి సేనాని రేచర్ల రుద్రుడు క్రీ.శ. 1213లో నిర్మించినట్లు చెరువు పక్కనే ఉన్న శివాలయంలోని శాసనం వెల్లడిస్తోంది. రెండు గుట్టల మధ్యలో ఆనకట్ట నిర్మించడం వలన ఇది కాకతీయుల కాలంలో లోతైన చెరువుగా నిలిచిందంట.మానవ నిర్మితమైన ఈ చెరువు ద్వారా ఇప్పటికీ వ్యవసాయ భూములకు సాగునీరు అందుతుంది. ఇది అధికారికంగా 6 వేల ఎకరాలకు, అనధికారికంగా 5 వేల ఎకరాలకు సాగునీరందిస్తోంది. అలాగే నాలుగు మండలాల గ్రామాలకు మిషన్ భగీరథ కింద తాగునీరు అందిస్తోంది. అయితే ఈ ప్రదేశంలో మోటార్ బోటింగ్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. ఈ అందమైన ఈ సరస్సు ఇప్పుడు తెలంగాణలో అద్భుతమైన పర్యాటక ప్రదేశంగా మారింది.
నిత్య కైంకర్యాలు
కాకతీయుల పాలన శిల్ప కళకు స్వర్ణయుగం, అందులోనూ త్రికూటాలయాలు ప్రసిద్ధి చెందాయి. అయితే, రామప్ప గుడి త్రికూటాలయం కాదు. కానీ, ఈ ఆలయానికి మూడు ప్రవేశ ద్వారాలున్నాయి. ఎత్తయిన పీఠంపై నక్షత్ర ఆకారంలో, తూర్పునకు అభిముఖంగా గుడిని నిర్మించారు. ఉత్తర, దక్షిణ దిశల్లోనూ ప్రవేశ ద్వారాలున్నాయి. ఆలయం మధ్యభాగంలో మహామంటపం ఏర్పాటు చేశారు. క్రీ.శ.1203లో వేయించిన, గణపతిదేవుని కాలం నాటి కొండపర్తి శాసనం.. కాకతీయ శిల్ప నిర్మాణ కౌశలాన్ని వర్ణించింది. ఈ దేవాలయము తూర్పు దక్షిణము ఉత్తరము మూడు వైపులా ద్వారములు కలిగిన ఎత్తయిన వేదికలపై నిర్మించబడినది పశ్చిమ వైపు గర్భాలయము నందు శివుడు లింగ రూపం ప్రతిష్టించబడి ఉన్నాడు. అద్భుతమైన దేవాలయాన్ని నిర్మించి క్రీస్తుశకం 1213లో రుద్రేశ్వరున్ని ప్రతిష్ఠింప చేశారు ఆ రోజు నుంచి ఈరోజు వరకు పరమశివుడు నిత్యపూజలు అందుకుంటున్నాడని, గత 13 సంవత్సరాలుగా ఈ ఆలయంలో లో నిత్యకైంకర్యాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ పూజారులు వెల్లడించడం విశేషం. ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానమూ, యంత్రాలూ లేని కాలంలో నిర్మించిన రామప్ప గుడిలో కనీవినీ ఎరుగని వింతలు కనిపించడం అద్భుతం. దేవాలయంలోని శిల్ప సౌందర్యం ఆనాటి శిల్పాచార్యుల సునిశిత పనితనాన్ని చాటిచెబుతోంది. గొలుసుకట్టుగా నిర్మించిన చిన్నచిన్న శిల్పాల వెనుకగా ఒకవైపు నుంచి మరోవైపునకు దారం తీయవచ్చంటే ఆ శిల్ప నిర్మాణ చాతుర్యం ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. ఎన్నో వింతలు, విశేషాలు రామప్ప ఆలయం కొలువుదీరాయి.