రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ న్యూఢిల్లీలోని బీఆర్‌ఎస్ నేషనల్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. రాష్ట్ర పార్టీ నుంచి టీఆర్‌ఎస్ పార్టీ విస్తరిస్తూ బీఆర్‌ఎస్ పార్టీగా రూపాంతరం చెంది రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా జరిగే ఎన్నికల్లో పోటీ చేయనుందని తెలిపారు. బీఆర్‌ఎస్ పార్టీ ప్రకటనతో దేశవ్యాప్తంగా సెక్యులర్ రాజకీయ పార్టీలు, సెక్యులర్ మనస్తత్వం ఉన్న ప్రజల్లో ఆనందం వెల్లివిరిస్తోందని, కేంద్రం, ఆ పార్టీ నేతలపై మతోన్మాదానికి వ్యతిరేకంగా గళం విప్పే ధైర్యం ఈ రోజుల్లో ఎవరికీ లేదన్నారు. అయితే గత కొన్ని నెలలుగా కేంద్ర ప్రభుత్వ తప్పుడు విధానాలు, పక్షపాత వైఖరిపై సాహసోపేతమైన ప్రకటనలు చేసిన ఏకైక నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. 2014లో కేంద్రంలో బీజేపీ, తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాయన్నారు. ఈ ఎనిమిదిన్నరేళ్లలో తెలంగాణ రాష్ట్రం ఓవరాల్‌గా అసాధారణ అభివృద్ధిని సాధించగా, కేంద్ర ప్రభుత్వ తప్పుడు విధానాల వల్ల ప్రపంచ దేశాల్లో దేశ ప్రతిష్ట దెబ్బతిన్నదని అన్నారు.తెలంగాణలో అన్ని మతాల ప్రజల అభివృద్ధికి, సంక్షేమానికి సమాన అవకాశాలు కల్పించిన కె.చంద్రశేఖర్ రావు దేశవ్యాప్తంగా ఆచరణాత్మక సెక్యులర్ నాయకుడని, దాని వల్లనే తెలంగాణ ప్రజలు ప్రగతి సాధించారని మంత్రి అన్నారు. భవిష్యత్తులో అన్ని మతాల సంక్షేమం, దేశాభివృద్ధికి బీఆర్‌ఎస్ పార్టీ కృషి చేస్తుందన్నారు. ఇది దేశంలోని రైతులు, సైనికులు మరియు ముఖ్యంగా పేద ప్రజల సంక్షేమం మరియు జీవన నాణ్యతను మెరుగుపరచడానికి పని చేస్తుందనీ పేర్కొన్నారు.
నిజాముద్దీన్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు….
ఈ సందర్భంగా….. హోం మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ పార్టీ మైనార్టీ నాయకులు మసీహుల్లాఖాన్, ఆరీఫుద్దీన్, సబీలుద్దీన్, ఫరీద్, బద్రుద్దీన్, అబ్దుల్ బాసిత్ తదితరులతో పాటు హజ్రత్ నిజాముద్దీన్ దర్గా కు వెళ్లి పూలమాలలు వేసి ఫాతిహా పఠించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో ఉండాలని, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలని, ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ప్రార్థనలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా బి ఆర్ ఎస్ పార్టీ విజయం మరియు దేశవ్యాప్తంగా ప్రజలలో గంగ-జమున సంస్కృతి పరిరక్షణ కోసం ప్రార్థనలు జరిగాయి.