YS Sharmila Padayatra: వరంగల్ జిల్లాలో వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన పాదయాత్రకు మళ్లీ బ్రేక్ పడింది. పోలీసుల నోటీసులతో ఆమె పాదయాత్రను వాయిదా వేసుకున్నారు. ఆదివారం నుంచి పాదయాత్ర వరంగల్ జిల్లాలో పునఃప్రారంభం కావాల్సి ఉంది. లింగగిరి నుంచి తిరిగి యాత్ర మొదలవుతుందని శనివారం వైఎస్ఆర్ టీపీ నేతలు తెలిపారు. పాదయాత్రకు షర్మిల సిద్ధమైంది. కానీ శనివారం రాత్రి సమయంలో ఆమె పాదయాత్రకు అడ్డుచెబుతూ వరంగల్ పోలీసులు షోకాజు నోటీసులిచ్చారు. దీంతో ఆదివారం ఒక్కరోజు షర్మిల పాదయాత్ర వాయిదా పడింది.
ఇదిలాఉంటే హైకోర్టు షర్మిల పాదయాత్రకు ఇప్పటికే అనుమతి ఇచ్చిన విషయం విధితమే. అయితే, పోలీసుల నుంచి అనుమతి కోరుతూ పార్టీ నేతలు దరఖాస్తు పెట్టుకున్నారు. పాదయాత్రలో గతంలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకోవడంతో అనుమతి ఎందుకు నిరాకరించకూడదనే విషయం చెప్పాలంటూ షర్మిలకు వరంగల్ పోలీసులు శనివారం రాత్రి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పోలీసుల షోకాజు నోటీసులపై న్యాయనిపుణుల సలహాలు తీసుకొని ముందుకెళ్లాలని షర్మిల, ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం లింగగిరి నుంచి పాదయాత్రను ఆదివారం పునఃప్రారంభించాల్సి ఉంది. ఈ మేరకు పోలీసులను అనుమతి కోరారు. వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వి. రంగనాథ్.. పాదయాత్రకు అనుమతి ఎందుకు నిరాకరించకూడదో చె్ప్పాలంటూ పార్టీ నేతలకు షోకాజు నోటీసులిచ్చారు. వరంగల్ జిల్లాలో పాదయాత్రకు తొలుత అనుమతిచ్చామని, కానీ నిబంధనలు అతిక్రమిస్తూ షర్మిల వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారని , జిల్లాలో ఉద్రిక్తత పరిస్థితులకు పాదయాత్ర కారణమైందని పోలీసులు ఇచ్చిన షోకాజు నోటీసులో పేర్కొన్నారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని పాదయాత్రకు అనుమతి నిరాకరిస్తున్నామని పోలీసులు తెలిపారు.
శనివారం రాత్రి ఈ షోకాజు నోటీసులు అందడంతో.. ఆదివారం షర్మిల పాదయాత్రను వాయిదా వేశారు. సోమవారం పాదయాత్ర పునఃప్రారంభమవుతుందని పార్టీ నేతలు చెబుతున్నప్పటికీ.. పోలీసులు అనుమతి ఇచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. ఈ క్రమంలో మరోసారి పార్టీ నేతలు హైకోర్టుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.