ఉలవ చారంటే ఇష్టపడేవాళ్లు ఎంతోమంది ఉన్నారు. ఉలవల వల్ల పొందే ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా పొత్తికడుపు చుట్టూ ఉండే కొవ్వును ఉలవలు బాగా తగ్గిస్తాయి. ఉలవల్లో పీచుపదార్థాలు, ప్రొటీన్లు, ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీర బరువును తగ్గించడంలో ఎంతో కీలకంగా వ్యవహరిస్తాయి. ఉలవల్లో కొవ్వును కరిగించే సహజసిద్ధమైన గుణాలు ఉన్నాయి. అంతేకాదు శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్ (హెచ్ డిఎల్)ను ఇవి పెంపొందిస్తాయి. అంతేకాదు జీర్ణక్రియ బాగా జరిగేలా కూడా ఉలవలు ఉపయోగపడతాయి. ఉలవల్లో కేలరీలు తక్కువగా ఉంటాయి. వీటిల్లోని బలవర్ధకమైన ప్రొటీన్ల వల్ల తొందరగా ఆకలి వేయదు. దాంతో చిరుతిళ్ల జోలికి వెళ్లం. ఫలితంగా శరీర బరువు కూడా పెరగం. వీటిల్లో కేలరీలు తక్కువగా ఉండడం వల్ల పొత్తికడుపు చుట్టూ ఉన్న కొవ్వు కూడా తగ్గుతుంది. లావు నడుము ఉండదు. ఉలవల్లోని సొల్యూబుల్, నాన్ సొల్యుబుల్ పీచుపదార్థాల వల్ల జీర్ణశక్తి బాగా జరగడంతో పాటు పెద్దప్రేగులు ఎంతో శుభ్రంగా ఉంటాయి. డిటాక్సిఫికేషన్ డైట్ లో ఉన్నవాళ్లు గింజలు, నట్స్, చేపలు, చిరుధాన్యాలతోపాటు ఉలవలను కూడా తీసుకుంటారు. ప్రొటీన్లు బాగా ఉండే డైట్ తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ బాగా జరుగుతుంది. ఉలవలు ఈ విషయంలో ఎంతో ఉపకరిస్తాయి. అలాంటి ఉలవలను ఎలా తీసుకోవాలో కూడా చూద్దాం. ఉలవలు వేడిని ఉత్పత్తి చేసేవి. అందుకే వీటిని జీలకర్రపొడి, జ్యూసులు, మజ్జిగ వంటి కూలింగ్ ఫుడ్స్ తో తీసుకోవాలి. ఉలవల్లో మసాలాలు చేర్చి పరిమిత పాళ్లల్లో తింటే జలుబు, గొంతునొప్పి, జ్వరం వంటి వాటిని కూడా తగ్గిస్తాయని
ఒక స్టడీలో వెల్లడైంది. ఉలవలను రెండు గంటలు నీటిలో నానబెట్టి ఎన్నో వెరైటీ రెసిపీ చేసుకుని తినొచ్చు. ఉలవల మొలకలను సలాడ్లలో వేసుకుని తినొచ్చు. ఉలవలతో పొడి చేస్తారు. దీన్ని అన్నంలో కలుపుకుని తింటే బరువు తగ్గుతారు.
ఉలవలతో చేసే కొన్ని రెసిపీలు ,ఉలవల పొడి:
ఒక కప్పు ఉలవలు, ఒక టేబుల్ స్పూను జీలకర్ర, నాలుగు టేబుల్ స్పూన్ల కందికాయలు, నాలుగు టేబుల్ స్పూన్ల నల్లమినపప్పు, పది ఎండు మిర్చి, ఒక టీస్పూను నల్లమిరియాలు తీసుకోవాలి. మొదటగా ఉలవలను పచ్చి వాసన పోయేవరకూ వేగించాలి. తర్వాత కందికాయలు, నల్లమినపప్పులను రంగు మారేవరకూ వేగించాలి. అలాగే మిగతా పదార్థాలను కూడా వేగించి చల్లారనివ్వాలి. వీటన్నింటినీ గ్రైండర్ లో వేసి కొద్దిగా గర గరలాడేలాగ పొడి చేయాలి. ఆ పొడిని వేడి అన్నంలో కలుపుకుని తింటే బరువు తగ్గుతారు. దీన్ని లంచ్ టైములో తింటే ఎంతో మంచిది.
ఉలవ చారు:
ఉలవలతో సూప్ చేసుకుని తాగితే కూడా ఎంతో మంచిది. మీరు చేయాల్సిందల్లా ఒక కప్పు ఉలవలు, ఒక టీస్పూను ఆవాలు, ఒక టేబుల్ స్పూను చింతపండురసం, కొన్ని కరివేపాకు ఆకులు, ఒక పచ్చి మిరపకాయ, ఒక స్పూను జీలకర్ర, ఒక ఎండుమిర్చి, ఒక టేబుల్ స్పూను ఆలివ్ ఆయిల్, ఉప్పు తగినంత రెడీ పెట్టుకోవాలి. ముందు రోజు రాత్రి రెండు కప్పుల నీళ్లల్లో ఉలవలు నానబెట్టి పొద్దున్నలేచిన తర్వాత అదే నీటిలో వాటిని ఉడకబెట్టాలి. అవి ఉడికిన తర్వాత అందులోని నీళ్లు పూర్తిగా తీసేయాలి. ఒక బాండి తీసుకుని అందులో కొద్దిగా నూనె వేసి వేడి అయిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసి వేగించి చింతపండురసం అందులో పోయాలి.
అది ఉడకడం ప్రారంభం కాగానే ఒక కప్పు నీళ్లు, ఉప్పు, పచ్చిమరపకాయ అందులో పోయాలి. దాన్ని ఐదు నిమిషాలు మరగినిచ్చిన తర్వాత ఉడకబెట్టిన ఉలవలను అందులో వేసి పొంగుకు వచ్చేవరకూ ఆ మిశ్రమాన్ని ఉడకనివ్వాలి. ఆ తర్వాత దాన్ని స్టవ్ మీద నుంచి కిందకు దింపాలి.
ఉలవల మొలకల రెసిపీ:
మొలకెత్తిన ఉలవలు ఇంకొక రెసిపీ. దీన్ని స్నాక్ లా లేదా బ్రేక్ ఫాస్ట్ గా తినొచ్చు. దీని తయారీ కూడా చాలా సింపుల్. అరకప్పు ఉలవలు, రెండు కప్పుల నీళ్లు, తరిగిన ఉల్లిపాయలు పావు కప్పు, తరిగిన టొమాటో ముక్కలు పావుకప్పు, కీరకాయముక్కలు అరకప్పు, రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం, రుచికి సరిపడా ఉప్పు రెడీగా పెట్టుకోవాలి. ఉలవలను రాత్రి నీళ్లల్లో నానబెట్టుకోవాలి. పొద్దున్న లేచిన తర్వాత వాటిని బాగా కడిగి ఆ ఉలవల్లో ఒక కప్పు తాజా నీళ్లను పోసి ఫ్రిజ్ లో పెట్టాలి. ఆ రోజు సాయంత్రం లేదా మర్నాడు ఉదయాలనికల్లా ఆ ఉలవలకు మొలకలు వస్తాయి. వాటిల్లో ఉల్లిపాయ ముక్కలు, కీర, టొమాటోక ముక్కలు, నిమ్మరసం, తగినంత ఉప్పు వేసి బాగా కలిపి స్నాక్ లా తింటే ఎంతో మంచిది.
ఉలవల దాల్:
ఉలవలతో పప్పు చేసుకుని తింటే కూడా ఎంతో బలం. ఉడకబెట్టిన ఉలవలు అరకప్పు, పావుకప్పు తరిగిన ఉల్లిపాయ ముక్కలు, తరిగిన టొమాటో ముక్కలు పావుకప్పు, టీస్పూను జీలకర్ర, ఒక వెల్లుల్లి రెబ్బ, పావు టీస్పూను ధనియాల పొడి, అర టీస్పూను పసుపు, అర టీస్పూను కారం, అర టీస్పూను జీలకర్రపొడి, రెండు టేబుల్ స్సూన్ల నెయ్యి లేదా ఆలివ్ ఆయిల్, ఒక ఎండు మిర్చి, చిటికెడు గరం మసాలా, సన్నగా తరిగిన కొత్తిమీర, ఉప్పు సరిపడినంత రెడీ పెట్టుకోవాలి. తర్వాత బాండి తీసుకుని అందులో నెయ్యి లేదా నూనె వేసి వేడి చేయాలి.
అందులో తరిగిన వెల్లుల్లి ముక్కలు, జీలకర్ర వేసి కాసేపు వేగనివ్వాలి. తర్వాత తరిగిన ఉల్లిపాయ ముక్కలను అందులో వేసి రెండునిమిషాలు ఉడకనివ్వాలి. ఆతర్వాత తరిగిన టొమాటో ముక్కలు, జీలకర్రపొడి, ధనియాలపొడి, పసుపు, కారం, ఉప్పు అందులో వేసి వేపాలి.బాగా వేగిన ఆ మిశ్రమంలో ఉడకబెట్టిన ఉలవలను వేసి కలపాలి. అందులో అరకప్పు నీళ్లు పోసి ఐదు నిమిషాలు ఉడకనిచ్చి తర్వాత ఒక చిటికెడు గరంమసాలా పొడి వేయాలి. ఆ తర్వాత ఉడికిన ఉలవల పప్పుపై కొత్తిమీరను చల్లాలి. ఈ పప్పును లంచ్ లో లేదా డిన్నర్ లో తినొచ్చు. పరిమితి మించకుండా మాత్రమే ఉలవలను తినాలని
మరొవొద్దు. లేకపోతే సైడ్ ఎఫెక్టులతో బాధపడే అవకాశం ఉంది.