Friday, September 20, 2024
Homeఓపన్ పేజ్Women's reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లు అందరికా? కొందరికా?

Women’s reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లు అందరికా? కొందరికా?

రాజకీయ పార్టీలకు మహిళా రిజర్వేషన్ బిల్లు కొరకరాని కొయ్యగా మారింది. విడవమంటే పాముకు, కరవ మంటే కప్పకు కోపం అన్నట్లుగా ఉన్నది రాజకీయ పక్షాల పరిస్థితి. శతాబ్దాలుగా పేరుకు పోయిన పురుషాధిక్య భావనే దీనికి ప్రధాన కారణంగా పేర్కొనవచ్చు. అందుకే దశాబ్దాలుగా పార్లమెంటులో ఉన్న చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించే బిల్లు చట్టంగా మారడం లేదు. ఈ మహిళా బిల్లు చట్టంగా మారితే ఎవరి సీటుకు ఎసరొస్తుందోననే భయం అన్ని రాజకీయ పార్టీలకు, ఆయా పార్టీల నాయకులకు పట్టుకుంది. అందుకే బిల్లు రూపకల్పన చేసినా, దానిలో లోపాలకు అవకాశం కల్పించి చట్టంగా మారకుండా చేస్తున్నాయి ఇన్నాళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు. మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు ఇవ్వడానికి అన్ని రాజకీయ పార్టీలు సూత్రప్రాయంగా అనుకూలమే. ఇప్పటి వరకు ఏ ఒక్క పార్టీ వ్యతిరేకంగా మాట్లాడలేదు. కానీ మహిళా రిజర్వేషన్ బిల్లుకు మోక్షం రావడం లేదు ఎందుకు? ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉండటానికి కారణమేమిటి? చిన్న, పెద్ద రాజకీయ పార్టీలు అన్నీ గొంతెత్తి మరీ మహిళలకు మూడోవంతు సీట్లు ఇవ్వాలంటూ మాట్లాడుతున్నాయి. కానీ మాట్లాడే పార్టీలు తమ పార్టీల్లో మహిళలకు సరియైన ప్రాధాన్యత ఇవ్వడం లేదు. మరోవైపు మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఉన్న అడ్డంకులు తొలగించడానికి పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశ పెట్టిన పార్టీలు ముందుకు రావడం లేదు. కానీ తాము ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లును కొన్ని పార్టీలు అడ్డుకుంటున్నాయని, తాము మాత్రమే మహిళా రిజర్వేషన్ బిల్లుకు అనుకూలమని చెబుతున్నాయి. చిత్తశుద్ధి లేని పార్టీల వల్ల దశాబ్దాల తరబడి కదలకుండా ఉంది ఆ బిల్లు. అనేక ఆందోళనల మధ్య ఈ బిల్లు 2010 మార్చి 9న రాజ్యసభలో ఆమోదం పొంది లోక్ సభ వద్దకు వచ్చి ఆగిపోయింది. లోక్ సభలో ఆమోదం పొందితే కానీ చట్టం కాదు మహిళా రిజర్వేషన్ బిల్లు.
2010 నుండి డీప్ ఫ్రిజ్ లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లు భారత రాష్ట్ర సమితికి చెందిన కీలక నేత, ఆ పార్టీ అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కూతురు కవిత ఇటీవల ఈ బిల్లుకు అనుకూలంగా దేశ రాజధాని న్యూఢిల్లీలో కొన్ని మిత్ర రాజకీయ పార్టీలు, వివిధ రాష్ట్రాలకు చెందిన మహిళా సంఘాలతో కలిసి ఒక రోజు దీక్ష చేశారు. దీంతో ఈ బిల్లు గురించి మరో సారి రాజకీయ పార్టీల్లో చర్చ ప్రారంభమైంది.
ఒక్క సారి చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు పూర్వాపరాలు చూస్తే, రాజ్యాంగ 108వ సవరణ బిల్లుగా 2008 సంవత్సరంలో పార్లమెంటులో దీనిని ప్రవేశ పెట్టారు. లోక్ సభ, రాష్ట్రాల్లోని శాసనసభలలో మహిళలకు మూడోవంతు సీట్లు కేటాయించాలని ఈ బిల్లు సారాంశం. అలాగే షెడ్యూల్ తెగలు, షెడ్యూల్ కులాలకు కేటాయించిన రిజర్వడ్ స్థానాల్లో కూడా ఆ వర్గాలకు చెందిన మహిళలకు మూడోవంతు సీట్లు కేటాయించాలని ఈ బిల్లు ముసాయిదాలో పేర్కొన్నారు. మహిళలకు కేటాయించిన సీట్లను రొటేషన్ విధానంలో ఖరారు చేస్తారు. అంటే సార్వత్రిక ఎన్నికలు జరిగిన ప్రతిసారి మహిళల స్థానాలు మారుతాయి. మహిళల సాధికారత కోసం ఏర్పాటు చేసిన ఈ రిజర్వేషన్లు అవి ప్రారంభమైనప్పటి నుంచి పదిహేను సంవత్సరాల పాటు కొనసాగుతాయి. ఇవి 2010 రాజ్యసభలో ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ బిల్లులో ఉన్న అంశాలు.
అంతకు ముందు 1996లోనే మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటు ముందుకు వచ్చింది. ఆనాటి ప్రతి పక్షాలు బిల్లును వ్యతిరేకించడంతో అది చట్టంగా మారలేదు. మహిళా రిజర్వేషన్ బిల్లులో ఓబీసీ మహిళలకు కూడా వారి జనాభా నిష్పత్తికి అనుగుణంగా సబ్ కోటా ఉండాలని యథాతథ బిల్లును వ్యతిరేకించిన పార్టీల వాదన. దీంతో ఏకాభిప్రాయం కుదరక పోవడంతో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆనాడు అటకెక్కింది. అనంతరం మహిళా రిజర్వేషన్ బిల్లును పరిశీలించడానికి ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక ఓబీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు రాజ్యాంగాన్ని సవరించిన తరువాత మహిళా రిజర్వేషన్ బిల్లులో ఓబీసీ మహిళలకు సబ్ కోటా రిజర్వేషన్లు కల్పించాలని సిఫార్సు చేసింది. అదే విధంగా రాజ్యసభ, శాసన మండలులకు కూడా ఈ రిజర్వేషన్లు విస్తరించాలని సిఫార్సు చేసింది. ఈ సవరణలు ఏవీ కూడా రాజ్యాంగం 108 సవరణ బిల్లు -2008లో లేవు. దీంతో మళ్లీ ఈ బిల్లుపై అభ్యంతరాలు వెల్లువెత్తాయి.
దేశంలో మహిళల విముక్తి, సమానత్వ భావన తదితర అంశాలను వ్యతిరేకిస్తున్న శక్తులు అధికారాన్ని చేజిక్కించుకున్నాయి. మహిళలను కేవలం కుల వ్యవస్థకు ప్రతీకలుగా భావిస్తున్న శక్తులు పరిపాలనలో ఉన్నాయి. అందుకే బిల్లు చట్టంగా రూపాంతరం చెందడం లేదనేది కొందరి వాదన.
అటు ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో మహిళలకు చట్టసభల్లో తగు రీతిలో హక్కులు కల్పిస్తూ చట్టాలు చేస్తున్నారు. ఇటీవల ప్రభుత్వ అన్ని విభాగాల్లో మహిళల సంఖ్య పెంచేందుకు రూపొందించిన ముసాయిదా బిల్లును స్పెయిన్ ప్రభుత్వం ఆమోదించింది. కారణమేదైనా మహిళా రిజర్వేషన్ బిల్లును బీజేపీ నేతృత్వంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం ఆమోదించాలని ఇటు కొత్తగా ఎమ్మెల్సీ కవిత పల్లవి ఎత్తుకుంది. దీక్ష సందర్భంగా
భారాస నాయకురాలు ఎమ్మల్సీ కవిత మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వెంటనే మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టి చట్టం చేయాలని డిమాండ్ చేశారు. పైగా ఒక్క బీజేపీకే కావాల్సిన మెజారిటీ ఉన్నందున మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించడానికి లోక్సభలో ఎలాంటి ఇబ్బందీ లేదనీ, మహిళా రిజర్వేషన్ బిల్లును చట్టంగా మార్చి బీజేపీ మహిళల పట్ల తన చిత్తశుద్ధిని చాటు కోవాలని పేర్కొన్నారు. ఇక్కడ కవిత గుర్తుంచుకోవాల్సిన అంశమేమంటే మహిళా రిజర్వేషన్ బిల్లు ఒక్క కవితదో లేక బీజేపీ పార్టీదో కాదు. యావత్తు భారత జాతి మహిళలది. అలాగే అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలను తీసుకుని అభ్యంతరాలను నివృత్తి చేయడం అధికారంలో ఉన్న పార్టీల కనీస బాధ్యత. ఇప్పటికే చెప్పినట్లు మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఏ పార్టీ వ్యతిరేకం కాదని చెబుతున్నాయి. మహిళల అందరికీ వారి జనాభా దామాషా ప్రకారం వాటా ఉండాలనేదే ప్రస్తుత బిల్లుకు అడ్డు చెప్పే పార్టీల డిమాండ్. పైగా సబ్ కోటా విషయంలో భారాస విధానం ఏమిటో వెల్లడించ లేదు కవిత. భారత రాష్ట్ర సమితికి ఓబీసీ మహిళలంటే వివక్షనా? లేక వారిని మహిళలుగా గుర్తించడం లేదా? లేక ఓబీసీ మహిళల ఓట్లు బీఆర్ఎస్ కు అక్కర లేదా? ఓబీసీ మహిళలకు కోటా లేకపోతే వారు చట్ట సభల్లోకి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. సమాజంలో సగ భాగానికి పైగా ఉన్న ఓబీసీలకు చెందిన మహిళలు చట్ట సభల్లోకి రాకపోతే ఉన్నత సమాజ నిర్మాణం ఎలా జరుగుతుందో అన్ని పార్టీలు ఆలోచించాలి. ఓబీసీ మహిళలకు అవకాశాలు కల్పించకపోవడం లేదంటే అంతకు మించిన వివక్ష ఏముంటుంది? సమాజంలో మహిళా వివక్షకు గురవుతున్న వారిలో సింహభాగం ఓబీసీ మహిళలే అని అనేక అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఒక అంశంపై డిమాండ్ చేస్తున్నప్పుడు సోయి ఉన్న ఏ పార్టీ అయినా ఆ అంశంపై తమ విధానం ఏమిటో ప్రజలకు తెలుపడం కనీస ధర్మం. పైగా కేసీఆర్ అనుమతి లేకుండా ఇంత పెద్ద విషయాన్ని కవిత చేపట్టదు. అలాంటప్పుడు తెలంగాణలో ఉన్న 119 స్థానాలలో సుమారు 40 సీట్లు వచ్చే ఎన్నికల్లో మహిళలకు బీఆర్ఎస్ కేటాయిస్తుందా? అలాగే దేశ వ్యాప్తంగా బీఆర్ఎస్ పోటి చేసే రాష్ట్రాల్లో ఈ నిబంధన పాటిస్తుందా? పార్లమెంటులో చట్టంతో సంబంధం లేకుండా ఆయా పార్టీలు మహిళలకు మూడోవంతు సీట్లు కేటాయించవచ్చు. భారాస జాతీయ అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో తాము సబ్ కోటాతో మహిళలకు మూడోవంతు సీట్లు వచ్చే ఎన్నికల్లో కేటాయిస్తామని ప్రకటింపజేసి కవిత న్యూఢిల్లీలో దీక్ష చేస్తే ఆమె చిత్తశుద్ధిని ఆలోచించవచ్చు.
రిజర్వేషన్లు మరో కొత్త వివక్షకు దారి తీస్తాయనే వాదనను కొందరు ఆలోచనాపరులు చేస్తున్న వాదన. ఇందులో కొంత నిజం లేకపోలేదు. కానీ ఆయా వర్గాలకు ముఖ్యంగా మహిళలు ఈ ఆధునిక యుగంలో కూడా తీవ్ర అణిచి వేతకు గురవుతూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లింగ బేధం లేని సమాజం ఆవిష్కృతం కావాలంటే కొంత కాలం చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించి సమానత్వం వైపు తీసుకుపోవాల్సిన బాధ్యత ఆధునిక ప్రభుత్వాలపై ఉన్నది.
కుల మత వర్గ వర్ణ లింగ జాతి బేధం లేని సమాజంగా ఆధునిక దేశాలు నిర్మితం కావాలంటే ఆయా వర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులు చట్ట సభల్లో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మహిళా రిజర్వేషన్ బిల్లును చట్టంగా చేయడానికి మరింత ఒత్తిడి పార్టీలపై తీసుకు రావాలి. మహిళా రిజర్వేషన్ చట్టం తీసుకు వస్తామని, ఆ చట్టం వచ్చే లోగా ఆయా పార్టీలు తమ పార్టీ వివిధ కమిటీలలో, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల సీట్లల్లో మహిళలకు మూడోవంతు కేటాయించాలని, అలాగే వచ్చే ఎన్నికల్లో అన్ని పార్టీలు మహిళలకు మూడోవంతు సీట్లు సబ్ కోటా వారిగా కేటాయించాలని ఆశిద్దాం.

- Advertisement -

కాసాని శ్రీనివాసరావు గౌడ్
అధ్యక్షులు
జై స్వరాజ్ పార్టీ
9492034203

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News