Saturday, November 23, 2024
HomeNewsAmerica's double standards: అమెరికా ద్వంద్వ ప్రమాణాలు

America’s double standards: అమెరికా ద్వంద్వ ప్రమాణాలు

అమెరికాకు సంబంధించినంత వరకూ తమకొక న్యాయం, ఇతర దేశాలకు మరొక న్యాయం.రెండు నాలుకల ధోరణి ప్రదర్శించడంలో అమెరికా తర్వాతే ఏ దేశమైనా. ఇందులో సందేహమేమీ లేదు. అమెరికన్‌ కమిషన్‌ ఆన్‌ ఇంటర్నేషనల్‌ రెలిజియస్‌ ఫ్రీడమ్‌ (ఏ.సి.ఐ.ఆర్‌.ఎఫ్‌) వెలువరించిన తాజా నివేదికను భారత్‌ వరుసగా నాలుగవ సారి ‘పక్షపాతంతో కూడుకున్నదిగా, దురుద్దేశపూరితమైనదిగా’ తిరస్కరించడం జరిగింది. గత సోమవారం విడుదలైన దాని నివేదికలో ఈ స్వతంత్ర కాంగ్రెస్‌ సంబంధిత సంస్థ మత స్వేచ్ఛ, మత హక్కులకు సంబంధించినంత వరకూ భారతదేశం కొద్దిగా ఆందోళన కలిగించే దేశమేనని పేర్కొంది. మత స్వేచ్ఛ విషయంలో ఈ దేశ రికార్డు అధ్వానంగానే ఉందని కూడా వ్యాఖ్యానించింది. భారత ప్రభుత్వం మతపరంగా విచక్షణాయుత విధానాలను ప్రోత్సహిస్తోందని విమర్శించింది.మత మార్పిళ్ల నిరోధానికి సంబంధించిన చట్టాలు, మతాంతర సంబంధాలు, హిజాబ్‌ ధారణ, గోవధ నిషేధం, పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌరుల రిజిస్టర్‌ వంటి అంశాలను ఈ నివేదిక ఇందుకు ఉదాహరణలుగా పేర్కొంది. ఇవన్నీ ముస్లింలు, సిక్కులు, దళితులు, ఆదివాసీలు, క్రైస్తవుల మీద ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తున్నాయని కూడాఅది తెలిపింది.
అల్పసంఖ్యాక వర్గాల మీద హింసాత్మక దాడులు జరుగుతున్నాయని, వారిని అనేక విధాలుగా వేధిస్తున్నారని, విమర్శించినవారి ఆస్తులను ధ్వంసం చేయడం, స్వాధీనం చేసుకోవడం, నిర్బంధించడం, వాటికి విదేశాల నుంచి విరాళాలు రాకుండా నిషేధించడం వంటివి జరుగుతున్నాయని కూడా ఆ కాంగ్రెస్‌ సంస్థ భారత ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంటూ ఆరోపణలు చేసింది. అమెరికా విదేశాంగ శాఖ ఇప్పటికే భారత్‌ను ‘మతపరంగా ఆందోళనకర దేశం’గా గుర్తించి ఉండాల్సిందని, భారత ప్రభుత్వ సంస్థల మీదా, అధికారుల మీదా ఆంక్షలు విధించాల్సిన అవసరం ఉందని అది పేర్కొంది. విచిత్రమేమిటంటే, గోధ్రా అల్లర్ల తరువాత నరేంద్రమోదీ అమెరికాలో కాలు పెట్టకుండా అమెరికా ఆంక్షలు విధించింది. ఆ తర్వాత 2005లో ఈ కాంగ్రెస్‌సంస్థ సిఫారసుల మేరకు ఆ ఆంక్షలను ఎత్తేయడం జరిగింది.కాగా, ఇటువంటి నివేదికలను రూపొందించడం మానుకోవాలని, భారత్‌తో సత్సంబంధాలకు ప్రయత్నించాలని భారత విదేశాంగ శాఖ తాజా నివేదికపై స్పందించింది.
ప్రభుత్వం స్పందించిన తీరు అర్థం చేసుకోదగిందే. గత రెండు దశాబ్దాల కాలంలో ఈ సంస్థ ఇటువంటి నివేదికలను అనేకం రూపొందించి విడుదల చేసింది. నిజానికి, ఈ నివేదికలను రూపొందించడానికి ఈసంస్థ పెద్దగా ఎక్కడా అధ్యయనం కూడా చేయదనే విషయం జగమెరిగిన సత్యం. అమెరికాలోనే ఇవన్నీ జరుగుతున్న విషయం కూడా ఈ సంస్థకు పట్టదు. అమెరికాలోనే మత స్వేచ్ఛ లేదనడానికి ఇటీవలి కాలంలో అనేక నిదర్శనాలు కనిపించిన విషయం ప్రపంచవ్యాప్తంగాప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే కానీ, ఈ అమెరికా సంస్థకు మాత్రం తెలియదు. ప్రతి విషయంలోనూ ద్వంద్వ ప్రమాణాలను అనుసరిస్తున్నట్టే అమెరికా ఈ విషయంలోనూ అనుసరిస్తోంది. ఈ నివేదికను భారతదేశంలో పట్టించుకున్నవారు లేరు. అసలు అమెరికా పౌరులకే ఇటువంటి నివేదికల మీద స్పందన ఉండదు. భారత ప్రభుత్వం దీనిపై స్పందించాల్సిన అవసరంకూడాలేదు. భారతదేశం ఒక లౌకికవాద దేశంగా, ఒక ప్రజాస్వామిక దేశంగా పరిణతి చెందుతోందే తప్ప దిగజారడం లేదన్న సంగతి అనేక దేశాలు అంగీకరిస్తున్న విషయమే. ఈ నివేదికపై అమెరికాకు అంశాలవారీగా జవాబుఇవ్వవలసినఅవసరం లేదు కానీ, తరచూ మత స్వేచ్ఛ, మత హక్కుల పరిస్థితిని సమీక్షించుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News