Saturday, November 23, 2024
Homeహెల్త్Sweat: శరీర దుర్వాసన తగ్గించే నేచురల్ మార్గాలు

Sweat: శరీర దుర్వాసన తగ్గించే నేచురల్ మార్గాలు

బయట తిరగడం వల్ల ముఖ్యంగా వేసవి కాలంలో మన శరీరం చెమటవాసనతో దుర్వాసన రావడం సహజం. ఈ దుర్వాసన పోగొట్టే సహజమైన టిప్స్ కొన్ని ఉన్నాయి. ఈ సమస్య పరిష్కారానికి నిమ్మకాయ బాగా పనిచేస్తుంది. యాంటిసెప్టిక్,యాంటీమైక్రోబియల్ సుగుణాలు పుష్కలంగా ఉన్న నిమ్మకాయ శరీర నుంచి వచ్చే రకరకాల దుర్వాసనలను పోగొట్టడంలో ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది. నిమ్మలోని సిట్రిక్ ఆమ్లం శరీరంపై చెడు బాక్టీరియా చేరకుండా, అవి శరీరంపై పెరగకుండా అరికడుతుంది. అంతేకాదు టొమాటోలో కూడా యాంటిసెప్టిక్, యాంటిమైక్రోబియల్ గుణాలు ఉండడంతో అవి శరీరంపై బాక్టీరియా చేరకుండా నియంత్రించడమే కాకుండా శరీరం దుర్వాసను తగ్గిస్తుంది. టొమాటో జ్యూసుకు చెమటను
తగ్గించే సహజగుణం ఉంది. అందుకే టొమాటో రసంలో మెత్తటి కాటన్ గుడ్డను ముంచి ఆ జ్యూసును చంకల కింద రాసుకోవాలి. ఇదొక మార్గం. ఇంకొకటేమిటంటే టొమాటో జ్యూసు తాగడం వల్ల చెమట కారడం తగ్గుతుంది. దీంతో శరీరంపై దుర్వాసనకు కారకాలైన బాక్టీరియా చేరవు. చంకల కింద చెమట, బాక్టీరియా చేరడం వల్ల దుర్వాసన వస్తుంది. దీనిని నివారించాలంటే గ్రీన్ టీ బ్యాగు తీసుకుని దాన్ని
గోరువెచ్చటి నీళ్లల్లో ఒక నిమిషం ఉంచి తర్వాత దాన్ని చంకల కింద కొన్నినిమిషాల పాటు పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల చంకలకింద పట్టే చెమట తీవ్రత బాగా తగ్గుతుంది. మరొక విషయం ఏమిటంటే శరీరం దుర్వాసన రాకుండా ఉండాలంటే నిత్యం శుభ్రంగా స్నానం చేయాలి. అలాగే చంకల కింద పెరిగే వెంట్రుకలను రెండు రోజుల కొకసారి షేవ్ చేసుకోవాలి. పొడిగా, శుభ్రంగా ఉన్న దుస్తులను ధరించాలి. సీజన్ కు తగినట్టు దుస్తుల మెటీరియల్ ఉండేలా చూసుకోవాలి. ఉదాహరణకు వేసవి కాలంలో కాటన్ దుస్తులు ధరిస్తే మంచిది. ఇవి చెమటను బాగా పీల్చుకుంటాయి. శరీరానికి ఎంతో సుఖంగా కూడా ఉంటాయి. శరీరం దుర్వాసన రాకుండా ఉండడం అన్నది మన ఆహారపు అలవాట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది.

- Advertisement -

కారం, ఉప్పు, మసాలా ఎక్కువగా ఉండే ఫుడ్స్ కు దూరంగా ఉండాలి. ఆల్కహాల్ ఎక్కువ తీసుకున్నా కూడా శరీరం దుర్వాసన వస్తుంది. కాబట్టి దానికి దూరంగా ఉండాలి. లేదా పరిమిత ప్రమాణంలో మాత్రమే తీసుకోవాలి. అలాగే కాఫీని కూడా పరిమితంగా తీసుకోవాలి. తరచూ కాఫీ తాగడం వల్ల కూడా శరీరం దుర్వాసన వచ్చే అవకాశం ఉంది. చెమట విపరీతంగా కారుతుంటే మాత్రం వైద్యనిపుణులను వెంటనే సంప్రదించాలి. శరీరానికి నిత్యం కొబ్బరినూనె రాసుకుని స్నానం చేస్తే దుర్వాసనకు కారణమైన బాక్టీరియా పెరగదు. దీంతో శరీరం దుర్వాసన రాదు. జీర్ణశక్తి బాగా లేకపోయినా శరీర దుర్వాసన, నోటి దుర్వాసన సమస్యలతో బాధపడతాం. అందుకే కొబ్బరినూనెను చర్మానికి రాసుకోవడం వల్ల, వంటపదార్థాలలో వాడడం వల్ల శరీర దుర్వాసనకు కారణమయ్యే బాక్టీరియా తగ్గి శరీరం ఆరోగ్యంగా, దుర్వాసన
లేకుండా ఉంటుంది. నిమ్మకాయ ముక్కను చంకల్లో రాసుకుంటే కూడా చెమట వాసన
శరీరాన్ని బాధపెట్టదు. నిత్యం మెంతులు తినడం వల్ల కూడా శరీరం దుర్వాసన రాదు.

మెంతుల్లోని యాంటాక్సిడెంట్లు శరీరంలోని మలినాలను, విషపదార్థాలను బయటకు పోగొడతాయి. దీంతో శరీరంలో ఎలాంటి ఇన్ఫెక్షన్లు వ్యాపించవు. అలా శరీర దుర్వాసనకు మూలకారణాలను మెంతులు నివారిస్తాయి. దీనికి మెంతులతో చేసిన టీ కూడా ఎంతో ఉపయోగపడుతుంది. 250 గ్రాముల నీటిలో
ఒక టీస్పూను మెంతులు వేసి వాటిని బాగా ఉడికించాలి. తర్వాత ఈ నీళ్లను ఒడగట్టి ఉదయమే ఖాళీ కడుపుతో ఈ టీని తాగితే శరీరంలోని మలినాలు, విషపదార్థాలు అన్నీ బయటకు వచ్చేస్తాయి. ఈ టీ శరీర
దుర్వాసనను సహజసిద్ధంగా పోగొడుతుంది. వేప పేస్టు కూడా శరీరదుర్వాసనకు కారణమయ్యే బాక్టీరియాను పోగొడతాయి. కొన్నివేపాకులు తీసుకుని వాటికి కొద్దిగా నీళ్లు జోడించి పేస్టులా చేసి ఆ పేస్టును చంకల కింద రాసుకుని పదిహేను నిమిషాలు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత చల్లటి నీళ్లతో కడిగేసుకోవాలి. నీళ్లు
బాగా తాగుతుంటే కూడా చర్మానికి తగినంత తేమ అంది శరీరం తాజాదనంతో ఉంటుంది. శరీరంలోని మలినాలు, విష పదార్థాలు, శరీరదుర్వాసనకు కారణమైన బాక్టీరియాలు బయటకు పోయి శరీరం క్లీన్ అవుతుంది. అంతేకాదు చిన్న ప్రేవులో బాక్టీరియా ఏర్పడకుండా నీరు న్యూట్రలైజ్ చేస్తుంది. దీంతో శరీరం దుర్వాసన రాదు. రోజూ వర్కవుట్లు, వ్యాయామాలు చేసిన తర్వాత స్నానం చేస్తే మంచిది. అలాగే ఉద్యోగం నుంచి వచ్చిన తర్వాత కూడా స్నానం చేస్తే శరీరం దుర్వాసన రాకుండా శుభ్రంగా ఉంటుంది. బేకింగ్ సోడా చర్మంలోని తేమను పీల్చుకుంటుంది. దీంతో శరీరం దుర్వాసన ఉండదు. అందుకే చంకల్లో బేకింగ్
సోడా పూసి కాసేపు అయిన తర్వాత నీటితో కడిగేసుకుంటే శరీరం దుర్వాసన వేయదు. బేకింగ్ సోడా ఎంత పరిమాణంలో తీసుకున్నారో అంతే పాళ్లల్లో కార్న్ స్టార్చ్ కూడా తీసుకుని అందులో కలిపి చంకల్లో అప్లై చేస్తే అది సహజసిద్ధమైన డియొడరెంటులా పనిచేస్తుంది. బేకింగ్ సోడా రాసుకున్నప్పుడు చంకల్లో మంటగా అనిపిస్తే మాత్రం వెంటనే చల్లటి నీళ్లతో కడిగేసుకోవాలి. చంకల కింద ఆపిల్ సిడార్ వెనిగర్ రాసుకున్నా కూడా శరీరం దుర్వాసన రాదు. ఇందులో ఎసిడిక్ గుణాలు ఉన్నాయి.
ఇవి శరీరంలోని విషతుల్యమైన మైక్రోబ్స్ ను పోగొడతాయి. అందుకే యాపిల్ సిడార్ వెనిగర్ లో కాటన్ బాల్ ముంచి దానితో చంకల్లో, పాదాలకు, శరీరంలోని కొన్ని ప్రదేశాలలో రాసుకోవడం వల్ల చెడు బాక్టీరియా పోతుంది. శరీర దుర్వాసన కూడా బాగా తగ్గుతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News