భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆంధ్రప్రదేశ్‌కు చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈరోజు గన్నవరం విమానాశ్రయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కి స్వాగతం పలికారు. అనంతరం ఆమె పోరంకిలో జరుగుతున్న పౌర రిసెప్షన్ కు బయల్దేరారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏపీలో తొలి పర్యటన సందర్భంగా విజయవాడలో జరిగిన పౌర రిసెప్షన్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమెను గౌరవంగా సత్కరించింది.
ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశభాషలందు తెలుగు లెస్స అంటూ.. తెలుగులో ప్రసంగించారు. వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న పవిత్ర స్థలానికి రావడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. ప్రజలంతా సంతోషంగా ఉండాలని, కనకదుర్గమ్మ ఆశీస్సులు అందరిపైనా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్రానికి చెందిన మహనీయులు అల్లూరి, గురజాడ, కవయిత్రి మొల్ల, దుర్గాభాయ్ తదితరుల పేర్లను రాష్ట్రపతి తన ప్రసంగంలో ప్రస్తావించారు. గోదావరి, కృష్ణ, పెన్నా, వంశధార, నాగావళి నదులు రాష్ట్రాన్ని పునీతం చేశాయన్నారు. ఆంధ్రా ప్రజల అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో రాష్ట్రంలో భారీ భద్రతా బలగాలను మోహరించారు. విశాఖపట్నంలో జరిగే నేవీ డే వేడుకలకు ఆమె హాజరుకానున్నారు.