నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో మీడియా మిత్రులతో చిట్ చాట్ కార్యక్రమం నిర్వహించిన తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. శాసన మండలి ఛైర్మన్ పదవిని ధర్మబద్ధంగా నిర్వహిస్తున్నానని, రాజ్యాంగ చట్టాలను అనుసరిస్తూ, న్యాయబద్దంగా చైర్మన్, స్పీకర్ స్థానాలకు న్యాయం చేస్తున్నామన్నారు. బిజెపి పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ తనపైన, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పైన చేసిన వాక్యాలు అర్ధరహితమన్నారు గుత్తా. బండి సంజయ్ తీరు చూస్తే గురివింద గింజ సామెతను గుర్తు చేస్తుందని, తన గురించి మాట్లాడే నైతిక హక్కు బండి సంజయ్ కు లేదన్నారు గుత్తా. గవర్నర్ పదవి కూడా నాన్ పొలిటికల్. గవర్నర్ పదవిలో ఉన్నవాళ్లు రాజ్యాంగ బద్దంగా వ్యవహరించాలి. కానీ మన రాష్ట్రం సహా చాలా రాష్ట్రాల్లో గవర్నర్లు పొలిటికల్ గా వ్యవహరిస్తున్నారు. దాని గురించి ఎవరూ మాట్లాడడం లేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారు. అన్ని వర్గాల ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చెందారని, ప్రజలకు నిత్యావసర సరుకులు అందించడంలో కేంద్ర ప్రభుత్వం ,ప్రధాని మోడీ ఘోరంగా విఫలమయ్యారు. ప్రజాసమస్యలపై మాట్లాడకుండా నిత్యం ప్రజల నడుమ విద్వేషాలు పెంచుతూ రాజకీయంగా లబ్ది పొందాలని బీజేపీ పార్టీ నేతలు చూస్తున్నారన్నారు గుత్తా. తెలంగాణలో కాంగ్రెస్, బిజెపిలు అధికారంలోకి వస్తే పాలన అంత ఢిల్లీ నుండి జరుగుతుంది. వాళ్లు పార్టీ కార్యవర్గం వేయాలన్న ఢీల్లీ వాళ్ళు నిర్ణయించాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పట్ల ప్రజలకు పూర్తి విశ్వాసం ఉంది. రేవంత్ రెడ్డి తెలంగాణకు ముఖ్యమంత్రి కావాలని పగటి కలలు కంటున్నాడు.తెలంగాణ ను దోచుకోవాలని ఎత్తుగడలు వేస్తున్నాడన్నారు. ప్రియాంకా గాంధీ వచ్చినా, రాహుల్ గాంధీ వచ్చినా పార్టీ నేతలను ఏకం చేయడానికే, ప్రజలకు ఓరిగేది ఏమిలేదని తేల్చేశారు గుత్తా.
కాంగ్రెస్ ,బీజేపీ పార్టీలు అధికారంలోకి వచ్చే పరిస్థితి అస్సలు లేదన్న ఆయన, తక్కెడలో కప్పలలాగా రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఉందన్నారు. ప్రధాని మోదీ తన స్థాయిని మరిచి కర్నాటక ఎన్నికల్లో మాట్లాడుతున్నారని, రాజ్యాంగానికి విరుద్ధంగా ఎన్నికల సభలో ప్రధాని మత నినాదాలు చేస్తున్నారన్నారు. కర్నాటక లో లౌకిక శక్తులు విజయం సాదించాలన్నదే తమ కోరికని గుత్తా వివరించారు.