దేశానికి మనమే తలమానికం అంటూ కేసీఆర్ మరోమారు సభాముఖంగా తెలియజేయటం విశేషం. కేసీఆర్ మాటల్లో చెప్పాలంటే.. “సంక్షేమ కార్యక్రమాలలో తెలంగాణకు సాటి గాని పోటీగాని ఎవరు లేరు . ఏడెండ్ల క్రితం కేవలం 60 వేల కోట్ల రూపాయలు బడ్జెట్ ఉండే తెలంగాణ, ఈరోజు రెండున్నర లక్షల కోట్ల పైన బడ్జెట్ పెట్టుకొని 2 లక్షల 10వేల కోట్ల వరకు ఖర్చు పెట్టే స్థాయికి ఎదిగిందన్నారు. ఏడెండ్ల క్రితం చాలా భయంకరమైనటువంటి కరెంట్ బాధలను అనుభవించిన తెలంగాణ ఈ రోజు దేశానికే తలమానికంగా తయారైందని తెలంగాణ రాష్ట్రానికి సమీపంలో కూడా ఏ రాష్ట్రంలేదని, దేశంలో సగటు కూడ సమీపంలో లేని విధంగా, ఈరోజు తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ నెంబర్ వన్ రాష్ట్రం అని చెప్పడానికి నేను గర్వ పడుతున్న అని అన్నారు. సంక్షేమ కార్యక్రమాలలో తెలంగాణకు సాటి గాని పోటీగాని ఎవరు లేరు అని, అలాంటి ఆలోచనలు కూడ ఎవరికి రావు అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు . దీనంతటికి కారణం మంత్రివర్యులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు వారితో పాటు రెండింతల అంకితభావంతో పని చేసినటువంటి ప్రభుత్వ అధికారుల, ఉద్యోగుల కృషి వల్లనేనని సిఎం అన్నారు . ఇంతటి గొప్ప అద్భుత ఆవిష్కరణలలో కృషి చేసినందుకు అందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నా”నన్నారు కేసీఆర్.