మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ ప్రత్యేక చొరవతో సీఎం కేసీఆర్ సహకారంతో హైదరాబాదులోని హుస్సేన్ సాగర్ – నెక్లెస్ రోడ్ లో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన నీరా కేఫ్ ను మంత్రి సడన్ గా విజిట్ చేశారు. ఆరోగ్యాన్ని అందించే దివ్య ఔషధం నీరాను ప్రజలకు అందించేందుకు సుమారు 20 కోట్ల రూపాయలతో ఆధునికంగా నిర్మించి, ప్రారంభించిన నీరా కేఫ్ లో మంత్రి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ నీరా కేఫ్ లో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను, ప్రజలకు అందించే తెలంగాణ పిండి వంటకాలు, మాంసాహార వంటకాలు, నీరా ప్రాసెసింగ్ యూనిట్ లను పరిశీలించారు. నీరా కేఫ్ కు వచ్చిన వినియోగదారులను కలిసి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. నీరా కేఫ్ లో అందిస్తున్న వంటకాలను రుచి చూశారు. నాణ్యమైన వంటకాలను ప్రజలకు అందించాలని మంత్రి నిర్వాహకులకు సూచించారు. ప్రకృతి, సాంప్రదాయ ఎన్నో ఔషధ గుణాలున్న నీరా పై కొందరు ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియాలో చేస్తున్న విష ప్రచారం పై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. గీత కార్మికులు ప్రాణాలకు తెగించి ప్రజల ఆరోగ్యానికి, క్యాన్సర్ తో పాటు అనేక జబ్బులను నివారించే ఔషధ గుణాలున్న నీరా ను అందిస్తున్నారన్నారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన నీరా ను ప్రజలందరికి చేరేలా ‘నీరా కేఫ్’ ముఖ్య భూమిక పోషించేలా అధికారులు, స్టాల్ నిర్వాహకులు కృషీ చేయాలనీ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు.