Friday, September 20, 2024
Homeఓపన్ పేజ్Covid: కోవిడ్‌ మహమ్మారితో భయం లేనట్టే!

Covid: కోవిడ్‌ మహమ్మారితో భయం లేనట్టే!

ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి అనుభవాలను పరిశీలిస్తే, ఇవి మొదట ఉధృతంగానే ఉంటాయని, క్రమక్రమంగా సాధారణ వ్యాధులుగా మారిపోతాయని, చివరికి అవి పూర్తిగా అంతరించిపోవడం కూడాజరుగుతుందని అర్థమవుతుంది. కోవిడ్‌ పరిస్థితి కూడా అంతే. కోవిడ్‌-19 అనే మహమ్మారి ఇక అంతర్జాతీయ అత్యవసర ఆరోగ్య పరిస్థితి కాదనీ, దీనికి ప్రపంచ దేశాలు ఇక భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదనీ ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధోనం గేబ్రెయేసస్‌ రెండు రోజుల క్రితం అంతర్జాతీయ స్థాయి నిపుణులతో సమావేశమైన తర్వాత ప్రకటించారు.2020 జనవరి 20న ఆయనే కోవిడ్‌ గురించి ప్రపంచ దేశాలను హెచ్చరిస్తూ ప్రకటన చేయడం జరిగింది.చైనా నుంచి ప్రారంభమైన ఈ కోవిడ్‌ మహమ్మారి దాదాపు 20 దేశాలను తీవ్ర ఆందోళన చెందించిన విషయం తెలిసిందే.అంతేకాదు, అప్పట్లో ఆయనే దీన్ని అంతర్జాతీయ అత్యవసర ఆరోగ్య పరిస్థితిగా ప్రకటించారు. ఇప్పుడు కూడాఆయన ఇది అంతర్జాతీయ అత్యవసర ఆరోగ్య పరిస్థితి కాకపోవచ్చు కానీ, కొద్దిగా జాగ్రత్తగాఉండడమే మంచిదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇది సర్వసాధారణంగా కొన్ని సీజన్లలో వచ్చే ఫ్లూలాంటిదేనని గత కొద్ది నెలలుగా చాలా మంది నిపుణులు ప్రకటనలు జారీచేయడం జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలను హరించడమే కాకుండా, అనేక ఆర్థిక వ్యవస్థలను కుప్పకూల్చిన కోవిడ్‌ మహమ్మారి గురించి ఇక భయపడనవసరం లేదని, అది సాధారణ ఫ్లూవంటిదేనని సాక్షాత్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ ప్రకటించడం అనేక దేశాలకు ఎంతగానో ఊరట కలిగించింది.
కోవిడ్‌ ఇక ప్రమాదకర వ్యాధి కానంత మాత్రాన దేశాలు, ప్రజలు నిమ్మకు నీరెత్తినట్టు కూర్చునే అవకాశం లేదు. కోవిడ్‌ మహమ్మారి తన మొదటి రూపంలో విజృంభించనప్పటికీ, దీని నుంచి వెలువడుతున్న వేరియంట్లు, ఉప వేరియంట్లు ప్రజల ప్రాణాలను పొట్టనబెట్టుకుంటూనే ఉంటున్నాయి. ఈ మేరకు అడపాదడపా వార్తలు వస్తూనే ఉన్నాయి. అంతేకాదు, ఇది డైరెక్టర్‌ జనరల్‌, అంతర్జాతీయ నిపుణులు పేర్కొన్నట్టు ఇప్పటికింకా సీజనల్‌ వ్యాధుల స్థాయికి దిగిపోలేదు. ఏదో ఒక వేరియంట్‌ కోవిడ్‌ మహమ్మారి కంటే ప్రమాదకరంగా విజృంభించే అవకాశం కూడా లేకపోలేదు. సాధారణంగా ఇటువంటి వేరియంట్లు లేదా మహమ్మారి సంతానాలు అకస్మాత్తుగా కొత్త రూపం సంతరించుకుని, మరింత శక్తి పుంజుకుని ప్రపంచం మీద పడే ప్రమాదం ఉంటుంది.దేశాలన్నీ తమ ఆరోగ్య వ్యవస్థలను, ఆరోగ్య సంరక్షణ పద్ధతులను సర్వసన్నద్ధంగా ఉంచుకోవడమే మంచిది. కోవిడ్‌ విజృంభించిన సమయంలో ‘ఐఎన్‌ఎస్‌ఏసీఓజీ’ సంస్థ నెట్‌వర్క్‌కు చెందిన ప్రయోగశాలలు ఏ విధంగా పరీక్షలు నిర్వహించడం, కిట్లు సరఫరా చేయడం జరిగిందో అదే విధంగా ఇప్పుడు కూడా అతి వేగంగా సరఫరా చేయగల స్థితిలో ఉండాలి.
వ్యాక్సిన్‌లు, వైరల్స్‌, యాంటీబయాటిక్స్‌, మందులు తయారు చేసే ఔషధ తయారీ సంస్థలు, పరిశోధన కేంద్రాలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. దీనివల్ల ఒక్కకోవిడ్‌ మహమ్మారినే కాదు, ఇతరత్రా వచ్చే అనేక అంటువ్యాధులను కూడా సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతాం. వ్యక్తిగత స్థాయిలో కూడా ప్రజలు కోవిడ్‌ కాలంలో పాటించిన ఆరోగ్య సూత్రాలను మరికొంత కాలం పాటించడం మంచిది. ముఖ్యంగా వ్యాక్సినేషన్‌, సామాజిక దూరం, మాస్కుల ధారణ వంటి అవసరాలను, అలవాట్లను కొనసాగించడం వల్ల అంటువ్యాధుల ప్రమాదంనుంచి, ప్రాణాంతక వైరస్‌ల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News