Friday, September 20, 2024
Homeహెల్త్Bad Breath: నోటి దుర్వాసనా?

Bad Breath: నోటి దుర్వాసనా?

శరీరం నుండి సువాసనలు రావాలని కోరుకుంటాం. మంచి సువాసన కలిగిన సబ్సులతో స్నానం చేస్తాం .. ఇంటి నుండి బైటకు వెళుతుంటే .. సెంటు, బాడీస్ప్రేలు కొట్టుకుని వెళతాం. శరీరం నుండి చెమట వాసన రాకుండా ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. అయితే .. సెంట్లు, స్ర్పేలు ఎన్ని రకాలు వాడినా నోటి నుండి వచ్చే దుర్వాసనను మాత్రం అరికట్టలేం. నోటి నుండి వచ్చే చెడ్డ వాసన కారణంగా నలుగురిలోకి ఫ్రీగా వెళ్లలేము. అందరితో కలివిడిగా మాట్లాడలేము. నోటి దుర్వాసన పోగొట్టుకోవాలంటే ముందుగా అసలు దుర్వాసనకు కారణం ఏంటో తెలుసుకోవాలి.

- Advertisement -

నోటి దుర్వాసన మీ సన్నిహితులకు సైతం చికాకు కలిగిస్తుంది. భార్యభర్తల మధ్య కూడా నోటి దుర్వాసన ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. ఈ దుర్వాసనను పోగొట్టుకోవడానికి ప్రతిరోజూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ఎంతో అవసరం, నోరు పరిశుభ్రంగా ఉంచుకోకపోతే నోటి దుర్వాసన, దంతక్షయ సమస్యలు ఏర్పడతాయి. ముఖ్యంగా నోటి దుర్వాసన కారణంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సమస్య మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేయకపోయినా, మీతో అనుబంధం ఉన్నవారికి చికాకు తెప్పిస్తుంది. మీరు తీసుకునే ఆహారం, మీ శరీర పరిశుభ్రత కూడా నోటి దుర్వాసనకు కారణం అవుతుంది. ఒక్కోసారి ఎల్లప్పుడూ పరిశుభ్రత గురించి ఆలోచించే వారు కూడా ఈ సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది ఏదైనా అంతర్లీనంగా ఉండే వ్యాధికి సంకేతం కావచ్చు. అటువంటి సందర్భంలో వైద్యులను సంప్రదించడం చాలా ముఖ్యం.
కారణాలు
దంత వ్యాధులు, పేగు సమస్యలు, ఎసిడిటీ, మధుమేహం, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ లేదా తక్కువ నీరు తాగడం వల్ల నోటి దుర్వాసన వస్తుందని నిపుణులు చెబుతున్నారు. దంతాలు సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం వల్ల నోటిలో బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇది నోటి దుర్వాసనకు కారణమవుతుంది. దీనితో పాటు, ధూమపానం లేదా పొగాకు నమలడం కూడా నోటి దుర్వాసనకు ప్రధాన కారణాలని డాక్టర్లు అంటున్నారు. నోటి దుర్వాసనను మెడికల్ పరిభాషలో నోటి దుర్వాసనను హాలిటోసిస్ లేదా ఫెటోర్ ఓరిస్ అని కూడా అంటారు. నోటి దుర్వాసనతో ఎవరైనా బాధపడవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి నలుగురిలో ఒకరు క్రమం తప్పకుండా నోటి దుర్వాసనతో బాధపడుతున్నారని ఒక అంచనా.
మీరు ప్రతిరోజూ పళ్ళు సరిగ్గా తోముకోక పోవడం దుర్వాసనకు ప్రధాన కారణం, పళ్‌లు శుభ్‌రంగా తోమక పోవడం వలన నోటిలో ఆహార కణాలు ఉంటాయి, అది నోటి దుర్వాసనకు కారణమవుతుంది. కంటికి కనబడని బ్యాక్టీరియా ఫలకం రూపంలో మీ దంతాలపై ఏర్పడుతుంది. బ్రష్ చేయకుండా వదిలేస్తే, ఆ ఫలకం మీ చిగుళ్ళను చికాకుపెడుతుంది. సరిగ్గా సరిపోని కట్టుడు పళ్ళ వలన కూడా దుర్వాసన వచ్చే అవకాశం ఉంది. కలిగించే బ్యాక్టీరియా మరియు ఆహార కణాలను కలిగి ఉంటాయి.
సర్జరీలు, గాయాలు, దంత క్షయం, చిగుళ్ల వ్యాధి లేదా నోటి పుండ్లు వంటి ఇన్ఫెక్షన్లు నోటి దుర్వాసనకు కారణమవుతాయి. నోరు, ముక్కు, గొంతు ఇన్ఫెక్షన్ల వలన కూడా నోటి నుండి దుర్వాసన వెలవడుతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
దుర్వాసన వదిలించుకునే చిట్కాలు
నోటి దుర్వాసనను వదిలించుకోవడానికి కొన్ని ఇంటి చిట్కాలు పాటించవచ్చు. దంత పరిశుభ్రతపై శ్రద్ధ చూపడం, పుష్కలంగా నీరు త్రాగడం, ఎక్కువ పండ్లు, కూరగాయలు తినడం, చక్కెర ఆహారాలు, పొగాకు ఆధారిత ఉత్పత్తులను తగ్గించడం, రోజుకు రెండుసార్లు బ్రష్ చేయడం వలన నోటి దుర్వాసన తొలగించుకోవచ్చు.
ప్రతిరోజూ ఉదయం మీ దంతాలను బ్రష్ చేయడం, టంగ్ క్లీనర్ ఉపయోగించడం వల్ల ముందు రోజు రాత్రి మీ నోటిలో పేరుకుపోయిన అన్ని విషపదార్ధాలను తొలగించవచ్చు. అంతేకాదు, రాత్రిపూట బ్రష్, ఫ్లాస్ చేస్తే మీ నోరు శుభ్రంగా ఉంటుంది. ఇది మీ పేగు ఆరోగ్యానికి చాలా ముఖ్యం.
భోజనం తర్వాత సోంఫ్ తినండి
భోజనం తర్వాత సోంఫ్ తినండి. ఈ విత్తనాలు జీర్ణశక్తిని పెంచే ఫ్లేవనాయిడ్లను కలిగి ఉంటాయి. ఇవి లాలాజల ప్రవాహాన్ని ప్రేరేపించడంలో సహాయపడుతుంది. ఇది నోరు పొడిబారకుండా చేస్తుంది. సోంఫ్ గింజలు సుగంధ రుచిని కలిగి ఉంటాయి. అందువలన సువాసన చాలా కాలం పాటు ఉంటుంది. ఇది మీ నోటి దుర్వాసనను నివారిస్తుంది.
భోజనం తర్వాత నోరు కడుక్కోవాలి
ఆయుర్వేదం ప్రకారం, భోజనం తర్వాత నీరు త్రాగకూడదు. ఎందుకంటే ఇది మీ జీవక్రియను నెమ్మదిస్తుంది. కానీ నోరు శుభ్రం చేయడానికి నీరు అవసరం. ముఖ్యంగా రాత్రి భోజనం తిన్న తర్వాత 2 నుంచి 3 నిమిషాల పాటు పుక్కిలించి, నోటిని శుభ్రం చేయండి.
నీరు పుష్కలంగా త్రాగాలి
శరీరం ప్రతి పనికి, ముఖ్యంగా నోటి ఆరోగ్యానికి తాగునీరు చాలా అవసరం. వైద్యుల ప్రకారం, మీ మూత్రం రంగు పసుపు రంగులో కనిపించకుండా ఉండటానికి మీరు తగినంత నీరు త్రాగాలి. మూత్రం రంగులో ఉంటే, మీరు తక్కువ నీరు త్రాగుతున్నారని అర్థం. కాబట్టి నీళ్లు ఎక్కువగా తాగాలి.
ఆహారంలో సర్దుబాట్లు
నోటి దుర్వాసన కలిగించే ఉల్లిపాయలు, వెల్లుల్లి వంటి ఆహారాలకు దూరంగా ఉండండి. షుగర్ ఫుడ్స్ ఎక్కువగా తినడం కూడా నోటి దుర్వాసనతో ముడిపడి ఉంటుంది, కాబట్టి తగ్గించాలి. అలాగే జంక్ ఫుడ్స్ ఎక్కువగా తినడం, తరచుగా నోటికి పనిపెట్టడం కూడా తగ్గించాలి.
పెరుగులో ప్రోబయోటిక్స్‌ అధికంగా ఉంటాయి. ఇవి నోటి దుర్వాసన సమస్యను పోగొడతాయి. భోజనం చివర్లో కచ్చితంగా పెరుగన్నంతో తినడం అలవాటు చేసుకుంటే నోట్లో ఉండే చెడు బాక్టీరియా నశిస్తుంది. ఫలితంగా నోరు దుర్వాసన రాదు. భోజనం చేశాక 30 నిమిషాల తరువాత గ్రీన్‌ టీ తాగండి. ఇందులో ఉండే పవర్‌ఫుల్‌ యాంటీ ఆక్సిడెంట్లు క్రిములను నాశనం చేస్తాయి. దీంతో నోట్లో ఉండే బాక్టీరియా నశించి నోటి దుర్వాసన తగ్గుతుంది.
ఆహారంలో క్యాప్సికమ్, బ్రొకోలిలను భాగం చేసుకోవాలి. వీటిలో ఉండే విటమిన్‌ సి క్రిములను చంపేస్తుంది. దీంతో నోరు దుర్వాసన రాకుండా ఉంటుంది.
విటమిన్‌ సి ఎక్కువగా ఉండే పండ్లను తినాలి. నారింజ, కివీ, స్ట్రాబెర్రీ, పైనాపిల్‌ వంటి పండ్లను తింటుంటే నోటి దుర్వాసన రాదు. దంత సమస్యలు కూడా పోతాయి. చిగుళ్లు, దంతాలు దృఢంగా మారుతాయి.
భోజనం చేశాక ఒకటి రెండు లవంగాలను నోట్లో వేసుకుని చాలా సేపు అలాగే చప్పరించాలి. దీంతో నోటి దుర్వాసనను తగ్గించుకోవచ్చు. లవంగాల్లో ఉండే పవర్‌ఫుల్‌ యాంటీ ఆక్సిడెంట్లు క్రిములను నాశనం చేసి నోటి దుర్వాసనను తగ్గిస్తాయి.
భోజనం చేసిన తరువాత టీస్పూన్‌ సోంపు తిన్నా నోటి దుర్వాసన తగ్గి, నోరు ఫ్రెష్‌ అవుతుంది.
భోజనం చేశాక ఒకటి రెండు పుదీనా లేదా తులసి ఆకులను అలాగే పచ్చిగా నమిలేయాలి. దీంతో నోటి దుర్వాసన సమస్య నుంచి బయట పడవచ్చు.
గోరు వెచ్చని ఉప్పు నీటితో నోటిని శుభ్రం చేయడం వల్ల కూడా నోటి దుర్వాసనను అరికట్టవచ్చు. ఒక గ్లాసు వేడి నీటిలో పావు స్పూను ఉప్పు మిశ్రమాన్ని కలిపి 30సెకండ్ల పాటు నోట్లో పోసుకొని పుక్కిలించి ఉమ్మి వేస్తే కొంతమేర నోటి దుర్వాసన తగ్గుతుంది. దీనిని రోజువారీ అలవాటుగా చేసుకుంటే నోటి దుర్వాసన తగ్గించుకునే వీలుంటుంది
ధూమపానం క్యాన్సర్‌ను కలిగించడమే కాకుండా, మీ చిగుళ్ళను దెబ్బతీస్తుంది, మీ దంతాలను మరక చేస్తుంది, అలాగే మీకు నోటి దుర్వాసనను కలిగిస్తుంది.
ఇంటి చిట్కాలు పాటించి.. ఆహార నియమాలు, దంతధావనం శ్రద్ధగా చేసినా నోటి దుర్వాసన ఆగక పోతే .. తక్షణం డాక్టర్లను సంప్రదించాలి. ఏమాత్రం అలక్ష్యం చేయకుండా డాక్టర్‌కు చూపించుకోవాలి. డాక్టర్ల సలహాలు .. సూచనలు పాటించాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News