గుజరాత్ అసెంబ్లీకి నేడు(డిసెంబర్ 5) రెండో దశ పోలింగ్ జరగనుంది. తొలివిడత ఎన్నికలు డిసెంబర్ 1న జరిగాయి. నేడు 14 జిల్లాల్లో 93 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ రోజు జరిగే ఎన్నికల్లో 833 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా.. 2.5 కోట్ల మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. అభ్యర్థుల విషయానికొస్తే.. 764 మంది పురుష అభ్యర్థులు ఉండగా.. 69 మంది మహిళా అభ్యర్థులున్నారు. వీరిలో 285 మంది స్వతంత్రంగా పోటీ చేస్తున్నారు.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీ బీజేపీ-కాంగ్రెస్-ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య జరుగుతోంది. నేడు జరిగే ఎన్నికల్లో అహ్మదాబాద్, వడోదర, గాంధీనగర్ వంటి ప్రధాన నియోజకవర్గాలున్నాయి. ప్రధాని మోదీ ఇలాకా అయిన గుజరాత్ లో బీజేపీని దింపాలని కాంగ్రెస్, ఆప్ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. తొలివిడత ఎన్నికల్లో 63.31 శాతం ఓటింగ్ నమోదవ్వగా.. రెండో విడత పోలింగ్ లో ఓటింగ్ శాతం పెరుగుతుందని భావిస్తున్నారు.
రెండో దశ ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 8 గంటల నుండే ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు. రెండో దశ ఎన్నిక కోసం ఎన్నికల సంఘం 26,409 పోలింగ్ స్టేషన్లను, 36000 ఈవీఎం లను ఏర్పాటు చేసింది. 29,000 ప్రిసైడింగ్ ఆఫీసర్లు, 84,000 వరకు పోలింగ్ ఆఫీసర్లు విధులు నిర్వహిస్తున్నారు. కాగా.. ఈనెల 8న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.