Sunday, October 6, 2024
Homeహెల్త్Danger beauty products: మీ క్రీముల్లో ఇవున్నాయా?

Danger beauty products: మీ క్రీముల్లో ఇవున్నాయా?

బ్యూటీ రొటీన్ లో స్కిన్ కేర్ చాలా ముఖ్యం. అందులో భాగంగా మీరు వాడే బ్యూటీ ఉత్పత్తుల్లో ఎలాంటి పదార్థాలు ఉన్నాయో కూడా గమనించుకుంటుండాలంటున్నారు సౌందర్య నిపుణులు. లేకపోతే చర్మం దెబ్బతినే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు ప్రిమెచ్యూర్ ఏజింగ్ వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అందులోనూ సెన్సిటివ్ చర్మం ఉన్నవారు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. కొన్ని పదార్థాలు చర్మానికి హాని కలిగిస్తాయని కాస్మొటాలజిస్టులు చెపుతున్నారు. అంతేకాదు గాఢమైన సువాసనలు ఉన్న ఉత్పత్తులు, పారాబెన్స్, సల్ఫేట్స్ వంటివి చర్మానికి ఎంతో హాని కలిగిస్తాయంటున్నారు. ఇలాంటి హానికరమైన పదార్థాలున్న బ్యూటీ ఉత్పత్తులు వాడడం వల్ల కొందరు తీవ్రమైన చర్మ సమస్యల బారిన కూడా పడుతుంటారు. చర్మాన్ని లైటనింగ్ చేసే హైడ్రోక్వినోన్ వంటి పదార్థాలు, స్టెరాయిడ్లు ఉన్న క్రీములను వైద్యుల సూచనల మీదే వాడాలని చెప్తున్నారు.

- Advertisement -

హైడ్రోక్వినోన్ వంటి స్కిన్ లైటనింగ్ ఉత్పత్తులను ఎక్కువ కాలం వాడడం వల్ల చర్మం సెన్సిటివిటీ, పలచదనపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్టెరాయిడ్లతో చేసిన క్రీమ్స్ వల్ల కూడా చర్మంపై ఇలాంటి దుష్పరిణామాలే సంభవిస్తాయని చెప్తున్నారు. అలాగే కొన్ని చైనా స్కిన్ కేర్ ప్రోడక్టులలో మెర్క్యురీ వాడుతుంటారు. ఇది కూడా చర్మానికి ఎంతో హాని కలిగిస్తుంది. మెర్క్యురీ ఉన్న స్కిన్ కేర్ ఉత్పత్తులు వాడడం వల్ల చర్మ సెన్సిటివిటి దెబ్బతినడంతో పాటు తీవ్ర అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉందిట. అందుకే బ్యూటీ ఉత్పత్తులను కొనే ముందు వాటి లేబుల్స్ మీద ఎలాంటి పదార్థాలతో ఆ ఉత్పత్తి తయారైందో గమనించుకోవాలి. వాటిల్లో మెర్క్యురీ వంటి చర్మానికి ప్రమాదకరమైన పదార్థాలు ఉంటే వాటిని కొనకుండా ఉండడం బెస్టు అని చెప్తున్నారు. స్కిన్ కేర్ ప్రొడక్టుల్లో తరచూ కనిపించే మరో రెండు ప్రమాదకర పదార్థాలు సిలికోన్, ఎస్ ఎల్ ఎస్ లు. సిలికోన్ వల్ల చర్మ రంధ్రాలు మూసుకుపోతాయి. దీంతో చర్మానికి తగినంత ఊపిరి అందదు.

ఎస్ ఎల్ ఎస్ పదార్థం అయితే ముఖ్యంగా సున్నిత చర్మం ఉన్న వాళ్లకు అస్సలు మంచిది కాదు. ఇది ఘాటుగా ఉండడంతో పాటు డ్రైగా ఉండి సున్నితమైన చర్మాన్ని దెబ్బతీస్తుంది. ఇవి లేని, తేలికపాటి పదార్థాలతో కూడిన , మీ చర్మ స్వభావానికి సరిపడే స్కిన్ కేర్ ఉత్పత్తులను వాడడం మంచిదని చర్మ నిపుణులు కూడా సూచిస్తున్నారు. సిలికోన్, ఎస్ ఎల్ ఎస్ లు అధిక పరిమాణాల్లో ఉన్న స్కిన్ కేర్ ఉత్పత్తులకు దూరంగా ఉండాలని చెప్తున్నారు. స్కిన్ స్వభావానికి తగినట్టు తేలికపాటి పదార్థాలతో కూడిన, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచే బ్యూటీ ఉత్పత్తులను ఎంచుకుంటే మంచిదని బ్యూటీ నిపుణులు సలహా ఇస్తున్నారు. దీని వల్ల చర్మం యొక్క సహజ సౌందర్యం కూడా దెబ్బతినదంటున్నారు. అలాగే ఆల్కహాల్ కలిపిన స్కిన్ కేర్ ఉత్పత్తులకు కూడా దూరంగా ఉండాలని సలహా ఇస్తున్నారు. ఎందుకంటే ఇవి చర్మాన్ని పొడారిపోయేలా చేయడంతో పాటు చర్మంపై ఇరిటేషన్ ని రేపుతాయి. బాగా శక్తివంతమైన ఎక్స్ ఫొయిలేట్స్, స్క్రబ్స్ ఉన్న స్కిన్ కేర్ ఉత్పత్తుల వాడకం కూడా చర్మానికి మంచిది కాదుట. వీటిని వాడడం వల్ల చర్మం సూక్ష్మస్థాయిలో తీవ్రంగా దెబ్బతింటుందని చెప్తున్నారు.

చర్మంపై ఉండే రక్షణ పొరను కూడా తీవ్రంగా దెబ్బతీస్తుందని సూచిస్తున్నారు. చర్మ స్వభావాన్ని బట్టి ఎలాంటి పదార్థాలు ఉన్న స్కిన్ కేర్ ఉత్పత్తులు వాడాలో చర్మనిపుణులు లేదా వైద్యనిపుణుల సలహా తీసుకొని తదనుగుణంగా స్కిన్ కేర్ రొటీన్ ను ప్లాన్ చేసుకోవడం ఉత్తమమని కూడా నిపుణులు సూచిస్తున్నారు. అలాగే పారాబిన్స్ కూడా ఎంతో హానికలిగిస్తాయి. పారాబీన్స్ ప్రిజర్వేటివ్స్. వీటిని బాక్టీరియా పెరగకుండా నిరోధించేందుకు స్కిన్ కేర్ ఉత్పత్తుల్లో వాడతారు. కానీ ఇవి హార్మోన్ల మీద తీవ్ర ప్రభావం చూపుతాయి. అంతేకాదు పునరుత్పత్తి ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. విచారకరమైన విషయం ఏమిటంటే మాయిశ్చరైజర్ నుంచి మేకప్ ఉత్పత్తుల వరకూ ప్రతిదాంట్లో ఈ పారాబెన్స్ తప్పని సరిగా ఉంటాయి. అందుకే మీరు కొనే స్కిన్ కేర్ ఉత్పత్తుల లేబుల్స్ చదివి అందులో పారాబెన్స్ లేవని నిర్ధారణ చేసుకున్న తర్వాతే వాటిని కొంటే మంచిది. అలాగే స్కిన్ కేర్ ప్రొడక్టులో సోడియం లారిల్ సల్ఫేట్ (ఎస్ ఎల్ ఎస్) ఉండకుండా చూసుకోవాలి. ఇది చాలా శక్తివంతమైన డిటర్జెంట్. దీన్ని క్లీన్సర్స్, షాంపులలో ఎక్కువగా వాడతారు. దీనివల్ల చర్మం ఇరిటేషన్, డ్రైనెస్ తలెత్తుతుంది. మరీ ముఖ్యంగా సున్నితమైన చర్మం ఉన్నవాళ్లు వీటికి దూరంగా ఉండాలి.

ఎస్ ఎల్ ఎస్ చర్మంలోని సహజనూనెగుణాలను పాగొట్టి పొడిబారినట్టు చేస్తుంది. స్కిన్ కేర్ కు వాడే పదార్థాలలో సింథటిక్ సువాసనలు కూడా ప్రమాదకరమైనవే. వీటిలో ఉపయోగించే రసాయనాల సమ్మేళనాలు స్కిన్ ఇరిటేషన్ కు కారణం అవుతాయి. అందుకే సువాసనలు లేని ఉత్పత్తులు లేదా సహజసిద్ధమైన , ప్లాంట్ ఆధారిత సెంట్లు కలిపిన స్కిన్ కేర్ ఉత్పత్తులను వాడాలని సౌందర్య నిపుణులు చెప్తున్నారు. స్కిన్ కేర్ ఉత్పత్తుల్లో బాక్టీరియా వ్రుద్ధిచెందకుండా ఉండేందుకు కొన్నిసార్లు ఫర్మాల్డిహైడ్ అనే ప్రిజర్వేటివ్ వాడుతుంటారు. ఇది కాన్సర్ కారకం అంటారు. దీని వల్ల చర్మం ఇరిటేషన్ కు గురవుతుంది. రకరకాల అలర్జీల బారిన చర్మం పడే అవకాశం కూడా ఉంది. సెంట్లల్లో పాథలైట్స్ అనే రసాయనం బాగా వాడుతుంటారు. ఇది హార్మోన్ల మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. స్కిన్ కేర్ ఉత్పత్తుల్లో మాయిశ్చరైజర్లు ఉన్నాయి. వీటిల్లో పెట్రోలియం ఆధారిత పదార్థమైన మినెరల్ ఆయుల్ ని ఎక్కువగా వాడుతుంటారు.

ఇది చర్మ రంధ్రాలను మూసుకుపోయేట్టు చేస్తుంది. చర్మానికి ఊపిరి ఆడదు. దీంతో చర్మంపై బ్రేకవుట్లు తలెత్తుతాయి. ఈ కాస్మొటిక్ పొల్యూషన్ నుంచి చర్మాన్ని పరిరక్షిచుకోవాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక పరిశీలన ప్రకారం ప్రతి పది కాస్మొటిక్ ఉత్పత్తుల్లో తొమ్మిదింటిలో కాలుష్య రహితమైన మైక్రోప్లాస్టిక్స్ ఉన్నాయి. స్క్రబ్బింగ్, ఎక్స్ ఫొయిలేటింగ్ కి ఉపయోగించే ఉత్పత్తుల్లో ఇవి ఉన్నాయి. బ్యూటీ ఉత్పత్తుల్లో వాడే సింథటిక్ కలర్స్ కూడా ప్రమాదకరమే. లిప్ స్టిక్స్, ఐలైనర్స్, ఫౌండేషన్, లేటనింగ్ టూత్ పేస్టుల్లో లెడ్ ఉంటుంది. గాలి ఇతరత్రా నుంచి లెడ్ వంటి భారీ లోహం బారిన మనం పడుతున్నాం. ఇది శరీరానికి మంచిది కాదు. బ్యూటీ ఉత్పత్తుల్లో కూడా దీని వాడకం వల్ల తలెత్తే పరిణామాలు సమస్యను మరింత తీవ్రం చేస్తాయని చెపుతున్నారు ఆరోగ్యనిపుణులు.
సన్ స్క్రీన్ లో బెన్ జొఫినోన్, ఆక్సిబెంజోన్, పిఎబిఎ, హోమోసెలైట్ వంటి రసాయాలు ఉంటాయి. ఇవి శరీరానికి రక్షణ ఇవ్వడం కన్నా శరీరంపై విషపరిణామాలకు కారణమవుతాయని నిపుణులు చెప్తున్నారు. సో… మీరు కొనే బ్యూటీ ఉత్పత్తుల్లో మీ చర్మానికి హానికరమైన పదార్థాలు ఉంటే మటుకు వాటికి నో
చెప్పండి. సహజసిద్ధమైన పదార్థాలను వాడడంతో మీ సహజ అందాలను పరిరక్షించుకోండి. నిపుణుల సలహాతోనే బ్యూటీ ప్రాడక్టులు వాడండి…అప్పుడు మీరు అందంగానే కాదు ఆరోగ్యంగా కూడా ఉంటారు..

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News