పెళ్లంటే.. ఎంత హడావిడి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అటు మగపెళ్లివారు, ఇటు ఆడపెళ్లివారింట.. బంధుమిత్రులతో పెండ్లి పనులతో కళకళలాడుతుంది. వచ్చినవారికి మర్యాదల్లో లోటు జరగకుండా ఉండాలని.. ఎక్కడైనా ఏమైనా తక్కువ అయిందా అని ఒకటికి రెండుసార్లు చూసుకుంటూ ఉంటారు. ఇక ముహూర్త సమయం దగ్గరపడేకొద్దీ.. పెళ్లికొడుకు, పెళ్లి కూతురిలో ఎప్పుడెప్పుడు కాబోయేవారిని చూస్తామా అన్న ఉత్సుకత పెరుగుతుంది.
కానీ.. ఓ పెళ్లిలో దండలు మార్చుకుంటుండగా ఊహించని విషాద ఘటన జరిగింది. పెళ్లి మండపం పైనే నవ వధువు గుండెపోటుతో మరణించింది. ఉత్తరప్రదేశ్ లోని లక్నో శివారు బడ్వానాలో ఈ ఘటన చోటుచేసుకుంది. బడ్వానా గ్రామానికి చెందిన రాజ్ పాల్ కూతురు శివంగి (20)కి, అదే గ్రామానికి చెందిన వివేక్ తో పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఊరేగింపుగా వధూవరుల కుటుంబాలు మండపానికి చేరుకున్నాయి. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు మండపంపైకి ఎక్కారు. దండలు మార్చుకుంటున్న సమయంలో వధువు శివంగి ఒక్కసారిగా మండపంపైనే కుప్పకూలింది.
కంగారుపడిన ఆమె తల్లిదండ్రులు, బంధువులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ.. అప్పటికే ఆమె అప్పటికే చనిపోయిందని డాక్టర్లు చెప్పడంతో అందరూ నిర్ఘాంతపోయారు. పెళ్లితో ఆనందాలు వెల్లివిరియాల్సిన వారి ఇళ్లలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వధువు, వరుడి కుటుంబసభ్యులు, బంధువులు కన్నీటిపర్యంతమయ్యారు. పెళ్లై అత్తగారింట అడుగుపెట్టాల్సిన తమ కూతురు.. తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో.. తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.