Friday, September 20, 2024
HomeతెలంగాణSingareni: ఉస్మానియా మైనింగ్ విద్య నిర్వహణకు సింగరేణి సహకారం

Singareni: ఉస్మానియా మైనింగ్ విద్య నిర్వహణకు సింగరేణి సహకారం

దేశవ్యాప్తంగా మైనింగ్ రంగం ఎంతో అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో మైనింగ్ ఇంజినీర్ల ఆవశ్యకత ఎంతగానో ఉందని, ఈ నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో మైనింగ్ విభాగం అభివృద్ధికి సింగరేణి తనవంతుగా ‘ఛైర్ ప్రొఫెసర్’ ఒప్పంద కార్యక్రమంలో భాగంగా మూడు కోట్ల రూపాయల డిపాజిట్లను సమకూర్చిందని సింగరేణి సంస్థ ఛైర్మన్, ఎండీ ఎన్.శ్రీధర్ పేర్కొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో ఈ మేరకు యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ డి.రవీందర్, ఎన్.శ్రీధర్ కలిసి ‘‘ఛైర్ ప్రొఫెసర్’’ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. దీని ప్రకారం మైనింగ్ ఇంజినీరింగ్ కాలేజీలో పనిచేసే ప్రొఫెసర్లకు సింగరేణి అందించిన మూడు కోట్ల రూపాయల డిపాజిట్ ద్వారా వేతనాలు చెల్లిస్తామని తెలిపారు. దీనికి అదనంగా మైనింగ్ ఇంజినీరింగ్ విభాగంలో మూడేళ్లపాటు ప్రొఫెసర్లుగా సేవలందించడానికి ఎంపిక చేసిన ఇద్దరు సీనియర్ సింగరేణి ఇంజనీర్లను కేటాయిస్తూ ఇదే సమావేశంలో సంస్థ చైర్మన్-ఎండీ ఎన్.శ్రీధర్ ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా సింగరేణి ఛైర్మన్, ఎండీ ఎన్.శ్రీధర్ మాట్లాడుతూ వివిధ రంగాల్లో హైదరాబాద్ నేడు అంతర్జాతీయస్థాయికి ఎదిగిందని, శతాధిక సంవత్సరాల మహోన్నత చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీ కూడా అంతర్జాతీయంగా మరింత ఖ్యాతి గడించాలని ఆకాంక్షించారు.
తాను కూడా ఉస్మానియా యూనివర్సిటీలో బీటెక్ చదివానని, అనంతరం ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కు ఎంపికై ప్రస్తుతం సింగరేణి సంస్థ ఛైర్మన్ గా పనిచేస్తున్నానని, తాను ఈ స్థాయికి ఎదగడానికి ఉస్మానియా యూనివర్సిటీయే కారణమని కొనియాడారు. ఈ యూనివర్సిటీలో చదివి ప్రస్తుతం వివిధ హోదాల్లో ఉన్న మాజీ విద్యార్థులు కూడా ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధికి ఇతోధికంగా సహకరించాలని కోరారు. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధికి ఎంతోకాలంగా తన వంతు సహకారం అందిస్తోందన్నారు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగం అభివృద్ధికి, తరగతి గదుల నిర్మాణం, కాన్ఫరెన్స్ హాలు నిర్మాణానికి ఇటీవలనే సింగరేణి సంస్థ ద్వారా దాదాపు రెండు కోట్ల రూపాయల సి.ఎస్.ఆర్. నిధులను అందజేశామన్నారు. యూనివర్సిటీలోని వివిధ కళాశాలల విద్యార్థినీవిద్యార్థులు నిర్వహించే సెమినార్లు, ఉత్సవాలకు సంస్థ తనవంతుగా సహకరిస్తోందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా డైరెక్టర్ ఫైనాన్స్ మరియు పా ఎన్.బలరామ్ మాట్లాడుతూ… ఉస్మానియా యూనివర్సిటీ వారు నాలుగు దశాబ్దాల క్రితం కొత్తగూడెంలో తమ మైనింగ్ విభాగాన్ని ‘కొత్తగూడెం స్కూల్ ఆఫ్ మైనింగ్’గా ఏర్పాటు చేయడానికి సింగరేణిb సంస్థ పూర్తి సహకారం అందించిందని గుర్తు చేశారు. అలాగే రామగుండం-3 ఏరియా, సెంటీనరీ కాలనీ వద్ద
జె.ఎన్.టి.యూ.హెచ్. కళాశాల ప్రారంభిస్తున్నప్పుడు భవనాల నిర్మాణానికి రూ. 20 కోట్లకు పైగా సి.ఎస్.ఆర్.నిధులు అందించి సహకరించిందని, తదుపరి కూడా సహకారం అందిస్తూ వస్తుందన్నారు.
సింగరేణి సంస్థ శ్రీరాంపూర్ లో స్వయంగా పాలిటెక్నిక్ కళాశాల కూడా నిర్మించిందని, ఇది రాష్ట్రంలో అత్యుత్తమ పాలిటెక్నిక్ కళాశాలలో ఒకటిగా ఎదిగిందన్నారు. వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ డి.రవీందర్ మాట్లాడుతూ… ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధికి సింగరేణి సంస్థ అందించిన సహకారానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సింగరేణి అందించిన సహకారం మరెన్నో సంస్థలకు, మాజీ విద్యార్థులకు స్ఫూర్తిదాయకం కావాలన్నారు. సింగరేణి సంస్థ ఛైర్మన్ ఆకాంక్ష మేరకు సింగరేణి నిధులతో నిర్మిస్తున్న ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ విభాగం భవనాలను అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో నిర్మిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ అల్యూమిని అధ్యక్షులు డాక్టర్ విజయకుమార్, మైనింగ్ అల్యూమిని అసోసియేషన్ ఉపాధ్యక్షులు అమర్నాథ్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి.లక్ష్మీనారాయణ ప్రసంగించారు.
అల్యూమిని ఆఫ్ మైనింగ్ ఇంజినీర్స్ ఆఫ్ ఉస్మానియా, మైనింగ్ ఇంజినీర్స్ అసోసియేషన్ నాయకులు ఎం.ఎస్.వెంకటరామయ్య, అమర్నాథ్ సారథ్యంలో సింగరేణి సంస్థ ఛైర్మన్ ఎన్.శ్రీధర్ ను, డైరెక్టర్ పా ఎన్.బలరామ్ ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సింగరేణి సంస్థ తరఫున ఉస్మానియా యూనివర్సిటీకి సహకరిస్తున్న అడ్వైజర్ మైనింగ్ డి.ఎన్.ప్రసాద్, జనరల్ మేనేజర్ కోఆర్డినేషన్ ఎం.సురేష్, జి.ఎం.హెచ్.ఆర్.డి. బి.హెచ్.వెంకటేశ్వరరావు, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ ఎన్.భాస్కర్ తదితరులకు మెమోంటోలు బహూకరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News