సమాజంలో వైద్యుల పాత్ర ఎంతో కీలకమైనదని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలలు, ప్రభుత్వ టీచింగ్ ఆస్పత్రుల పరిపాలనా విభాగానికి చెందిన అధికారులకు విజయవాడలో ని ఓ హోటల్‌లో బుధవారం శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. రెండు రోజులపాటు జరగనున్న ఈ కార్యక్రమానికి తొలి రోజు మంత్రి విడదల రజిని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగాఆమె మాట్లాడుతూ రెండు రోజులపాటు సిబ్బందికి సర్వీస్ రూల్స్, ఫైల్స్ నిర్వహణ, ఆస్పత్రి, కళాశాలల్లో పరిపాలనా బాధ్యతలు తదితర అంశాలపై రెండు రోజుల పాటు శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైద్య ఆరోగ్య రంగంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని తెలిపారు. ఏకంగా 49 వేల మందిని కేవలం ఒక్క మన వైద్య ఆరోగ్యశాఖలోనే కొత్తగా నియమించారని పేర్కొన్నారు. ఇంత గొప్ప యజ్ఞం కారణంగా టెర్షియరీ కేర్ విభాగంలోని వైద్య సిబ్బందిపై పని ఒత్తిడి తగ్గిందన్నారు. టీచింగ్ ఆస్పత్రులపై పనిభారం తగ్గేందుకు వీలుగా జగనన్న కింది స్థాయి నుంచి హెల్త్ కేర్‌ను పూర్తి బలోపేతం చేశారని చెప్పారు. ఇప్పుడు ప్రతి గ్రామానికి విలేజ్ హెల్త్ కేర్ సెంటర్ తీసుకొచ్చారని తెలిపారు. అందులో ప్రాథమిక వైద్య పరీక్షలన్నీ చేస్తున్నారని చెప్పారు. మందులు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. 80 శాతం మంది ప్రజలు ఇప్పుడు ఈ స్థాయిలోనే వైద్యం పొందుతున్నారని తెలిపారు. టెర్షియరీ కేర్ ను కూడా జగనన్న పూర్తి స్థాయిలో బలోపేతం చేశారని తెలిపారు. ఆస్పత్రుల నిర్మాణం, వసతుల ఏర్పాటు, సిబ్బంది నియామకాలు.. ఇలా పూర్తి పటిష్టంగా మన వైద్య వ్యవస్థ ఇప్పుడు మారిందని వెల్లడించారు.
ఈ ఏడాది నుంచి ఐదు కొత్త మెడికల్ కళాశాలలు
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి జిల్లాకు కనీసం ఒక మెడికల్ కళాశాల అయినా ఉండాల్సిందేననే లక్ష్యంతో ఏకంగా 17 మెడికల్ కళాశాలలు నిర్మిస్తున్నారని తెలిపారు. వీటిలో 5 మెడికల్ కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి తరగతులు కూడా ప్రారంభం కాబోతున్నాయన్నారు.
8500 కోట్లకుపైగా నిధులతో ఇప్పటికే ఉన్న మెడికల్ కళాశాలలు, టీచింగ్ ఆస్పత్రులను తీర్చి దిద్దుతున్నారని కొనియాడారు. ప్రైమరీ కేర్, సెకండరీ కేర్, మెడికల్ కళాశాలల నిర్మాణం, అభివృద్ధి, టీచింగ్ ఆస్పత్రుల అభివృద్ధి వీటన్నింటి కోసం ఏకంగా రూ.16వేల కోట్ల రూపాయలు జగనన్న ప్రభుత్వం ఖర్చు చేస్తోందని చెప్పారు. ఆరోగ్యశ్రీ కింద ఏటా 3వేల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేస్తున్నామన్నారు. ఇదంతా పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడం కోసమేనని చెప్పారు. జబ్బుల వల్ల ఏ కుటుంబం కూడా ఆర్థికంగా చితికి పోకూడదనే లక్ష్యంంతో ప్రభుత్వం పనిచేస్తున్నదన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ ఫలాలు సక్రమంగా ప్రజలకు అందాలంటే వైద్యుల కృషి ఎంతో కీలకమని చెప్పారు. సిబ్బంది బాగా పనిచేస్తే… ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించగలిగితే.. జగనన్న లక్ష్యం నెరవేరినట్లేనని ఆకాంక్షించారు.
సిబ్బంది సమయపాలన పాటించాలి
ఆస్పత్రుల్లో ని సిబ్బంది సమయ పాలన పాటించేలా చూడాలని చెప్పారు. ప్రతి వైద్యుడు కచ్చితంగా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విధుల్లో ఉండాలని తెలిపారు. రోగులతో వైద్య సిబ్బంది ఆప్యాయంగా మాట్లాడేలా చూడాలని సూచించారు. ఆస్పత్రుల సూపరింటెండెంట్లు – వైద్య కళాశాలల ప్రిన్సిపాళ్ల మధ్య సమన్వయం బాగా ఉండాలన్నారు. వీలైతే ప్రతి రోజూ మాట్లాడుకుంటూ ఉండాలని సూచించారు. వైద్య సిబ్బందితో సమర్థవంతంగా ఎలా పనిచేయించాలో మీరే కూర్చుకుని మాట్లాడుకుని ఆ మేరకు మెరుగైన సేవలు అందేలా చూడాలని తెలిపారు.హెచ్‌డీఎస్, సీడీఎస్ సమావేశాలు సక్రమంగా, క్రమం తప్పకుండా నిర్వహించేలా చూడాలన్నారు. శానిటేషన్ చాలా బాగుండాలన్నారు. సెక్యూరిటీ, డైట్, పెస్ట్ కంట్రోల్, లాండ్రీ లాంటి సర్వీసు విభాగాలన్నీ సమర్థవంతంగా పనిచేయాల్సిందేనని, అందుకు మీ సహకారం ఎంతో అవసరమని తెలిపారు. కార్యక్రమంలో డీఎంఈ విభాగ ముఖ్య అధికారులు, రాష్ట్ర వ్యాప్తంగా టీచింగ్ ఆస్పత్రుల సూపరింటెండెంట్లు, డిప్యూటీ సూపరింటెండెంట్లు, సీఎస్ ఆర్ ఎంవోలు, ఏడీలు, అడ్మినిస్ట్రేటర్లు, వైద్య కళాశాలల ప్రిన్సిపాళ్లు, వైస్ ప్రిన్సిపాళ్లు, ఏడీలు పాల్గొన్నారు.
Rajini: ప్రభుత్వ ఆశయాలు నెరవేర్చాల్సింది వైద్యులే
సంబంధిత వార్తలు | RELATED ARTICLES