కర్ణాటకలోని హంపీలో ఉన్న అతి పురాతనమైన విజయ విఠ్ఠల దేవాలయంలో గత సోమవారం ఉధృతంగా మంటలు చెలరేగడంఆందోళన రేకెత్తించింది. ఇది అతి పురాతన వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించిన దేవాలయం. ఈ దేవాలయంలో మంటలు చెలరేగడాన్ని గమనిస్తే ఇతర పురాతన చారిత్రక, ఆధ్యాత్మిక కట్టడాల పరిస్థితి ఏ విధంగా ఉందోనన్న ఆవేదన కలుగుతుంది. ఇక్కడి కట్టడాలను సందర్శించడానికి వచ్చే పర్యాటకుల కారణంగానే ఈ అగ్నిప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతుండగా, వేసవి వేడిమి, పొడి వాతావరణం కారణంగానేఈ అగ్ని ప్రమాదంజరిగినట్టు అధికారులు చెబుతున్నారు. ఇది ప్రకృతి సంబంధమైన ప్రమాదమా లేక మానవ తప్పిదమా అన్న విషయాన్ని పక్కన పెడితే, అసలు వారసత్వ కట్టడాలకు రక్షణ ఉందా లేదా అన్న సందేహం తీవ్ర ఆందోళక కలిగిస్తోంది. దేశంలోని అనేకానేక వారసత్వ కట్టడాలు దెబ్బతినడానికి, కుప్పకూలడానికి, శిథిలమైపోవడానికి అనేక అవకాశాలు కనిపిస్తున్నాయి.
హంపీలోనే ఈ విధంగా ప్రమాదాలు జరగడం వరుసగా ఇదిమూడవసారి. గత ఏడాది అక్టోబర్‌లో విరూపాక్ష దేవాలయం పక్కనే గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఏడాది మార్చిలో ఒక యువకుడు హేమకూట హిల్ ఆలయ సముదాయంమీద ఎక్కి నృత్యం చేయడం కనిపించింది. అంతేకాదు, ఇదే విఠ్ఠల దేవాలయంలో బెంగళూరుకు చెందిన ఒక పర్యాటకుడు రెండు స్తంభాలను ఊడబీకడం జరిగింది. ఇక కర్ణాటకలోని విజయపురాలో 1656లో గోల్ గుంబజ్ అనే ప్రపంచ ప్రఖ్యాత వారసత్వ కట్టడాన్నికూడా ధ్వంసం చేయడం జరిగింది. దక్షిణ ప్రాంత తాజ్‌మహల్‌గా అభివర్ణించే ఈ గోల్ గుంబజ్ కట్టడం అనేక విధాలుగా ధ్వంసం అవుతూ వస్తోంది. ఇక ఇందులోని ‘విస్పరింగ్ గ్యాలరీ’కి చాలా మరమ్మతులు, పునరుద్ధరణ చర్యలు అవసరం అవుతాయి. ప్రపంచంలో ఎనిమిదవ వింతగా గుర్తింపు పొందిన ఆగ్రా తాజ్‌మహల్ కు కూడా తరచూ మరమ్మతులు అవసరమవుతూనే ఉన్నాయి. వాయు కాలుష్యం కారణంగా దీని పైకప్పు కూడా నల్లగప్పిపోయింది.
భారతదేశంలో 40 వరకూ ప్రపంచ ప్రఖ్యాత వారసత్వ కట్టడాలున్నాయి.ఇందులో ఏడు సహజసిద్ధమైన వారసత్వ సంపదలు కాగా, 32 ప్రకృతి సంబంధమైన వారసత్వ సంపదలు. ఒకటి మాత్రం మిశ్రమంగా ఉంటుంది. దేశంలోని ఈ అతిపురాతన కట్టడాలను కాపాడడానికి 1958లోనూ, ఆ తర్వాత 1972లోనూ చట్టాలు చేశారు.అయితే, ఈ చట్టాలను సమర్థవంతంగా, కఠినంగా అమలు చేయడం, వీటికి కట్టుబడి ఉండడం మాత్రం జరగడం లేదు. ఇవన్నీ ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలే కానీ, పౌరులు కూడా వీటి ప్రాధాన్యాన్ని, ప్రాముఖ్యాన్ని గుర్తించి వీటిని కాపాడుకోవడానికి ప్రయత్నించాల్సి ఉంది. వీటిని సాంస్కృతిక, చారిత్రక కట్టడాలుగా చూడడంతో పాటు, ఆదాయం ఇచ్చే కట్టడాలుగా కూడా పరిగణించాల్సి ఉంటుంది. వీటిని చూసినప్పుడు ఇవి భారతదేశ బహుళ సంస్కృతులు, బహుళ నాగరికతల మిశ్రమంగా కూడా కనిపిస్తాయి. విదేశీయులు భారత్ మీద దండయాత్రకు వచ్చి వీటన్నిటినీ ధ్వంసం చేశారని ఇప్పటికీ బాధపడుతున్న మనం చివరికి మనమే వీటిని స్వయంగా ధ్వంసం చేయడం ప్రారంభించడంలో న్యాయం లేదు.