కర్నూలు జిల్లా మండ్లెం గ్రామరైతుల జలదీక్షకు లోకేష్ సంఘీభావం తెలిపారు. జూపాడుబంగ్లా మండల పరిధిలోని మండ్లెం గ్రామ రైతులకు తమ పొలాలకు సాగునీరు అందించాలని మండ్లెం గ్రామరైతులు చేస్తున్న జలదీక్షకు యువనేత లోకేష్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రైతులు తమ సమస్యను తెలియజేస్తూ… శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో సర్వస్వం కోల్పోయిన మేం మెట్టభూములు సాగు చేసుకుంటున్నాం, రాయలసీమలోని ఎగువ భాగం, ఆంధ్రతీర ప్రాంత ప్రజలకోసం పొలాలు త్యాగం చేసిన మేం అన్యాయానికి గురయ్యాం అన్నారు. మండ్లెం, తంగెడంచ, భాస్కరాపురం గ్రామాల్లో 5వేల ఎకరాలకు గత 40ఏళ్లుగా సాగునీరు లేక మా ప్రాంతం ఎడారిగా మారిందన్నారు.
పొలాలకు సాగునీరు లేక రైతులు, రైతుకూలీలు పొట్టకూటి కోసం వలసలు వెళ్తున్నాం అన్నారు. వలస బతకులతో మా పిల్లల విద్య, ఆరోగ్యం దెబ్బతిని, నిరక్షరాస్యత కూడా పెరిగిపోయిందన్నారు. గ్రామంలో ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీల పొలాలే అధికంగా ఉన్నాయని, వర్షాలపైనే ఆధారపడటంతో ఏడాదిలో ఒక పంట కూడా సరిగా పండటంలేదని రైతులు వాపోయారు. సకాలంలో వర్షాలు లేక పంటలు ఎండిపోయి కొందరు రైతులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారనే విషయాన్ని లోకేష్ దృష్టికి తెచ్చారు. మా ప్రాంతంలో ప్రత్యేక ఎత్తిపోతల పథకం ఏర్పాటుచేసి ఆదుకోవాలి అన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. కృష్ణా నది చెంతనే ఉన్నా మండ్లెం ప్రాంత పొలాలకు సాగునీరు ఇవ్వకపోవడం అన్యాయం అన్నారు. కరువు కోరల్లో చిక్కుకున్న రాయలసీమ రైతాంగంపై కనీస కనికరం కూడా లేదన్నారు. రాష్ట్రంలో 3వేలమందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.గత టిడిపి ప్రభుత్వం సీమ ప్రాజెక్టుల కోసం రూ.11,700 కోట్లు ఖర్చు చేశాం అన్నారు. వచ్చే ఎన్నికల్లో టిడిపిని గెలిపించండి. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన ఏడాదిలో మండ్లెం ప్రాంతంలో ఎత్తిపోతల పథకం ఏర్పాటుచేసి సాగునీటి సమస్య పరిష్కరిస్తాం అన్నారు.
Lokesh: రైతుల జలదీక్షకు లోకేష్ సంఘీభావం
సంబంధిత వార్తలు | RELATED ARTICLES