Minister Indrakaran Reddy: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి కోపం వచ్చింది. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై ఆయన అగ్నిమీద గుగ్గిలమయ్యాడు. దమ్ముంటే నిరూపించు పదిరోజులు సమయం ఇస్తా అంటూ విరుచుకుపడ్డారు. నలబై ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నాం. ఏనాడు వ్యక్తిగత దూషణకు దిగలేదు. కానీ, బీజేపీ నేతలు నోటికి ఎంతవస్తే అంత మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తనకు చేసిన ఛాలెంజ్‌కు రెడీ అన్నారు. 10 రోజులు టైమ్ ఇస్తానని, తన చిట్టా ఏంటో బయటపెట్టాలని బండి సంజయ్ కు సవాల్ విసిరారు. తనపై చేసిన ఆరోపణలు రుజువు చేయాలని తాను సైతం బండి సంజయ్‌కి సవాల్ చేస్తున్నానని చెప్పారు.
విమర్శలకు కూడా ఓ హద్దు ఉంటుంది. ఇనేళ్ళ రాజకీయ జీవితంలో ఏనాడు వ్యక్తిగత దూషణలకు దిగలేదు. ఎన్నికల సమయంలో ఒకరిపై ఒకరు రాజకీయ విమర్శలు చేసుకోవడం కామన్. కానీ గతంలో ఎన్నడూ లేనివిధంగా గౌరవ ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, మహిళలు, చిన్న పెద్ద, అనే తేడా లేకుండా బీజేపీ నేతలు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారు అంటూ ఇంద్రకరణ్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్ తనతీరును మార్చుకోవాలి. బీజేపీ నేతలు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలంటూ హెచ్చరించారు.
ఇంతకి ఇంద్రకరణ్ రెడ్డికి అంతకోపం రావడానికి కారణం.. బండి సంజయ్ వ్యాఖ్యలే. ఆదివారం నిర్మల్ సభలో బండి తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. బెంగళూరు డ్రగ్స్ కేసును మళ్లీ తెరిపిస్తామని, ఈ కేసుతో సీఎం కేసీఆర్ కు, ఆయన కుటుంబానికి సంబంధం ఉందని సంచలన ఆరోపణలు చేశారు. అదే విధంగా హైదరాబాద్ డ్రగ్స్ కేసును కూడా బయటకు తీసి, దోషులకు శిక్ష పడేలా చేస్తామన్నారు. త్వరలో వచ్చేది బీజేపీ ప్రభుత్వం అని తెలంగాణ మంత్రుల అవినీతి చిట్టా బయట పెడతామన్నారు. దీంతో సోమవారం మంత్రి విలేకరుల సమావేశం పెట్టి.. సంజయ్ తనకు చేసిన ఛాలెంజ్‌కు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి రెడీ అన్నారు. 10 రోజులు టైమ్ ఇస్తానని, తన చిట్టా ఏంటో బయటపెట్టాలని బండి సంజయ్ కు సవాల్ విసిరారు.