దివ్యాంగురాలైన చదువుల తల్లికి పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అండగా నిలిచారు. జిన్నారం మధిర గ్రామమైన పెద్దమ్మ గూడెంకు చెందిన కొన్నే శ్రుతి దివ్యాంగురాలు కావడంతో కళాశాల వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. స్థానిక నాయకుల ద్వారా సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి.. స్వయంగా సొంత నిధులతో గిఫ్ట్ స్మైల్ కార్యక్రమం ద్వారా ద్విచక్ర వాహనాన్ని శృతికి అందజేశారు. భవిష్యత్తులోనూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఉన్నత విద్యను అభ్యసించి గ్రామానికి మంచి పేరు తీసుకుని రావాలని ఆకాంక్షించారు.
తన కష్టాన్ని తెలుసుకొని స్వయంగా తన దగ్గరికి వచ్చి వాహనాన్ని అందించడం పట్ల ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కి ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మాట ఇస్తే మడమతిప్పని నేతగా జన హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న ఎమ్మెల్యే జిఎంఆర్ మరోమారు తన ఔదార్యం చాటడం పట్ల పెద్దమ్మ గూడెం గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.