Gujarat Assembly Election 2022: గుజరాత్ అసెంబ్లి ఎన్నికల్లో మళ్లి బీజేపీ జెండా రెపరెపలాడనోంది. సోమవారం రెండవ విడత పోలింగ్ ప్రక్రియ ముగియడంతో ఎగ్జిట్‌పోల్స్ తమతమ ఫలితాలను వెల్లడించాయి. అన్ని ఎగ్జిట్‌పోల్స్ లో బీజేపీనే విజయం సాధిస్తుందని స్పష్టంగా కనిపించింది.. కొన్ని ఎగ్జిట్ పోల్స్‌లో గతంకంటే ఈసారి బీజేపీ స్థానాలు తగ్గుతాయని చెప్పినప్పటికీ అధికారం మాత్రం బీజేపీనే వరిస్తుందని స్పష్టం చేశాయి. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఆప్ రూపంలో గట్టిదెబ్బ తగలబోతుందని పలు ఎగ్జిట్‌పోల్స్ అంచనా వేశాయి. కాంగ్రెస్ ఓట్లను ఆప్ చీల్చుకోవటం ద్వారా కాంగ్రెస్‌కు నష్టం జరగ్గా బీజేపీకి లాభం చేకూర్చిందనే అంచనాలను పలు ఎగ్జిట్స్పోల్ సంస్థలు ప్రస్తావించాయి.
గుజరాత్ రాష్ట్రంలో మొత్తం 182 అసెంబ్లి స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అధికారంలోకి రావాలంటే మ్యాజిక్ ఫిగర్ 92 స్థానాలు అవసరం. రెెండు విడతల్లో ఈ ఎన్నికలు జరిగాయి. తొలిదశలో 89 స్థానాలకు నవంబర్ 30న పోలింగ్ జరగగా, రెండవ దశ ఎన్నికలు డిసెంబర్ 5న (సోమవారం) జరిగాయి. సోమవారం రెండవ దశ (తుది విడత) పోలింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ తమ ఫలితాలను వెల్లడించాయి. రెండు విడతల్లోనూ బీజేపీకే అధిక అసెంబ్లి స్థానాలు దక్కుతాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. దాదాపు అన్ని ఎగ్జిట్‌పోల్స్ అంచనాలు బీజేపీనే విజయం సాధిస్తుందని చెప్పారు. 100కుపైగా అసెంబ్లి స్థానాలను గెలుచుకొని మరోసారి బీజేపీ అధికార పీఠాన్ని దక్కించుకుంటుందని పలు సంస్థల ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. ఇదిలా ఉంటే గుజరాత్లో తమదే అధికారం అంటూ ప్రచారం నిర్వహించిన ఆప్ వల్ల.. బీజేపీకే మేలు జరిగినట్లు తెలుస్తోంది. ఆప్ అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ ఓట్లను చీల్చడం ద్వారా కాంగ్రెస్‌కు నష్టం జరగ్గా బీజేపీకి మేలు జరిగినట్లు తెలుస్తోంది.
ప్రముఖ ఎగ్జిట్‌పోల్స్ వివరాలను పరిశీలిస్తే..
– రిపబ్లిక్ టీవీ ఎగ్జిట్ పోల్స్ అంచనాలను పరిశీలిస్తే.. బీజేపీ 128-148, కాంగ్రెస్ 30-42, ఆప్ 2-10 అసెంబ్లి స్థానాల్లో విజయం సాధిస్తాయని తెలిపింది.
– న్యూస్ఎక్స్ సర్వే సంస్థ .. బీజేపీ 117-140, కాంగ్రెస్ 34-51, ఆప్ 6-13 స్థానాల్లో విజయం సాధిస్తుందని అంచనా వేసింది.
– టీవీ9 గుజరాతీ ఎగ్జిపోల్స్లోనూ బీజేపీదే హవా అని పేర్కొంది. బీజేపీ 125-130, కాంగ్రెస్ 40-50, ఆప్ 3-5 అసెంబ్లి స్థానాల్లో విజయం సాధిస్తుందని అంచనా వేసింది.
– పీపుల్స్ పల్స్ సర్వే సంస్థ.. బీజేపీ 125 -143, కాంగ్రెస్ 30-48 అసెంబ్లి స్థానాల్లో, ఆప్ 3 -7 స్థానాల్లో విజయం సాధిస్తాయని అంచనా వేసింది.
– ఔట్ ఆఫ్ ది బాక్స్ సంస్థ ఎగ్జిట్ పోల్స్ కూడా బీజేపీదే విజయం అని స్పష్టం చేసింది. ఈ సంస్థ సర్వే ప్రకారం.. బీజేపీ 130 -145, కాంగ్రెస్ 25-35, ఆప్ 5 నుంచి ఏడు అసెంబ్లి స్థానాల్లో విజయం సాధిస్తుందని అంచనా వేసింది.