తమలపాకులు నోటిని ఎరుపు చేయడమే కాదు తిన్న ఆహారాన్ని బాగా జీర్ణమయ్యేట్టు చేస్తాయని మన బామ్మలు చెప్పేవాళ్లు. అయితే తమలపాకుల్లో బ్యూటీని కాపాడే సుగుణాలు కూడా బోలెడు ఉన్నాయి. తమలపాకుల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ సుగుణాలు బోలెడు ఉన్నాయి.
ఇవి యాక్నే లక్షణాలను నిరోధించడంలో ఎంతో ఉపయోగపడతాయి. కొన్ని తమలపాకులను నీటిలో నానబెట్టి ఆ నీటితో ముఖం కడుక్కున్నా లేదా తమలపాకులను పేస్టులా చేసి దాన్ని ముఖానికి రాసుకుని ఐదు నిమిషాలు ఉంచుకుని ఆ తర్వాత చల్లటి నీళ్లతో ముఖం కడుక్కోవాలి. ఇలా రోజుకు రెండుసార్లు చేస్తే చర్మం ఎంతో శుభ్రంగా అయి చూడడానికి తాజాగా, ఆరోగ్యకరంగా ఉంటుంది. పొడిచర్మం, ఎలర్జీలు, ఇతర చర్మసంబంధమైన సమస్యల వల్ల దురద,మంటలు, దద్దుర్లు శరీరంపై తలెత్తుతాయి. తమలపాకుల్లో సాంత్వన నిచ్చే లక్షణం ఉండడం వల్ల చర్మంపై తలెత్తిన ఇరిటేషన్ ని ఎంతో శక్తివంతంగా నివారిస్తుంది. పది తమలపాకులను తీసుకుని నీళ్లల్లో వేసి ఉడకబెట్టి స్నానం చేసే నీళ్లల్లో ఆ నీటిని కలిపాలి. ఇలా తమలపాకులతో నిత్యం స్నానం చేస్తే ఈ ఆకుల్లోని యాంటిఇన్ఫ్లమేటరీ గుణాలు వల్ల మంట, దురద, వాపు తగ్గుతాయి. శరీరం నుంచి వచ్చే దుర్వాసన సమస్యను కూడా తమలపాకులు తగ్గిస్తాయి. స్నానం చేసే నీటిలో బీటిల్ లీవ్స్ ఆయిల్ (తమలపాకునూనె) ను కొద్దిగా వేసి స్నానం చేస్తే శరీరం తాజాగా ఉండడమే కాకుండా, శరీర దుర్వాసనకు కారకమైన బాక్టీరియాను తమలపాకు ఆయిల్ నివారిస్తుంది.
ఉడకబెట్టిన నీళ్లల్లో తమలపాకులు నానబెట్టి వాటితో డ్రింకు చేసి తీసుకుంటే కూడా ఎంతో మంచిది. ఈ డ్రింకును రోజూ తాగడం వల్ల శరీరంలోని మలినాలను బయటకు పోతాయి. తమలపాకు డ్రింకు శరీరం నుంచి వెలువడే దుర్వాసనను కూడా తగ్గిస్తుంది. దంతక్షయం తగ్గడానికి, చిగుళ్ల బలోపేతానికి సైతం తమలపాకులను పూర్వకాలం నుంచీ వాడుతున్న ఘన చరిత్ర మనకు ఉంది. చర్మాన్ని తెల్లగా చేసే గుణాలు కూడా తమలపాకుల్లో ఉన్నాయి. చర్మంపై ఉండే నల్ల మచ్చలను కూడా తమలపాకులు తగ్గిస్తాయి. తమలపాకుల్లోని యాంటీ బాక్టీరియల్ సుగుణాలు చర్మాన్ని కాంతివంతం చేయడమే కాకుండా అన్ని రకాల మచ్చలను,మొటిమలను నివారించడంలో బాగా పనిచేస్తాయి. కళ్ల కింద ఏర్పడిన వాపు, సంచులు పోయేందుకు తమలపాకు ఫేస్ ప్యాక్ ముఖానికి వేసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.
దద్దుర్లు ఏర్పడిన చోట తమలపాకు పేస్టు రాస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇది చర్మం ఇన్ఫెక్షన్ కు గురికాకుండా సంరక్షిస్తుంది. తమలపాకుల్లోని యాంటీబాక్టీరియల్ సుగుణాల వల్ల చర్మంపై దురద, నొప్పుల కారణంగా ఎదరయ్యే బాధలను సైతం నివారిస్తుంది. యాక్నేను నిరోధిస్తుంది. వారానికి రెండుసార్లు తమలపాకు పేస్టు ముఖానికి రాయడం వల్ల యాక్నే సమస్యను నివారించవచ్చు. కొన్ని తమలపాకులను తీసుకుని అందులో పెరుగు, ముల్తానీ మట్టి లేదా మీ చర్మానికి సరిపడే వేరే ఏదైనా పదార్థం కలిపి పేస్టులా చేసి దాన్ని ముఖానికి రాసుకుని అది పూర్తిగా ఆరిన తర్వాత చల్లటి నీళ్లతో కడుక్కోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వల్ల చర్మం కాంతివంతంగా తయారవుతుంది. లేదా కేవలం తమలపాకు పేస్టును ముఖానికి రాసుకున్నా కూడా చర్మం ఎంతో తాజాదనంతో మెరుస్తుంది. తమలపాకులతో చేసిన ఫేస్ వాష్ కూడా ముఖానికి ఎంతో మంచిది. ఇది చర్మంపై చేరిన బాక్టీరియాను తొలగిస్తుంది. కొన్ని తమలపాకులు తీసుకుని నీళ్లల్లో ఉడికించాలి. ఆ నీళ్లను వడగట్టాలి. ఆకుపచ్చని రంగులో ఉండే ఈ నీళ్లను బాగా చల్లార్చి ముఖాన్ని కడుక్కోవాలనుకున్నప్పుడల్లా ఆ నీటిని ఉపయోగించవచ్చు.
వెంట్రుకలు రాలిపోకుండా ఉంచడంలో కూడా తమలపాకులు ఎంతో శక్తివంతంగా పనిచేస్తాయి. తమలపాకుల్లో నువ్వులనూనె లేదా కొబ్బరినూనె కొద్దిగా వేసి మెత్తగా నూరాలి. ఆ పేస్టును మాడుకు రాసుకొని గంటసేపు దాన్ని అలాగే ఉంచుకుని ఆ తర్వాత షాంపుతో తలస్నానం చేస్తే శిరోజాలు రాలిపోకుండా ద్రుఢంగా ఉంటాయి. యాక్నే ఉన్న చోట తమలపాకు పేస్టు రాస్తే అది పోతుంది. పలు జబ్బుల నివారణలో కూడా తమలపాకులు కీలకంగా వ్యవహరిస్తున్నాయి. తమలపాకులు ఫంగస్ వ్రుద్ధికాకుండా నివారిస్తాయి. పలు అలర్జిక్ రియాక్షన్లపై ఎంతో శక్తివంతంగా పనిచేస్తాయి. గాయాలు తొందరగా మానేలా చేస్తాయి. గ్యాస్ట్రిక్ అల్సర్లను తగ్గిస్తాయి. సో… చర్మనిపుణుల సలహాతో అందానికి, ఆరోగ్యానికి సంజీవని లాంటి తమలపాకులతో మీ అందానికి మరింత మెరుగులు ఇచ్చుకోండి…ఏమంటారు?