Saturday, November 23, 2024
HomeతెలంగాణMahabubabad: గ్రీవెన్స్ దరఖాస్తులు పెండింగ్ లేకుండా చూడాలి

Mahabubabad: గ్రీవెన్స్ దరఖాస్తులు పెండింగ్ లేకుండా చూడాలి

గ్రీవెన్స్ లో వచ్చిన దరఖాస్తులను పెండింగ్ లో పెట్టరాదని సాధ్యమైనంత త్వరలో వాటిని పరిష్కరించాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శశాంక అన్నారు. ఐ.డిఓ.సి.లోని సమావేశమందిరంలో అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ తో కలిసి ( 75 ) విజ్ఞప్తులు స్వీకరించారు. గూడూరు మండలం గోవిందాపురానికి చెందిన మేకల వెంకన్న తన తండ్రి 1992 సంవత్సరం లో సర్వే నెంబర్.111/బి లోని 0.37 గుంటల భూమిని గునిగంటి రాజయ్య, వెంకటయ్య ల వద్ద కొనుగోలు చేసినటువంటి భూమిని అప్పటి నుండి ఖాస్తులో ఉంటూ సాగుచేసుకుంటుండగా అట్టి భూమి పట్టా పాసుపుస్తకాల కొరకు సాదాబైనామా ద్వారా దరఖాస్తు చేసుకోగా పట్టా రాలేదు, ఇప్పుడు పట్టా చేయించి ఇప్పించుట కొరకు వారిని అడగగా దౌర్జన్యానికి పాల్పడుతున్నారని అట్టి భూమికి తన పేరుపై పట్టా చేపించి సమ న్యాయం చేయగలరని కోరారు.
మరిపెడ మండలం తానంచర్ల గ్రామానికి చెందిన యాసరపు స్వప్న 2015 సంవత్సరంలో దేవి ఒకేషనల్ కాలేజీలో ఏఎన్ఎం కోర్స్ పూర్తిచేసి, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ ఫిమేల్ కోర్సు మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రిలో చేశానని తనకు ఇద్దరు పిల్లలు అని కుటుంబ పోషణ ఇబ్బందిగా ఉందని ఆర్ బి ఎస్ కే లోని ఏఎన్ఎం ఉద్యోగానికి నా యొక్క విద్యార్హతలు తగినవని తనకు ఆ ఉద్యోగం ఇప్పించి తన కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.
మహబూబాబాద్ మండలం కంబాలపల్లి గ్రామానికి చెందిన సామ రవి ఈజీఎస్ లో తన ఇంటిలో మరుగుదొడ్డిని నిర్మించుకున్నానని అట్టి బిల్లును ఇప్పించగలరని కోరారు. పట్టణంలోని పత్తిపాక ప్రాంతానికి చెందిన పోతుగంటి మల్లయ్య 2007 సంవత్సరంలో చిన్నాల జగన్మోహన్ అనే వ్యక్తి సర్వే నెంబర్ 508,510 లలో ప్లాట్లు చేసి విక్రయించగా అందులో ప్లాట్లు కొన్నామని గత 15 సంవత్సరాలుగా ఉన్న అట్టి స్థలం మా కబ్జా లోనే ఉన్నదని ఇప్పుడు దానిని వేరే ఇతర వ్యక్తులు కబ్జా చేసి మున్సిపాలిటీ ద్వారా నిర్మాణ అనుమతులను పొందడానికి ప్రయత్నిస్తున్నారు. వారికి ఎటువంటి అనుమతులు మంజూరు చేయకుండా నిలిపివేసి తమ స్థలానికి రక్షణ కల్పించాలని కోరారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అధికారులు తమ పాత కార్యాలయంలోని ఫర్నిచర్ ను సామాగ్రిని పూర్తిగా ఖాళీ చేసి వేరే ఇతర కార్యాలయాలకు ఉపయోగపడే విధంగా చేయాలని అధికారులను ఆదేశించారు. మండల స్థాయిలో సోమవారం నుండి ప్రారంభమవుతున్న సీఎం కప్ కు సంబంధించిన క్రీడలపై స్పెషల్ ఆఫీసర్స్ దృష్టి పెట్టాలన్నారు. జిల్లాస్థాయిలో వచ్చేవారం 22వ తేదీ నుండి మొదలవుతాయని అన్నారు. అన్ని కేంద్రాలలో ధాన్యం సేకరణ వేగవంతంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ గ్రీవెన్స్ డే లో జిల్లా అధికారులు, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News