ENG VS PAK : 17 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత పాకిస్థాన్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లాండ్ చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకుంది. రావల్పిండి వేదికగా జరిగిన తొలి టెస్టులో పాకిస్థాన్‌పై 74 పరుగుల తేడాతో విజయం సాధించింది. జీవం లేని పిచ్‌పై బ్యాటర్లు పండుగ చేసుకున్న వేళ ఫలితం డ్రా అని అభిమానులు అందరూ ఫిక్స్ అయిన తరుణంలో ఇంగ్లాండ్ బౌలర్లు అద్భుతం చేశారు. ఫలితంగా మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లాండ్ 1-0 ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది.
343 పరుగుల ఛేదనలో ఓవర్‌నైట్ స్కోర్ 80/2 తో ఆఖరి రోజు రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన పాకిస్థాన్ 268 పరుగులకు ఆలౌటైంది. ఇమాముల్ హక్(48), అజర్ అలీ(40), సాద్ షకీల్(76), మహ్మద్ రిజ్వాన్(46) లు పోరాడడంతో ఓ దశలో పాక్ 259/ 6 స్కోర్‌తో లక్ష్యం దిశగా దూసుకుపోతున్నట్లు కనిపించింది. అయితే.. ఇంగ్లాండ్ బౌలర్లు పుంజుకోని మ్యాచ్‌ను మలుపు తిప్పారు. ఆఖరి వరుస బ్యాటర్లను వెంట వెంటనే పెవిలియన్‌కు చేర్చడంతో పాక్ 268 పరుగులకే కుప్పకూలింది. అండర్సన్, రాబిన్సన్ చెరో నాలుగు వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 657 పరుగులు చేయగా పాకిస్థాన్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 579 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లాండ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 264/ 7 వద్ద డిక్లేర్ చేసింది.
ఇరు జట్ల మధ్య ముల్తాన్ వేదికగా డిసెంబర్ 9 నుంచి 13 వరకు రెండో టెస్ట్ మ్యాచ్ జరగనుంది.
ఇంగ్లాండ్ కు షాక్..
ఆల్‌రౌండర్ లివింగ్‌స్టోన్ మిగిలిన రెండు టెస్టు మ్యాచ్‌లకు దూరం అయ్యాడు. ఈ మ్యాచ్‌లో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. కుడి మోకాలికి గాయమైంది. దీంతో అతడు ఈ టెస్ట్ సిరీస్‌కు దూరం అయ్యాడు