Saturday, November 23, 2024
HomeఆటKarimnagar: నగర వ్యాప్తంగా స్టేడియంలు

Karimnagar: నగర వ్యాప్తంగా స్టేడియంలు

కరీంనగర్ నగర వ్యాప్తంగా క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేస్తున్నట్లు కరీంనగర్ నగర మేయర్ యాదగిరి సునీల్ రావు తెలిపారు. కరీంనగర్ అభివృద్ధిలో భాగంగా నగరపాలక సంస్థ కమిషనర్ సేవా ఇస్లావత్ తో కలిసి మేయర్ యాదగిరి సునీల్ రావు 9వ డివిజన్ లో పర్యటించారు. స్థానిక కార్పోరేటర్ జంగిలి ఐలేంధర్ యాదవ్ తో కలిసి నగరంలోని మానేరు డ్యాం సమీపంలోని స్పోర్ట్స్ స్కూల్ ఆవరణలో నగరపాలక సంస్థకు చెందిన 5 లక్షల నిధులతో తెలంగాణ క్రీడా ప్రాంగణానికి భూమి పూజ చేశారు. స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థుల కోసం ఖోఖో, వాలీబాల్, కబడ్డీ, షెటిల్ లాంటి కోర్టుల ఏర్పాటు పనులను ప్రారంభించి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులు, కాంట్రాక్టర్ ను ఆదేశించారు.

- Advertisement -

ఈ సందర్భంగా మేయర్ యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రతిభ కలిగిన క్రీడాకారులను తయారు చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ క్రీడారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ప్రతిభ కలిగిన క్రీడాకారులను తయారు చేయడంతో పాటు క్రీడల ద్వారా శారీరక ధారుడ్యం మెరుగు పరిచేందుకు రాష్ట్ర వ్యాప్తంగా క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు సి.ఎం. కేసీఆర్ శ్రీకారం చుట్టారన్నారు. ప్రతి గ్రామంతో పాటు పట్టణ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు. అందులో భాగంగా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం కరీంనగర్ నగరపాలక సంస్థ ద్వారా నగర వ్యాప్తంగా ప్రతి డివిజన్ లో ఎక్కడ స్థలం అందుబాటులో ఉంటే అక్కడ పెద్ద ఎత్తున నిధులు కేటాయించి క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. డివిజన్ లోని పిల్లలు, యువతకు క్రీడల పట్ల ఆసక్తిని పెంచేలా చర్యలు తీసుకుంటూ డివిజన్ల వారీగా ఖోఖో, వాలీబాల్, కబడ్డీ, షెటిల్ లాంటి క్రీడల కోర్టులను ఏర్పాటు చేసి కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. ఇప్పటికే చాలా చోట్ల క్రీడ ప్రాంగణాలు ఏర్పాటు చేయడంతో పాటు స్థలం ఉన్న చోట ఇంకా క్రీడా మైదానాలను ఏర్పాటు చేసేందుకు నగరపాలక సంస్థ చర్యలు తీసుకుంటోందని తెలిపారు.

క్రీడా రంగంపై దృష్టి పెట్టి మంచి క్రీడాకారుల తయారు చేసేందుకు ప్రోత్సాహం అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవలే చెస్ క్రీడలో ప్రతిభను చూపి గ్రాండ్ మాస్టర్ హోదా సాధించిన ఉప్పల ప్రణిత్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా నిలిచారని తెలిపారు. చెస్ క్రీడలో ఇంకా రాణించి రాష్ట్రానికి మంచి పేరు తేవాలనే ఉద్దేశ్యంతో అతని శిక్షణకు అవసరమయ్యే రెండున్నర కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని కూడా అందించారని తెలిపారు. మారుమూల ప్రాంతాలకు చెందిన నికత్ జరీన్, అసామొద్దిన్ లాంటి వారితో పాటు వివిధ క్రీడల్లో ప్రతిభ చూపిన క్రీడాకారులకు అనేక రకాలుగా ప్రభుత్వ పక్షాన తగిన ప్రోత్సాహం ఇస్తున్నట్లు తెలిపారు. ఇలా క్రీడా రంగంలో గ్రామగ్రామాల్లో ప్రతిభ ఉన్న క్రీడాకారులను వెలికి తీసేందుకు కొత్తగా చీఫ్ మినిస్టర్ కప్ పేరుతో వివిధ క్రీడా పోటీలను కూడా నిర్వహించడం జరుగుతోందన్నారు. ఇలా క్రీడా రంగాన్ని రాష్ట్రం లో మెరుగు పరిచేందుకు ఎన్నో కార్యక్రమాలతో ముఖ్యమంత్రి ముందుకు సాగుతున్నారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఈఈ మహేందర్, డీఈ ఓం ప్రకాష్, ఏఈ వాణీ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News