Saturday, November 23, 2024
Homeఓపన్ పేజ్South India: బీజేపీకి కొరకరానికొయ్యగా సౌతిండియా

South India: బీజేపీకి కొరకరానికొయ్యగా సౌతిండియా

కర్ణాటకలో 2006లోనే మిత్రపక్షాలతో కలిసి బీజేపీ అధికారంలోకి వచ్చింది. దీంతో కర్ణాటకలో కొంత‌వ‌ర‌కు పార్టీకి బ‌ల‌మైన క్యాడర్‌ త‌యారైంది. ఈ క్రెడిట్ బీజేపీ అధిష్టానానిది కాదు. క‌చ్చితంగా బీఎస్ య‌డ్యూర‌ప్పదే. కర్ణాటకలో బీజేపీకి ప‌క్కాగా పునాదులు వేసిన నాయకుడు య‌డ్యూరప్ప. కర్ణాటకలో య‌డ్యూర‌ప్ప నాయకత్వ ప్రతిభ, లింగాయ‌త్ సామాజిక‌వ‌ర్గం అండ‌దండ‌ల వ‌ల్లే బీజేపీ బ‌ల‌మైన పార్టీగా అవ‌త‌రించింది. లింగాయ‌త్ ల అండ‌ లేకుంటే కన్నడనాట క‌మ‌లం పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారేది. య‌డ్యూర‌ప్ప లేకుండా ఎన్నిక‌ల‌కు వెళ్లిన బీజేపీ 2013లో చిత్తుగా ఓడింది. బీజేపీ ఓడింది అన‌డం కంటే య‌డ్యూర‌ప్ప ఓడించారు అన‌డం క‌రెక్ట్.

- Advertisement -

ఎక్కడికక్కడ బలమైన ప్రాంతీయ పార్టీలు
ఇక మిగ‌తా నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఎద‌గ‌క‌పోవ‌డానికి అక్కడి రాజ‌కీయ ప‌రిస్థితులే కార‌ణం. ఈ నాలుగు రాష్ట్రాల్లోనూ బ‌ల‌మైన ప్రాంతీయ పార్టీలున్నాయి. కొన్ని ప్రత్యేక ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఈ ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చాయి. జాతీయ పార్టీల వైఫ‌ల్యాలే సౌతిండియాలో బ‌ల‌మైన ప్రాంతీయ పార్టీలు పుట్టుక‌కు కార‌ణంమయ్యాయి. విభ‌జ‌న తరువాత ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ఉనికే లేకుండా పోయింది. దీంతో రెండు బ‌ల‌మైన ప్రాంతీయ పార్టీలు టీడీపీ, వైఎస్ ఆర్ కాంగ్రెస్ మాత్రమే ఏపీ రాజ‌కీయాల‌ను శాసించ‌డం మొద‌లైంది. విభ‌జ‌న త‌రువాత జ‌రిగిన ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకుంది. 2014లో జ‌రిగిన ఈ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ అండ‌తో టీడీపీ అధికారంలోకి వ‌చ్చింది. చంద్రబాబు నాయుడు కేబినెట్‌లో బీజేపీ కూడా చేరింది. అయితే ఏపీలో కమలం పార్టీ ఆశించినస్థాయిలో బ‌ల‌ప‌డ‌లేక‌పోయింది. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ బ‌ల‌ప‌డాలంటే అటు టీడీపీతోనో, ఇటు వైఎస్ ఆర్ కాంగ్రెస్ తోనో పొత్తు పెట్టుకుని తీరాల్సిందే. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి స్వంత కేడ‌ర్ అంటూ లేదు. ఎదుటి పార్టీల మీద ఆధార‌ప‌డాల్సిందే. కేర‌ళ విష‌యానికి వ‌స్తే ఇక్కడ మొద‌టి నుంచి లెఫ్ట్ పార్టీల ఆధిప‌త్యం ఎక్కువ‌. వామ‌ప‌క్ష భావ‌జాలం ఉన్న కేర‌ళ ప్రజలు హిందూత్వ అజెండాతో వ‌చ్చిన బీజేపీ ని స‌హ‌జంగానే దూరం పెట్టారు. త‌మిళ‌నాడు రాష్ట్రంలో అయితే అక్కడ మొద‌టి నుంచి ద్రవిడ పార్టీల‌దే హ‌వా. అంతేకాదు దేశంలోనే తొలిసారి ఒక ప్రాంతీయ పార్టీ (డీఎంకే ) అధికారంలోకి వ‌చ్చింది త‌మిళ నేలపైనే అంటారు రాజ‌కీయ విశ్లేష‌కులు. తమిళనాడులో ప్రాంతీయ పార్టీల‌దే హ‌వా. బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ తమిళనాట ద్రవిడ పార్టీలతో పొత్తు పెట్టుకుని నాలుగు సీట్లు తెచ్చుకోవ‌డం త‌ప్ప వేరే మార్గం లేదు. ఒక్క మాట‌లో చెప్పాలంటే ప్రాంతీయ పార్టీల స‌త్తా చాటిన నేల త‌మిళ‌నాడు. పెరియార్ రామ‌స్వామి ఆలోచ‌న‌ల పునాదిగా బ్రాహ్మణ ఆధిప‌త్యానికి వ్యతిరేకంగా ద్రవిడ మున్నేట్ర క‌ళ‌గం ఆవిర్భవించింది. డీఎంకే నుంచి చీలివ‌చ్చిన పార్టీయే అన్నాడీఎంకే . క‌రుణానిధి ఆధిప‌త్యాన్ని ప్రశ్నిస్తూ సినీ న‌టుడు ఎంజీ రామచద్రన్‌ 1972లో అన్నాడీఎంకే ను ఏర్పాటు చేశారు. ఈ రెండు పార్టీల మ‌ధ్య సైద్దాంతిక గొడ‌వ‌లు పెద్దగా లేవు.రెండు పార్టీల నాయ‌కుల‌కు పెరియార్ రామ‌స్వామి నాయ‌క‌ర్ పొలిటిక‌ల్ ఫిలాస‌ఫీయే మూలం. స‌హ‌జంగా ద్రవిడ పార్టీలు హిందీ భాష‌కు, బ్రాహ్మణవాదానికి వ్యతిరేకం కాబ‌ట్టి ఆ వాస‌నలున్న బీజేపీ, త‌మిళ నేలపై కాలు మోప‌లేక‌పోయింది. చివ‌ర‌గా బీజేపీ అగ్ర నాయ‌కత్వానికి కాస్తంత రిలీఫ్ ఇచ్చింది తెలంగాణానే. 2019 సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 17 లోక్‌సభ స్థానాల్లో నాలుగు సీట్లను బీజేపీ గెలుచుకుంది. ఇక్కడ ఓ విశేషం చెప్పుకోవాలి. 1984 లోక్‌సభ ఎన్నిక‌ల్లో బీజేపీకి దేశ‌వ్యాప్తంగా రెండే రెండు సీట్లు ద‌క్కాయి. అందులో ఒక‌టి ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లాలోని హన్మకొండ కావ‌డం విశేషం. 1984లో బీజేపీ క్యాండిడేట్‌గా పోటీచేసిన చందుప‌ట్ల జంగారెడ్డి, కాంగ్రెస్ టికెట్ పై బ‌రిలో నిలిచిన పీవీ న‌ర‌సింహారావు ను ఓడించి సంచ‌ల‌నం సృష్టించారు.

ఉత్తరాది పార్టీగా బీజేపీపై ముద్ర
1980లో అటల్ బిహారీ వాజ్‌పేయి నాయకత్వంలో భార‌తీయ జ‌న‌తా పార్టీ ఏర్పడినప్పటి నుంచి ఆ పార్టీకి ఉత్తరాది పార్టీగా ముద్ర ప‌డింది. త్రిపుర‌, అసోం వంటి ఈశాన్య రాష్ట్రాలతో పాటు క్రిస్టియ‌న్లు పెద్ద సంఖ్యలో ఉండే గోవాలోనూ ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన‌ప్పటికీ క‌మ‌లం పార్టీ పై ఆ ముద్ర ఇప్పటికీ అలాగే ఉండిపోయింది. దీనికి కార‌ణం స‌హ‌జంగా బీజేపీ ప్ర‌స్తావించే అంశాలే కావ‌చ్చు. హిందీ భాష‌కు పెద్ద పీట వేయ‌డం, సంస్కృత భాష‌ను దేవ‌భాష అంటూ కీర్తించ‌డం, ద్రవిడ భాషలను చిన్నచూపు చూస్తారన్న ఆరోపణలు కావచ్చు. సహజంగా ఇవన్నీ ద్రవిడులకు నచ్చవు. అంతేకాదు. ఇవేవీ ద‌క్షిణాది కల్చర్‌తో క‌నెక్ట్ అయ్యే అంశాలు కూడా కావు. దక్షిణాదిన భాషాభిమానం బాగా ఎక్కువ‌. త‌మిళ‌నాడు దీనికి ప‌రాకాష్ట. దక్షిణాదిన ప్రతి రాష్ట్రంలోనూ ఒక్కో భాష మాట్లాడ‌తారు. హిందీ భాష‌ను బ‌ల‌వంతంగా రుద్దడాన్ని ద‌క్షిణాది ప్రజలు వ్యతిరేకిస్తారు. హిందీ భాషను బలవంతంగా రుద్దడానికి వ్యతిరేకంగా దక్షిణాదిన ఆందోళ‌న‌లు కూడా జ‌రిగాయి. మొత్తంమ్మీద హిందీ బెల్ట్‌లో నివ‌సించే ప్రజల ప్రయోజనాలను కాపాడే ఉత్తరాది పార్టీగానే క‌మ‌లాన్ని ఇప్పటికీ ద‌క్షిణాది ప్రజలు చూస్తుంటారు.

దక్షిణాదిన మాస్ లీడర్ కొరత
దక్షిణాదిన ఆశించిన‌స్థాయిలో క‌మ‌లం విక‌సించ‌క‌పోవ‌డానికి మ‌రో ప్రధాన కారనం ఆ పార్టీకి మాస్ లీట‌ర్ అంటూ ఎవ‌రూ లేక‌పోవ‌డం. య‌డ్యూర‌ప్ప ఒక్కరే దీనికి మిన‌హాయింపు. అయితే య‌డ్యూర‌ప్ప ప‌లుకుబ‌డి కూడా కర్ణాటక రాష్ట్రానికే ప‌రిమితం. మొత్తంగా యావత్ ద‌క్షిణాదిని ప్రభావితం చేయ‌గ‌ల మ‌హా నాయ‌కుడు అంటూ బీజేపీలో ఎవ‌రూ లేరు. అయిదు రాష్ట్రాల్లోనూ ప్రాంతీయ పార్టీలు బ‌లంగా ఉండ‌టం మ‌రో కార‌ణం. దీంతో బీజేపీ ఎంటర్ కావడానికి ఎక్కడా చెప్పుకోదగ్గ స్థాయిలో రాజ‌కీయ శూన్యత అంటూ లేదు. జాతీయ పార్టీ కాంగ్రెస్ పై కోపం వ‌స్తే ఆ ఓట్లు స‌హ‌జంగా ప్రత్యర్థిగా ఉన్న ఏదో ఒక ప్రాంతీయ పార్టీకే ప‌డ‌తాయి. బీజేపీ వైపు జ‌నం చూసేంత‌టి సీన్ దక్షిణాదిన క‌నిపించ‌దు.

మితిమీరిన హై క‌మాండ్ జోక్యం
బీజేపీలో అధికారం అంతా హ‌స్తినలోనే కేంద్రీకృతమై ఉంటుంది. రాష్ట్ర నాయ‌కుల‌కు ఎలాంటి అధికారాలు ఉండ‌వు. దీంతో రాష్ట్ర వ్యవహారాల్లో హై క‌మాండ్ జోక్యం విప‌రీతంగా ఉంటుంది. య‌డ్యూర‌ప్ప వంటి జననేత కూడా 2018 ఎన్నికల్లో విజయం తరువాత క్యాబినెట్‌ ఏర్పాటు చేసుకోవ‌డానికి కొన్ని రోజుల పాటు హై క‌మాండ్ అనుమ‌తి కోసం ఎదురు చూశారంటే ప‌రిస్థితిని అర్థం చేసుకోవ‌చ్చు. దక్షిణాదిన బీజేపీ బ‌ల‌ప‌డ‌క‌పోవ‌డానికి ఇదొక కార‌ణ‌ం. అదే ప్రాంతీయ పార్టీ అయితే ఆ సంగ‌తి వేరుగా ఉంటుంది. రాష్ట్ర రాజ‌ధానిలోనే ఏ సమస్యపైన అయినా పంచాయితీ పెట్టి ఇష్యూను సెటిల్ చేసుకోవ‌చ్చు. కదిలితే, మెదిలితే హ‌స్తిన పర్యటనల వంటి త‌ల‌నొప్పులు ఉండ‌వు.

ద‌క్షిణాదిపై బీజేపీ చిన్నచూపు ?
బీజేపీ త‌మ‌ను చిన్న చూపు చూస్తోంద‌ని మెజారిటీ సౌతిండియ‌న్లు భావిస్తున్నారు. రాజ‌కీయాల‌తో ఏమాత్రం సంబంధం లేని సామాన్య ప్రజల అభిప్రాయం ఇది. అందుకే అన్ని విధాల ద‌క్షిణాదికి అన్యాయం జ‌రుగుతోంద‌న్నది వీరి ఆరోప‌ణ‌. నిధులు ఇచ్చేట‌ప్పుడు కూడా యూపీ, బీహార్ స‌హా హిందీ బెల్ట్ లో ఉన్న రాష్ట్రాలకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం టాప్ ప్రయారిటీ ఇస్తోందన్నది ద‌క్షిణాన అధికారంలో ఉన్న ప్రభుత్వాల ఆరోప‌ణ‌. దేశాన్ని ఏలుతోంది కూడా ఉత్తరాదికి చెందిన నాయ‌కులే కావ‌డం వ‌ల్ల సౌతిండియాకు తీర‌ని అన్యాయం జ‌రుగుతోంద‌న్న వాద‌న రాజ‌కీయ‌వ‌ర్గాల్లో వినిపిస్తోంది.

దక్షిణాదిన హిందూ, ముస్లిం పోల‌రైజేష‌న్ లేదు

క‌మ‌లం పార్టీ నాయ‌కులు పైకి ఎన్ని మాట‌లు చెప్పినా, హిందూత్వ అజెండా చుట్టూనే ఆ పార్టీ రాజ‌కీయాలు తిరుగుతుంటాయ‌న్నది బ‌హిరంగ ర‌హ‌స్యం. అయితే హిందూత్వ అజెండా, ద‌క్షిణాన పెద్దగా వ‌ర్క్ అవుట్ కాదు. అయ్యే అవ‌కాశాలు కూడా కనడవు. పౌర స‌మాజం హిందూ, ముస్లింగా డివైడ్ అయిన‌ప్పుడు మాత్రమే హిందూత్వ అజెండా ప‌నిచేస్తుంది. ఉత్తరాదిలాగా ద‌క్షిణాది స‌మాజంలో హిందూ, ముస్లిం పోల‌రైజేష‌న్ జ‌ర‌గ‌లేదు. కేర‌ళ‌లోని కొన్ని పాకెట్స్ లోనే ముస్లింలీగ్ పార్టీ క‌నిపిస్తోంది. కేరళలో కూడా మారిన రాజకీయ పరిస్థితుల్లో ముస్లింలీగ్ పాత్ర కూడా చాలా త‌క్కువే. కేర‌ళ మిన‌హాయిస్తే దక్షిణాదిన మరెక్కడా ముస్లింలీగ్ ఛాయ‌లు కూడా క‌నిపించ‌వు. ఆంధ్రప్రదేశ్‌ ముస్లింలు రాజ‌కీయంగా టీడీపీకో, కాంగ్రెస్‌కో, ప్రస్తుత వైఎస్ ఆర్ కాంగ్రెస్‌కో మద్దతుదారులుగానే ఉన్నారు. ఏరోజూ ముస్లింలీగ్ వంటి ఫండ‌మెంట‌ల్ పార్టీల వైపు చూడ‌లేదు. దీంతో ఏపీలో బీజేపీ బ‌ల‌ప‌డ‌లేక‌పోతోంది. అయితే తెలంగాణ‌లో ప‌రిస్థితి కొంత‌వ‌ర‌కు భిన్నంగా ఉంటుంది. తెలంగాణ‌, నైజాం పాలించిన ప్రాంతం. దీంతో పాల‌కులైన నిజాం రాజుల మీద ఉన్న వ్యతిరేకత కాలక్రమంలో సాధార‌ణ ముస్లిం ప్రజలపై ప్రతిబింబించింది. దీంతో తెలంగాణలో బీజేపీ కొంతవరకు పుంజుకోగలిగింది. పైపెచ్చు హైద‌రాబాద్ న‌గ‌రంలో మ‌జ్లిస్ పార్టీ బ‌లంగా ఉండ‌టంతో దానికి కౌంట‌ర్ గా బీజేపీ కొంతమేర ఎదిగింది. ఏమైనా ద‌క్షిణాన మ‌తసామ‌ర‌స్యం వెల్లి విరిసింది. రాజ‌కీయాల‌ను మ‌తం కోణం నుంచి చూడరు దక్షిణాది ప్రజలు. సౌతిండియ‌న్ల ఈ రాజకీయ పరిణతే, బీజేపీని ద‌క్షిణాదిన ఎదగనివ్వడం లేదు.

– ఎస్‌. అబ్దుల్ ఖాలిక్ 63001 74320 సీనియర్ జర్నలిస్ట్

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News