తలలో మాత్రమే చుండ్రు సమస్య తలెత్తుతుందని అనుకుంటాం. కానీ కనురెప్పలు, కనుబొమ్మలపై సైతం చుండ్రు ఏర్పడుతుందని తెలుసా? ఈ సమస్య పరిష్కారం కోసం కొన్ని సహజసిద్ధమైన టిప్స్ ఉన్నాయి. కనుబొమ్మలపై, కనురెప్పలపై చుండ్రు తలెత్తడానికి ముఖ్యంగా రెండు కారణాలు ఉన్నాయి. బ్లెఫారిటస్ డెర్మటైటిస్, సెబోరిహెక్ డెర్మటైటిస్ మూలంగా కనుబొమ్మలు, కనురెప్పలపై చుండ్రు సమస్య తలెత్తుతుంటుంది. బ్లెఫారిటస్ డెర్మటైటిస్ వల్ల కనురెప్పల అంచుల్లోవాపు, మంట, ఇరిటేషన్ లాంటివి వస్తాయి. రెండవది అంటే సెబోరిహెక్ డెర్మటైటిస్ లో క్రానిక్ ఇన్ఫ్లమేటరీ స్కిన్ కండిషన్ ఎదుర్కొంటాం. వీటి నివారణకు శక్తివంతమైన ఇంటి చిట్కాలు ఉన్నాయి.
బాదం నూనె చర్మంపై ఉండే మ్రుతకణాలను పోగొడుతుంది. అంతేకాదు కంటి చుట్టూ ఉండే ప్రదేశాన్ని ఎంతో మ్రుదువుగా ఉండేలా చేస్తుంది. కనుబొమ్మలు, కనురెప్పలపై బాదం నూనె అప్లై చేయడం వల్ల అక్కడ ఉండే వెంట్రుకుల కుదుళ్లు ఆరోగ్యంగా ఉండడమే కాకుండా ఆ ప్రదేశంలో జుట్టు పెరుగుతుంది. రాత్రి పడుకోబోయే ముందు టేబుల్ స్పూను బాదం ఆయిల్ తీసుకుని దాన్ని వేడి చేసి కనుబొమ్మలు, కనురెప్పల మీద సున్నితంగా మసాజ్ చేయాలి. దాన్ని రాత్రంతా అలాగే ఉంచుకోవాలి. ఉదయం లేచిన తర్వాత చల్లటి నీళ్లతో కనురెప్పలు, కనుబొమ్మలు శుభ్రంగా కడుక్కోవాలి.
ఫంగస్ కారణంగా కనుబొమ్మలు, కనురెప్పలపై ఏర్పడే చుండ్రు పోగొట్టడానికి టీ ట్రీ ఆయిల్ ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది. ఇందులో యాంటీఫంగల్ సుగుణాలు చాలా ఉన్నాయి. టేబల్ స్పూను టీట్రీ ఆయిల్ తీసుకుని దాన్ని మైక్రోవేవ్ లో కొన్ని సెకన్ల పాటు వేడిచేయాలి. ఆ తర్వాత అందులో కాటన్బాల్ ముంచి దానితో కనుబొమ్మలపై, కనురెప్పలపై సున్నితంగా రాసి పది నిమిషాలు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కనుబొమ్మలు, కనురెప్పలను శుభ్రంగా కడగాలి. ఇలా రోజుకు మూడుసార్లు
చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
కనుబొమ్మలు, కనురెప్పల చుట్టూ వాపు, పొడిబారినట్టు ఉంటే చుండ్రు సమస్య తలెత్తుతుంది. దాని నుంచి ఉపశమనం పొందాలంటే వార్మ్ కంప్రస్ తో ప్రయత్నించి చూడండి. ఇందుకు కొన్ని వేనీళ్లు తీసుకుని అందులో మెత్తని గుడ్డను కొన్నినిమిషాలు నానబెట్టి బయటకు తీసి పిండాలి. ఆతర్వాత ఆ గుడ్డను కనులపై కప్పి పదిహేను నిమిషాలు అలాగే ఉంచాలి.
ఈ సమస్య నివారణకు డ్రగ్ స్టోర్ లో ప్రత్యేక సోప్స్ లభిస్తాయి. పిరిథియోన్ జింక్ సోప్ ఈ సమస్యను నివారిస్తుంది. కనురెప్పలపై వచ్చే చుండ్రు కారణంగా తలెత్తే ఇరిటేషన్, ఎరుపుదనం, పొడిబారినట్టు ఉండడాన్ని ఈ సోప్ తగ్గిస్తుంది. మీరు చేయాల్సిందల్లా కళ్లు గట్టిగా మూసుకుని తడిచేసిన ఆ సోప్ తో కనుబొమ్మలపై, కనురెప్పలపై సున్నితంగా రుద్ది నీళ్లతో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా రోజుకు రెండుసార్లు చేయాలి.
ఈ సమస్య పరిష్కారం కోసం కంటిమీద ఉపయోగించే ఉత్పత్తులు ఇరిటేషన్ కారకాలు కాకూడదు. సున్నితమైనవై ఉండాలి. ఉదాహరణకు బేబీ షాంపు కనురెప్పలపై, కనుబొమ్మలపై ఏర్పడ్డ చుండ్రును తొలగించడంలో బాగా పనిచేస్తుంది. కళ్లకు కావలసిన సాంత్వననివ్వడమే కాకుండా మూసుకుపోయిన చర్మ రంధ్రాలను శుభ్రంచేస్తుంది. అంతేకాదు పొడిబారినట్టున్న కనుబొమ్మలు, కనురెప్పల చుట్టూ పేరుకున్న
నూనెపదార్థాలను లేకుండా శుభ్రం చేస్తుంది. చుండ్రుకు కారణమైన బాక్టీరియా లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్ ను పోగొడుతుంది. షాంపులో కొన్ని నీళ్లుకలిపి కాస్త పలుచగా చేసి కాటన్ బాల్ తో కనురెప్పలపై దాన్ని అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల ఎంతో సాంద్రంగా ఉండే అందులోని రసాయనాలు పలుచగా అవుతాయి. కళ్లకు హాని కలిగించవు.
కనురెప్పలు, కనుబొమ్మలు పొడిబారితే చుండ్రు సమస్య తలెత్తుతుంది. వీటికి తగిన తేమ అందేట్టు చేస్తే చర్మం పొడిబారిన తనాన్ని తగ్గించవచ్చు. ఇందుకు మాయిశ్చరైజర్ స్వభావం ఉన్న ఆలివ్ ఆయిల్ బాగా పనిచేస్తుంది. కనురెప్పలు, కనుబొమ్మల చుట్టూ ఉన్న సున్నితమైన చర్మానికి కావలసిన హైడ్రేషన్ ను అందజేసి చుండ్రు సమస్యను నివారిస్తుంది. ఇందుకు ఒక టేబుల్ స్పూను ఆలివ్ ఆయిల్, గోరువెచ్చని నీళ్లు, మెత్తగా ఉండే తెల్లని గుడ్డ తీసుకుని రెడీ పెట్టుకోవాలి. ఆలివ్ ఆయిల్ ని కొన్ని సెకన్లపాటు మైక్రోవేవ్ లో వేడిచేసి దానితో కనురెప్పలపై, కనుబొమ్మలపై సున్నితంగా మసాజ్ చేయాలి. గోరువెచ్చటి నీళ్లల్లో మెత్తటి గుడ్డను కాసేపు నాననిచ్చి దానిని కళ్లమీద పెట్టుకోవాలి. ఇలా పదిహేను నిమిషాల కళ్లపై ఉంచుకున్న తర్వాత ఆ గుడ్డ తీసేసి గోరువెచ్చటి నీటితో కనురెప్పలపై, కనుబొమ్మలపై ఉన్న ఆలివ్ ఆయిల్ ని శుభ్రంగా కడిగేయాలి. ఇలా రోజూ చేస్తే కనురెప్పలు ఆరోగ్యంగా, శుభ్రంగా ఉంటాయి.
కనుబొమ్మలు,కనురెప్పలపై చేరిన చుండ్రును తగ్గించడంలో అలొవిరా జెల్ మరింత శక్తివంతంగా పనిచేస్తుంది. ఇది కనురెప్పలపై, కనుబొమ్మలపై చుండ్రుకు కారణమైన ఫంగస్, బాక్టీరియాలను నివారించడమే కాకుండా ఎరుపుదనాన్ని, ఇరిటేషన్ ని కూడా తగ్గిస్తుంది. అంతేకాదు ఆ ప్రదేశాలలో ఉన్న జుట్టు కుదుళ్లను పటిష్టం చేయడమేకాకుండా వెంట్రుకలు పెరిగేలా కూడా దోహదపడుతుంది. కళ్లు గట్టిగా మూసుకుని కాటన్ బాల్ తో అలొవిరా జెల్ ను కనురెప్పలపై, కనుబొమ్మలపై అప్లై చేయాలి. దాన్ని ఐదు నిమిషాలపాటు అలాగే ఉంచుకుని ఆ తర్వాత గోరువెచ్చనినీటితో కనుబొమ్మలను, కనురెప్పలను శుభ్రంగా కడిగేయాలి.
కనురెప్పలపై ఏర్పడ్డ చుండ్రును నివారించడంలో ఉప్పు ఎంతో బాగా పనిచేస్తుంది. ఇధి కనురెప్పలను శుభ్రం చేయడమే కాకుండా కనురెప్పలు, కనుబొమ్మల చుట్టూ చేరిన అధిక నూనెను పీలుస్తుంది. చుండ్రుకు కారణమైన ఫంగల్ ఇన్ ఫెక్షన్ ను రాకుండా నిరోధిస్తుంది. ఒక టేబుల్ స్పూను ఉప్పు, పావు కప్పు నీళ్లు రెడీ పెట్టుకోవాలి. ఉప్పును ఆ నీళ్లల్లో వేసి బాగా కరిగే వరకూ కలపాలి. కళ్లు మూసుకుని కంటిరెప్పలపై, కనుబొమ్మలపై ఈ నీళ్లు అప్లై చేసి మెల్లగా ఎక్స్ ఫొయిలేషన్ చేయాలి. తర్వాత చల్లటి నీళ్లతో ఆ ప్రదేశాలను శుభ్రంగా కడగాలి. ఇలా రోజూ చేస్తే కనురెప్పలు, కనుబొమ్మలు ఎలాంటి ఇన్ఫెక్షన్ల బారినా పడవు. చుండ్రుసమస్య తలెత్తదు.
కనురెప్పలపై, కనుబొమ్మలపై ఏర్పడ్డ చుండ్రును పోగొట్టడంలో నిమ్మరసం బాగా పనిచేస్తుంది. ఇందులోని సిట్రిక్ యాసిడ్ చుండ్రు సమస్యను నిరోధిస్తుంది. ఇది యాంటిమైక్రోబియల్ ఏజెంట్. చుండ్రుకు కారణమైన ఫంగల్ ఇన్ ఫెక్షన్ ను ఇది నివారిస్తుంది. ఒక టేబుల్ స్పూను నిమ్మరసం తీసుకుని అందులో పావు కప్పు నీళ్లు కలిపి పలచన చేయాలి. కళ్ల గట్టిగా మూసుకుని కనురెప్పలపై,
కనుబొమ్మలపై ఈ సొల్యూషన్ ని కాటన్ బాల్ ఉపయోగించి జాగ్రత్తగా అప్లై చేయాలి. దాన్ని ఐదునిమిషాల పాటు అలాగే ఉంచుకుని చల్లని నీళ్లతో కనుబొమ్మలు, కనురెప్పలను కడుక్కోవాలి. ఈ రొటీన్ ను రోజుకు రెండు సార్లు చేస్తే కనురెప్పలు, కనుబొమ్మలు ఎంతో ఆరోగ్యంగా ఉంటాయి.
పొడిచర్మం కారణంగా కనురెప్పలపై, కనుబొమ్మలపై చుండ్రు వస్తుంది. పెట్రోలియం జల్ ఈ సమస్యను పరిష్కరించడంలో ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది. కావలసినంత మాయిశ్చరైజర్ ని చర్మానికి అందిస్తుంది. పొడిచర్మం పగిలిపోకుండా, పొట్టురాలకుండా సంరక్షిస్తుంది. చుండ్రు తలెత్తకుండా అడ్డుకుంటుంది. రాత్రి నిద్రపోవడానికి ముందు కొద్దిగా పెట్రోలియం జల్ వేళ్లతో తీసుకుని కనురెప్పలు, కనుబొమ్మలపై అప్లై చేసుకోవాలి. మరునాటి ఉదయం గోరువెచ్చనినీటితో కనురెప్పలు, కనుబొమ్మలను శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా ప్రతి రోజు రాత్రి చేయడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది.
కనురెప్పలపై, కనుబొమ్మలపై దుమ్ము పేరుకోవడం వల్ల కూడా చుండ్రుసమస్య తలెత్తుతుంది. అందుకే నాణ్యమైన మేకప్ రిమూవర్ తో ప్రతిరోజు రాత్రి మేకప్ ను శుభ్రంగా తొలగించాలి. కళ్ల చుట్టూ భాగాన్ని కూడా శుభ్రం చేసుకోవాలి. రోజులో కనీసం పన్నెండు గ్లాసుల నీళ్లు తాగాలి. టీ, కాఫీలు, జంక్ ఫుడ్ జోలికి పోవద్దు. అలాగే తాజా పండ్లు, కూరగాయలు బాగా తినడం వంటి అలవాట్ల వల్ల చర్మం, శిరోజాలు ఎలాంటి ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటాయి. కనురెప్పలపై, కనుబొమ్మలపై చుండ్రు ఉండడాన్ని గుర్తిచినప్పుడు కొన్ని రోజులు మేకప్ కు దూరంగా ఉండడం మంచిది.